- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీణ గ్రంథాలయాలు స్థాపించాలి!
ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతుల్ని చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. అయ్యంకి వెంకటరమణయ్య ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమంలో భాగం వహించింది. ఇలా ఊరురా గ్రంథాలయం అనే మలిదశ గ్రంథాలయోద్యమంలో భాగంగా 2006 ఏప్రిల్ 14న నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో మొదటి గ్రంథాలయం పురుడు పోసుకొని నేటికి ఒక ఉత్సవంలా కొనసాగుతుంది ఈ ఊరి గ్రామ గ్రంథాలయం. దీనిని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించారు. గుండ్రాంపల్లి గ్రామం ఒకప్పుడు నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. ఈ ఊర్లో సుమారు 7000 పైచిలుకు జనాభా, పరిసర 6 గ్రామాలతో కలుపుకుంటే 15000 వేలమంది జనాభా ఉంది. అయితే ఆ ఊర్లో గ్రంథాలయం అందుబాటులో ఉండేది కాదు. ఆ ఊరి గ్రామ పంచాయతీకి ఒక దినపత్రిక, ఒక మాస పత్రిక మాత్రమే వచ్చేది. అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. దీంతో ఆ గ్రామ యువకుడు శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి గ్రంథాలయం ఏర్పాటు ఆవశ్యకత గురించి చెప్పి గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి గ్రామ సర్పంచ్ చెరుకుపల్లి చంద్రయ్య ఒక గదిని, పాలకమండలిని కేటాయించారు. పుస్తకాలు దానం చేయండని ఒక దినపత్రికలో ప్రకటన ఇవ్వడంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలువైపులా ఉన్న పుస్తక ప్రియులు వేలాది మంది పుస్తకాలను, ఫర్నిచర్‌ను ఈ గ్రంథాలయానికి బహుమతిగా ఇచ్చారు. గ్రంథాలయ నిర్వహణ నెలవారీ ఖర్చులు కమిటీ సభ్యులే భరిస్తూ ఉన్నారు. ఈ గ్రంథాలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 8 వరకు తెరిచి ఉంచబడుతుంది. ఆదివారం మాత్రం మరో మూడు గంటలు అదనంగా పనిచేస్తుంది. వేసవికాలంలో రెండు నెలల పాటు ఉదయం 7 నుండి సాయంత్రం 8 గంటల వరకు తెరుచుకుంటుంది.
దీనిని ఉపయోగించుకొని..
ఈ గ్రంథాలయంలో విభిన్నమైన పుస్తకాలు జాతీయ అంతర్జాతీయ విషయాలు తెలుసుకునే విధంగా విద్యార్థులు, ఉద్యోగులు చదువుకునే విధంగా, ప్రజా సాహిత్యం ఆలోచన ఆసక్తి కలిగించే విధంగా, తెలంగాణ ప్రజా సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించే విషయాలు, సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని, ఆలోచన విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో పుస్తకాలు ఇందులో ఉన్నాయి. మూడు దినపత్రికలు, 8 మ్యాగజైన్లు, వెయ్యి పుస్తకాలతో ప్రారంభమైన నేడు 8 దినపత్రికలు, 25 వార, పక్ష, మాస, త్రైమాసిక పత్రికలు, 2018 నుండి వివిధ వార్త పత్రికలను బైండింగ్ చేసి పుస్తకరూపంలో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో సగటున 16 మంది పాఠకుల నుండి నేడు రోజుకు సగటున 50 పైగా పాఠకులు గ్రంథాలయ సేవలను అందుకుంటున్నారు. అలాగే యువతకు ఉపయోగపడే కెరీర్ గైడెన్స్, వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలు, సామాజిక శాస్త్రాలు, డిక్షనరీలు, బేసిక్ ఇంగ్లీష్ పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు, కథలు, సాహిత్య, పురాణ పుస్తకాలు ఈ గ్రంథాలయంలో లభిస్తాయి. అలాగే ఈ గ్రంథాలయంలో అంతర్జాల సేవలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ గ్రంథాలయ నిర్వహకులు యువతను ఆకర్షించేందుకు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను అందించడంతోపాటు, వారికి తగిన పారితోషికం అందిస్తున్నారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తితో ఈనాడు నడుస్తోంది గుండ్రాంపల్లి గ్రంథాలయం.
ఈ గ్రంథాలయ సేవలు ఉపయోగించుకొని 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. అలాగే 35 మంది యువతీయువకులు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ గ్రంథాలయ అభివృద్ధికి గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, తెలంగాణ గ్రంథాలయ సంఘం, ఎన్నారైలు దాతలు, రచయితలు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారు, వివిధ పత్రికా యాజమాన్యాలు నిరంతరం సహాయసహకారాలు అందిస్తున్నారు. ప్రతి పౌర్ణమికి గ్రంథాలయ కమిటివారు పుస్తక భిక్షాటన చేస్తున్నారు. గుండ్రాంపల్లి గ్రంథాలయం నేడు పరిశోధనా కేంద్రంగా విలసిల్లుతున్నది. ఇక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందించే, తెలుగు తదితర బాషలలో పరిశోధన చేసే విద్యార్థులకు ఇదొక పరిశోధనాలయంగా మునుముందుకు రాబోతుంది. విలువైన విజ్ఞానాన్ని అందించేందుకు నేటి గ్రంథాలయ వారసత్వం చేస్తున్న కృషిని తప్పక అభినందించాలి. ఈ గ్రంథాలయాన్ని విస్తరించాలని, అలాగే మా గ్రామ గ్రంథాలయాన్ని ఎయిడెడ్ గ్రామ గ్రంథాలయంగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాం. దీనికి దాతలు సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. తెలంగాణలో మరిన్ని పల్లెల్లో విజ్ఞానాన్ని వెదజల్లే మట్టి మనుషుల ఆనవాళ్ళతో గ్రామీణ గ్రంథాలయాలు స్థాపించాలని మనసారా కోరుకుంటూ ...
బూర్గు గోపికృష్ణ
7995892410