- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సాహిత్య ప్రక్రియల్లో సవ్యసాచి... కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ కథ, కథానిక, నవల, నాటకం, హరికథలు మొదలైన సాహితీ ప్రక్రియలను తన కలం ద్వారా 2000 కు పైగా రాసి సుసంపన్నం చేయడం ద్వారా నిత్య కృషీవలుడిగా వెలుగొందుతున్నారు. అలాగే ఆయన సవ్యసాచిలా 16 సంవత్సరాలు వైమానిక దళంలో ఇంజనీరుగా, 20 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేశారు. హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నారు. రేడియోలో 120కి పైగా నాటిక, నాటకాలు రాశారు. దూరదర్శన్‌లో సీరియల్స్ , ప్రసంగాలు, ప్రముఖ పత్రికల్లో లీగల్ రచనలు.. ఇంకా మరెన్నో. వారి సాహితీ బహుముఖీనత అబ్బురమే కాదు ఆనందాన్ని కలిగిస్తాయి.
చిన్నవయసులోనే మేధావుల ప్రశంసలు..
1955లో తమ 11వ ఏట ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం వారి ఎనభైవ వసంతంలో కూడా కొనసాగడం స్ఫూర్తిదాయకం, ముదావహం. చిన్నవయసులోనే పిలకా గణపతి శాస్త్రి, నాగభైరవ కోటేశ్వరరావు వంటి మేధావుల ప్రశంసలు అందుకున్నారంటే ఆయన రచనా శైలి అర్థం చేసుకోవచ్చు. ఆయన కుటుంబ, సామాజిక, దేశ నేపధ్యంతో రాసిన కథలు ఎంతగానో పాఠకులను అలరించాయి. వారు హాస్యాన్ని కూడా పండించగలరు. వీరు రాసిన కథానిక 'గోంగూర నైవేద్యం' దానికి చక్కని ఉదాహరణ. కుటుంబ సంబంధాలను జిహ్వాచాపల్యంతో ముడిపెట్టి చక్కని హాస్యం తో కథను ముందుకు నడిపించడం పాఠకులను ఆకట్టుకుంది.
రోగగ్రస్తురాలైన అత్తగారు గోంగూర పచ్చడిపై తన జిహ్వచాపల్యాన్ని తీర్చుకోవడానికి కోడలు తన కొడుకుతో ప్రేమ వివాహానికి తాను అందించిన తోడ్పాటును అడ్డంపెట్టుకుని ప్రేమగా బెదిరించడం ఆకట్టుకుంది. ఇంటి యజమాని మామగారు వైద్యం లో భాగంగా గోంగూర పచ్చడి ని దూరం చేయడం, మామగారికి తెలియకుండా తెలుగు తల్లికి నైవేద్యంగా గోంగూరపచ్చడిని…(గోంగూరను ఆంధ్ర మాత అంటారు తెలుగు లోగిళ్లలో) నైవేద్యం పెట్టమనడం ఆ గిన్నె కింద పడడం, గుట్టు రట్టవడం చివరకు మామగారు దగ్గరుండి తన భార్యకు బ్రెడ్ ముక్కల మధ్య జామ్‌గా ఆంధ్రమాతను రాయడం కథకు ముగింపుగా ఇచ్చారు. వైద్యుడు కొంచెం కారం తినవచ్చునని పర్మిషన్ ఇచ్చాడని చెబుతూ 'తెలుగు తల్లికి ఆంధ్ర మాత నైవేద్యం' అంటూ హాస్యాన్ని రంగరించడం పాఠకులను అలరింపజేస్తుంది..
మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ..
మరో కధానిక 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ'లో కమలమ్మ పెళ్లి అవడం, అమెరికా ప్రయాణం, అక్కడ ప్రమాదం.. చక్రాల కుర్చీకి పరిమితం అవ్వడం.. 25 ఏళ్లుగా కదలలేకపోవడం, తన కుమార్తెను తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పెంచడం.. చైనా వైద్యుడు తటస్థ పడడం.. జబ్బనయమవడం.. కమలమ్మ భర్త కుమార్తెలతో ఎంతో ఉత్సుకతతో భారత్ వచ్చి.. తను పుట్టి పెరిగిన జన్మభూమి తన సోదరుల ఇంట పల్లెలో దిగడం జరుగుతుంది. తాను ఊహించుకున్న దానికి భిన్నంగా ఉన్నది ఊరి పరిస్థితి. సోదర కుటుంబాలు అంటకాగుతున్న పరాయి సంస్కృతి చూసి ఖిన్నురాలవుతుంది. కనీసం ఒక్క తెలుగు పద్యం కూడా రాని వారి తెలుగుతనం చూసి తెల్లబోయింది. తాను అమెరికాలో ఉన్నా, కూతురికి తాను చిన్నతనంలో నేర్చుకున్న పద్యాలన్నీ కంఠస్థం చేయించింది. తన కూతురికి వేస్తున్న పట్టు పరికిణీ, చెవుల లోలకులు చూసి వారు అమెరికాలో ఉంటున్నా ఇంకా పాత చింతకాయ పచ్చడి విధానాలు అని ఎగతాళి చేయ్యడం ఆమెను మరింత బాధపెట్టాయి. తన సోదరుడి బిడ్డ కమలమ్మ కూతురిని అక్కా..నీవు మీ మమ్మీని అమ్మా అని పిలుస్తావేమిటి. అని వేసిన ప్రశ్న ఆమెను మరింత కుంగదీస్తుంది. తాను ఇన్నాళ్లూ తెలుగు తల్లి వైభవం గూర్చి కన్న కలలు కల్లలైనాయని వాపోయింది.
