- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొందరి నిష్క్రమణను అంగీకరించలేం
కొంతమందిని కలిస్తే, వారితో మాట్లాడితే బతుకు మీద ప్రేమ పుడుతుంది. ఒక్క కరచాలనం చాలు వాళ్ళు నీ సమస్త అస్తిత్వంలోకి చైతన్యాన్ని నింపుతారు. అలాంటి చైతన్య సముద్రం విశాఖ మిత్రురాలు సాయి పద్మ మరణించారని తెలిసినప్పుడు మనసు కకావికలమైపోయింది. తనని తాను మూడు వందల మంది పిల్లలకి తల్లిగా భావించుకునే ఒక గొప్ప బాధ్యతాయుతమైన సామాజిక వేత్త ఆమె. సామాజిక ఉద్యమకారిణి, లాయర్, గాయని, కవి, రచయిత్రి....ఇలా ఎన్నో అంశాల్లో జీవితాన్ని సఫలీకృతం చేసుకున్న ధన్యజీవి సాయి పద్మ. ఆత్మ విశ్వాసానికి మరో పేరు సాయి పద్మ.
అల్లూరి సీతారామరాజు మీద రాసిన నా కవిత 'అతడు నా స్వప్నం' చదివిన సాయి పద్మ దాన్ని ఇంగ్లీషులోకి అనువదించడం ద్వారా నాకు పరిచయమయ్యారు. పుట్టుకతోనే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఐన ఆమె చక్రాల కుర్చీ నుండే జీవితంలో ఎన్నో సాధించడం గురించి తెలుసుకొని చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ సమయంలో ఆమె అమెరికా నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్న క్యాలిపర్స్ తొడుక్కొని నిలబడటానికి, నడవడానికి విపరీతంగా శ్రమిస్తూ ప్రాక్టీస్ చేసేవారు. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్ను కదిలించాయి. అబ్బురపరిచాయి. ఆ స్ఫూర్తితో 'నువ్వొక జెండా' అనే కవితని రాశాను. నేను నా మిత్రులెవరి మీదా కవితలు రాయలేదు, ఒక్క సాయిపద్మ విషయంలో తప్ప. (ఆ కవిత నా కవిత్వ సంపుటి 'కవిత్వంలో ఉన్నంతసేపూ....' లో కూడా వుంది.) ఆ కవితని నేను 2016 మార్చి 8న ఆమెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశాను. అప్పుడు ఆమె సాధన మీద నిలబడి వున్న ఫోటోని జత చేస్తూ, గొప్పగా ఇలా స్పందిస్తూ ఆ కవితని షేర్ చేశారు.
నన్ను నేను శిల నుండి శిల్పంగా మార్చుకోవాలన్న సంకల్పం మాత్రమే నాది.. మిగతా క్రెడిట్ అంతా.. నా చుట్టూ ఉన్న, నా భర్త, కుటుంబం, స్నేహితులు, బంధువులు, ముఖ్యంగా నా మూడు వందలమంది పిల్లలదే.. నిజమే.. వీళ్ళ కలలు, ఆశయాలు, ఆదర్శాలు మోస్తున్న జెండాని నేను.. నా గురించి నేను రాసుకున్నా, ఇంత సూటిగా, చక్కగా రాయలేక పోయేదాన్ని .. అండీ.. మీరు ఇవాళ నాకే కాదు, ఎంతో మంది కదలలేని శరీరాలకి, మనసులకి చలనం తెప్పించారు.. ఈ అక్షరాలే చెకుముకిరాయి.. థాంక్స్ చాలా చిన్న పదం.. మనఃపూర్వక కృతజ్ఞతలు ... ఇలా ఆలోచించే ప్రతీ మనిషికీ , మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!!
ఈ వాక్యాలు చదువుకున్న నా గుండె ఆనందంతో నిండిపోవడం నాకిప్పటికీ జ్ఞాపకముంది. ఆ తర్వాత ఆమెతో కొన్నిసార్లు మాట్లాడాను. ఆమె తన కథల్ని ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల గురించి కూడా మాట్లాడేవారు. నా కవిత్వ సంపుటి 'కవిత్వంలో ఉన్నంతసేపూ....' మీద ఒక వివరణాత్మక సమీక్ష కూడా రాశారు. మొత్తం మీద అదొక మ్యుచువల్ అడ్మిరేషన్! విశాఖ వెళ్లినప్పుడు కలిసేవాడిని. చివరగా క్రితం సంవత్సరం మా పెద్దక్క విశాఖలోనే చనిపోయినప్పుడు మా అక్క, బావల బట్టలు కొన్ని బ్యాగుల్లో సర్ది, వాళ్లింటికి తీసుకెళ్లి ఎవరికైనా నీడీ సెక్షన్స్‌లో ఇవ్వండని ఆవిడకిచ్చాను. ఆవిడ చాలా సంతోషించి ట్రైబల్ పీపుల్‌కి అందచేస్తానండీ అన్నారు. ఆవిడని చూడటం అదే ఆఖరుసారి. మరణం ఎవరికైనా తప్పదు కానీ కొందరు వెళ్లిపోవడం మనం ఎప్పటికీ అంగీకరించలేం, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సామాజికంగా ఎంతో విలువైన వ్యక్తి అయినప్పుడు, తనని తాను చైతన్యపు కాగడా చేసుకొని పర్వత శిఖరాగ్రాన వెలుగుతున్నప్పుడూ....!
సాయిపద్మకి నా వినమ్ర నివాళి!
అరణ్య కృష్ణ
98499 01078