ఒక మాదిరిగా ఉన్న... సప్త సాగరాలు దాటి సైడ్-బి’

by Ravi |   ( Updated:2023-11-25 00:31:16.0  )
ఒక మాదిరిగా ఉన్న... సప్త సాగరాలు దాటి సైడ్-బి’
X

ప్రేమకథలకు సీక్వెల్ కష్టం. కథలో ట్విస్టులను పటిష్టంగా చూపగలగాలి. ‘సైడ్ ఏ’లో లేని సంఘటనలు, సన్నివేశాల రూపకల్పన కూడా అవసరమవుతాయి. ‘ప్రేమ పావురాలు’ సీక్వెల్ వంటి చిత్రాలు వస్తే ప్రేక్షకులు ఆదరిం(స్తారు)చకపోవచ్చు. ఆర్థికపరమైన ఎలిమెంట్స్ ప్రేమకథల సీక్వెల్స్‌లో చొప్పించటం కష్టం. థ్రిల్లర్, సస్పెన్స్, హార్రర్ చిత్రాలను ‘రాజశ్రీ’ కొన్ని సంస్థలు కొనసాగింపులుగా తీసిన దాఖలాలు ఉన్నాయి. ‘రాజశ్రీ’ వంటి సంస్థలు ప్రేమ పావురాలు వంటి కథలను చిత్రాలుగా తీసాయి. కాని వాటిని సీక్వెల్‌గా తీయలేదు. ఇలాంటివి

బాలీవుడ్‌లో క్లిక్ అవుతాయి. కానీ టాలీవుడ్, సాండిల్‌వుడ్‌లో ఈ ప్రయత్నాలు తక్కువనే చెప్పాలి. కానీ... రక్షిత్ శెట్టి వంటి నిర్మాతలు (హీరో) ఆ దిశగా అడుగులు వేస్తూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రక్షిత్ శెట్టి కన్నడలో తీసిన 'సప్తసాగర దాచే ఎల్లో’ అని సినిమా సౌత్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లోనూ అనువాదం చేసి కాస్త లేట్‌గా డబ్ చేసి విడుదల చేసారు చిత్ర బృందం. ‘సైడ్ ఏ’తో ఆకట్టుకున్న 'సప్తసాగరాలు దాటి’ చిత్రం ‘సైడ్ బి’ మాత్రం ఏవరేజ్‌గా నిలిచిందనే చెప్పాలి. కథ, కథనాలు, ఎమోషన్స్, భావ ప్రకటనలు వంటి వాటిలో నటీనటులు, మాటలు, కెమెరా, సంగీతం విషయాలలో సాంకేతిక నిపుణుల బృందం తమ వంతు 'ఎఫర్ట్’ శతశాతం పెట్టారు.

కథేంటంటే..

దర్శకుడు హేమంత్.ఎం.రావ్ తన ప్రతిభతో స్క్రీన్ ప్లేని బాగానే రాసుకున్నాడు. అయినప్పటికి ద్వితీయ భాగంలో వచ్చే ట్విస్టులు, సన్నివేశాలు ప్రేక్షకులకు 'అసలు కథ’ కదలటం వేదనే భావనను కలిగిస్తాయి. తొలిభాగంని పటిష్టంగా, ప్రతిభావంతంగా తీసిన దర్శకుడు మలిభాగంలో కథనంలో సాగతీతకు తావిచ్చాడనిపిస్తుంది. అసలు ‘సైడ్-బి’ అవసరమా అనే వ్యాఖ్యానాలు కూడా ప్రేక్షకుల్లో చోటు చేసుకోవటం గమనార్హం. దర్శకుడు తన ప్రతిభతో కొన్ని సన్నివేశాలను బాగానే స్క్రీన్ చేయగలిగాడు. మంచి టేకింగ్ కూడా ఉంది. ముఖ్యంగా ప్రియాను చూడటం కోసం మను పరితపించే విధానం, క్లైమాక్స్, ‘మను- ప్రియురాలు’ కులుసుకునే సీక్వెన్స్ చిత్రించిన విధానం సూపర్. 'సప్తసాగరాలు దాటి’ సైడ్ ఏ కథ మను (రక్షిత శెట్టి) జైలుకు వెళ్ళటం, యజమాని మరణం వంటి ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. ‘సైడ్-బి’ దగ్గరకు వచ్చేసరికి ప్రేక్షకుడు ఒక రకమైన అంచనాలతో సినిమా హాలుకు వస్తాడు. ఆ అంచనాలను అందుకొనే దిశగా చిత్రం లేకుంటే ‘ఎంతవేగరంగా అయిపోతుందా’, బయటకు వెళ్ళిపోదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తాడు. ఆ అవకాశం ‘సైడ్-బి’ ఇచ్చింది.