తెలుగు సంస్కృతికి పల్లెలు పట్టుకొమ్మలని భ్రాంతిలో ఉండిపోయింది . రైతులు పొలాలమ్ముకుని పట్టణాలకు చేరడం, వృత్తులు కనుమరుగవడం, పచ్చని పైరులనిచ్చే పొలాలు ఇతర పంటలకు ఆలవాలమైనాయి. తాను ఇన్నాళ్లు అమెరికాలో ఉన్నా తెలుగుతల్లి ఒడిలో ఉన్నాననుకున్నాను..కానీ వాస్తవంగా తెలుగుతల్లి ఒడిలో ఉన్న వారు కుళ్లిపోయిన నాగరికతలో ఉన్నారు.. తెలుగుతల్లి నీ మెడలో ముళ్లపూదండ మళ్లీ మల్లెపూదండ ఎప్పుడు అవుతుందోనంటూ నిట్టూర్చింది.. కాటూరు రాసిన జురాహమ(మహరాజు) హస్యనాటికకు జాతీయ అవార్డు వచ్చింది. రేడియో అద్భుత కళాకారులు శ్రీయుతులు బాలాంత్రపుశ్రీకాంతరావు నండూరి సుబ్బారావు తదితరులతో సాన్నిహిత్యం ఉండేది. ఎయిర్ ఫోర్స్‌లో ఇంజనీరుగా 1965,1971యుద్ధాల్లో పాల్గొన్నారు. న్యాయవాదిగా సామాన్యుడికి న్యాయశాస్త్రం గూర్చి అవగాహన కల్పించడం కోసం అనేక వ్యాసాలు రాశారు. పుస్తకాలు రాశారు. యువ పత్రికలో ఒకే నెలలో పాలగ్లాసు.. నేలవాలిన చూపు.. అనే రెండు కథలు పడిన అనుభవం ఒక్క రవీంద్రకే చెల్లింది. అలాగే ఆంధ్రపత్రిక వారపత్రికలోనూ ఒకే వారంలో రెండు కధలు ప్రచురితమైనాయి. పిలకా గణపతిశాస్త్రి, నాగభైరవ కోటేశ్వర రావు… ఇంత చిన్నవాడివి కథలు రాస్తున్నావా. బావున్నాయని ప్రశంసించారని స్వయంగా కాటూరు తెలిపారు.
సాహిత్యమంటే పిచ్చితో..
ఆయన పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. ఇటీవల ఒక పత్రికలో సామాన్యుడి జీవన చిత్రంపై రాసిన 50 కథలు ప్రచురితం అయ్యాయి. గవాక్షం అనే రేడియో నాటకానికి ఎంతో ప్రశంస లభించింది. కిటికి పెద్ధదైతే ప్రపంచాన్ని విశాలంగా చూస్తామని ఆ పేరు పెట్టినట్టు రవీంద్ర చెప్పారు. అలాగే ఆయన రాసిన రేడియో నాటకం 'దూరతీరాలు'లో 80 కి పై బడిన వయసులో కూడా నటులు శారదాశ్రీనివాసన్, కోకా సంజీవరావులు పాత్రధారణ చేశారు. ఈ నాటకం కేవలం రెండు పాత్రలతో నడుస్తుంది.
సాహిత్యం ఆయన మాటల్లో...'నాకు సాహిత్యమంటే ఎంతో ఇష్టం, పిచ్చి అందుకే ఎన్నిరంగాలలో తీరిక లేకున్నా దాని ప్రాముఖ్యత తగ్గలేదన్నారు. శరత్ సాహిత్యంలో శిల్పం నచ్చింది. తనికెళ్ల భరణి, మహాకవి గోపి ఇష్టం. ప్రపంచానికి మేలు చేసే సాహిత్యం కావాలి. అవార్డులు కొలమానం కాదు. మాండలీకాలు రాచకొండ, మధురాంతకం రాజారాం, దాసరి రంగాచార్య రాసారు. శ్రీపాద తన రచనల్లో ఆడవారు మాట్లాడుకునే మాటలను రాసేవారు. అందుకు ప్రత్యేకంగా వినేవారు. నేను వయసురీత్యా వృద్ధుడినే అయినా మనస్సు యవ్వనంగా ఉంది..అందుకే ఇప్పటికీ రాయగలుగుతున్నా' అన్నారు. ఈనాడు ...అంతర్యామిలో 400కు పైగా అద్భుతమైన వ్యాసాలు రాశారు. అలా ఆధ్యాత్మిక చింతనలోనూ తాను తక్కువ కాదని నిరూపించుకున్న సవ్యసాచి కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఆయన మరింత కాలం ఆరోగ్యంగా సాహిత్య సేవ సేవ చేయాలని ఆశిద్దాం.
యం.వి.రామారావు
సీనియర్ జర్నలిస్ట్
80741 29668