కథలో ఉన్న ట్విస్టులో సాంద్రత తక్కువగా ఉండటం. మను జైలునుంచి విడుదలై తనకు జైలులో పరిచయమైన స్నేహితుని వద్దకు వచ్చి దొరికిన పని చేసుకుంటూ, తనకు నచ్చినప్పుడు ప్రియ (రుక్మిణి వసంత్) పంపిన ఆడియో టేప్ వింటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఒకానొక సందర్భంలో 'కోరిక’ కలిగి సురభి (చైత్ర) వద్ధకు వెళతాడు. ఆమెలో ప్రియను చూసుకొని, ఇష్టపడతాడు. కాని... ప్రియ జీవితం సాఫీగా సాగటం లేదని, ఆమె కష్టాలు పడుతున్నదని తెలుసుకొంటాడు. ఆమె కష్టాలు తీర్చడం కోసం అతడేమి చేసాడనేది 'సైడ్ బి’ చిత్రం. మొదటి చిత్రంలో లవర్ బాయ్‌లా కనిపించిన రక్షిత్ శెట్టీ ఈ చిత్రంలో ‘రఫ్ నేచర్డ్’ వ్యక్తిగా కనిపిస్తాడు. అతడి పాత్రలోని అవసరమైన బాధ, జాలి, ఆవేదన వంటి వాటిని బాగానే నటించాడు. గోపాల్‌గా నటించిన గోపాల్ కృష్ణ దేశ్ పాండే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. అతడి డైలాగులు కొన్ని ఆడియన్స్ మనసులోని మాటలు తెరపై వినిపించేలా చేసాయి. కథానాయికలుగా రుక్మిణి వసంత్, చైత్రలు తమ తమ పాత్రలను బాగానే పోషించారు. ‘రమేష్ ఇంద్ర’ పోషించిన నెగిటివ్ రోల్ అతనిలోని నటుడ్ని సంపూర్ణంగా ఆవిష్కరించిందనే చెప్పాలి. మంచిడ్రామా, చక్కని టేకింగ్, నటీనటుల ప్రతిభ ఉన్న చిత్రంను మరింత క్రిస్పీగా తీసి ఉంటే ‘సైడ్ ఏ’ ని మించిన విజయం సాధించి ఉండేది.

సీక్వెల్స్ తీయాలనుకుంటే..

చిత్రానికి 'చరణ్ రాజ్’ సంగీతం ప్రాణం పోసిందనే చెప్పాలి. మనసు లోతుల్లో దాగి ఉన్న ఎమోషన్స్‌ను తన సంగీతంతో బయటకు తెచ్చి మరీ ఏడిపిస్తాడు. కథ కథనాలలో అనుకొన్నంత వేగం లేకున్నా తన సంగీతంతో హాల్‌లో ప్రేక్షకులను కూర్చో పెడతాడు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫి సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమా కథకు అవసరమయినా ఎన్నో అంశాలను, ఎమోషన్స్‌ను సింబాలిక్‌గా స్క్రీన్ పైకి తీసుకురావటంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. ప్రొడక్షన్, ఆర్ట్ శాఖలు కూడా సిన్సియర్‌గా తమవంతు బాధ్యతలను నెరవేర్చారు. కేరక్టర్ మూడ్‌ను అనుసరించి నేపథ్యపు సెట్స్‌ను వేసారు. సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడి పనితనాన్ని మేథను మెచ్చుకొనే అభిమానులు రెండవభాగం తీయకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటాడు. దర్శకుడిగా అతని మార్క్ చిత్రమంతటా పరిపూర్ణంగా ఆవిష్కరించుకున్నాడనేది వాస్తవం. అయితే ఇటువంటి చిత్రాలకు సీక్వెల్ తీసిన నిర్మాత రక్షిత్ శెట్టి ఒక మార్గం చూపించాడనే ఒప్పుకోవాలి. అదే సమయంలో చిత్రానికి వచ్చిన స్పందనలు మాత్రం రాబోయే నిర్మాతలకు ఒక సందేశాన్ని ఇచ్చాయనుకోవచ్చు. ‘ఒకటవ భాగం’ గల చిత్రాలు గతంలో వచ్చాయి. ఉదాహరణకు 'పిజ్జా’ 'పిశాచి’ 'పొలిమేర’ వంటివి. కాని... ఆ కథల 'నేపథ్యం’ వేరు. ప్రేమ కథలకు అటువంటి సౌకర్యం ఉండదు. ముందు చిత్రంలోని పాత్రలు, వాటి మధ్య జరిగే డ్రామా, ఎమోషన్స్ తోనే ముందుకు వెళ్ళాలి. లేకుంటే ఎన్నో అంచనాలతో ఇటువంటి చిత్రాలకు వచ్చే 'ఆడియన్స్’ నిరాశకు లోనవుతారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నైపుణ్యం, దర్శకుని అత్యుత్తమ ప్రతిభవంటివి వారి భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారుతాయి. ఏది ఏమైనా ప్రేమ కథలకు సీక్వెల్స్ తీయాలనుకునేవారు ఎన్నో విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని 'సప్తసాగరాలుదాటి - సైడ్ బి’ చిత్రం గుర్తు చేస్తుంది.

- భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Advertisement

Next Story