- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతులేని అప్పులు... ఆంధ్రప్రదేశ్‌కి తప్పవు తిప్పలు!
రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దేశంలో శ్రీలంక, పాకిస్థాన్ లాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తకూడదు అంటూ కేంద్రం హితవు చెప్పింది. మితిమీరిన అప్పులు రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదని స్వయంగా ప్రధాని మోదీ రాజ్యసభ సాక్షిగా హెచ్చరించారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. రాష్ట్రాల వారీగా, విడివిడిగా చూచినా అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ మధ్య ఆందోళన వ్యక్తం చేసింది. కానీ కేంద్రం చెబుతున్న నీతులు, హెచ్చరికలు ఉత్తివిగానే మిగిలి పోతున్నాయి. నీతులు చెబుతూనే, హెచ్చరికలు చేస్తూనే అప్పులు తెచ్చుకొనే విషయంలో కేంద్రం జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెస్తున్నా కేంద్రం అనుమతి ఇస్తోంది.
కేంద్రం ఏం చేయదల్చుకుంది?
ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రానికి అయినా రెండు సార్లు మాత్రమే కొత్త అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వారం, వారం కొత్త అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి ఇస్తూ కేంద్రం తాను చెప్పే నీతులకు నీళ్లు వదులుతోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అడ్డగోలు అప్పులు తెస్తోందని తెలిసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్లు అడిగిందే తడవుగా, అవసరమైనప్పుడల్లా అదనపు అప్పులకు అనుమతి ఇస్తూనే ఉంది. తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందని తెలిసీ కూడా కొత్త అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇవ్వడం అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎం చెయ్యదలుచుకొన్నది? జగన్ ప్రభుత్వం పట్ల ఉదారత ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కాదు. ఒక పక్కన తానే అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇస్తూనే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ కేంద్రం నీతులు చెబుతుండటం విశేషం.
గత ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ. 43,000 కోట్లు అప్పులకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత జనవరి నుంచి మార్చి వరకు రూ. 4,557 కోట్లకు అనుమతించింది. ఇంతకుమించి అప్పులకు అనుమతివ్వబోమని జనవరిలో చెప్పి మళ్లీ ఫిబ్రవరిలో రూ. 5,858 కోట్ల కొత్త అప్పు చేయడానికి అనుమతిచ్చింది. మళ్లీ మంగళవారం రిజర్వ్ బ్యాంకు నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం మరో రూ.958 కోట్లు అప్పు తెచ్చింది. ఈ అప్పుతో కేంద్రం ఎఫ్ఆర్‌బీఎం నిబంధన కింద ఇచ్చిన అనుమతి మొత్తం పూర్తి అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగుసార్లు అనుమతి ఇచ్చిన రుణం, నాబార్డు, లిక్కర్ బాండ్లతో కలుపుకొని రూ.87,758 కోట్లను జగన్ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ బాండ్స్ ద్వారానే 75 సార్లు రూ.55,718.00 కోట్లు అప్పులు తెచ్చారు. లిక్కర్ బాండ్స్ ద్వారా రూ. 8,305. కోట్లు,కేంద్రం ప్రభుత్వం నుండి రూ. 4,000 కోట్లు, నాబార్డు నుండి రూ 40 కోట్లు, కార్పొరేషన్స్ నుండి రూ.19,695 కోట్లు, మొత్తం రూ 32,040 కోట్లు అప్పులు తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 24 రోజులు ఉండగానే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 87,758 కోట్లు అప్పు చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో మొత్తం రాష్ట్రం అప్పు రూ 6,60,956 కోట్లు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర వాస్తవ అప్పు రూ 3,62,375 కోట్లు.
రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెడుతూ..
స్వాతంత్రం వచ్చిన తరువాత అప్పుడున్న ప్రభుత్వాలు 1947 నుంచి 2019 మార్చి వరకు చేసిన అప్పులు రూ. 3, 62,375 కోట్లు కాగా వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆ అప్పును రూ. 6,60,956 కోట్లకు చేర్చింది.వీటికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నెత్తిన మొత్తం అప్పు రూ.13 లక్షల కోట్లకు చేరబోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీడీపీ హయాంలో చేసిన మొత్తం అప్పు 5 సంవత్సరాల్లో రూ.1,63,981 కోట్లు. అంటే సంవత్సరానికి సరాసరి చేసిన అప్పు రూ.32,800 కోట్లు మాత్రమే. అయినా మా హయాంలో అప్పులు తగ్గాయని బుకాయించడం సిగ్గు చేటు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. అప్పులు చేసే మార్గాలు కూడా మూసుకుపోవడంతో అమరావతి రాజధానికి రైతులు ఉచితంగా ఇచ్చిన భూములను అమ్మి పాలన సాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అమరావతిని స్మశానం అని విమర్శించిన మరుగుజ్జులకు ఆ స్మశానం భూములే గతి అయ్యాయి. ఉద్యోగులకు,పెన్షన్‌దారులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. కాంట్రాక్టర్లు చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు కొండలా పెరిగిపోయాయి. ఇష్టానుసారం అందిన చోటల్లా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెట్టారు.
అప్పులు పబ్లిక్ డొమైన్‌లో పెట్టగలరా?
ఆదాయంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ప్రభుత్వాలకు శ్రీ లంక ఆర్థిక సంక్షోభమే ఒక హెచ్చరిక అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జగన్ రెడ్డి తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీ కలుపుకుని ఏడాదికి లక్ష కోట్లు వరకు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతుంది. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు ప్రజలు ముందుంచాలి. ప్రభుత్వం మూడున్నరేళ్ళుగా తెచ్చిన అప్పులను, కార్పొరేషన్, గ్యారెంటీల ద్వారా తెచ్చిన అప్పులను, బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. ఈ మూడున్నరేళ్ళలో ప్రభుత్వ ఆస్తులు పెరిగాయా? కొత్తగా ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? ఈ మూడున్నరేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి అయినా పునాది రాయి వేసారా? తెచ్చిన 7 లక్షల కోట్ల డబ్బు ఏమై పోయింది? రాష్ట్రాభివృద్ధిని, ప్రజా శ్రేయస్సును విస్మరించి స్వప్రయోజనాలే ధ్యేయంగా ఎడాపెడా అప్పులు తెచ్చి వివిధ రూపాల్లో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
అప్పుల్లో ఆల్‌టైం రికార్డు..
అదుపుతప్పి అల్లరి చేసే పిల్లల్ని దండించే ఉపాధ్యాయుడి తరహాలో ఆర్థిక అరాచక పద్దతులతో అదుపు తప్పిన రాష్ట్రాలను కేంద్రం ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలను అదుపు చేయాల్సిన కేంద్రం తన రాజకీయ అవసరాల కోసం తన బాధ్యతను విస్మరించి ఎడాపెడా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇస్తున్నది. ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అదుపులో పెట్టకపోతే , ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సర్వ నాశనం కానున్నది. రాష్ట్ర అభివృద్ధికి అప్పులు అవసరమే కానీ అవి రాష్ట్ర ఆస్తులు సృష్టించేందుకు ఉపయోగించాలి. మూడున్నరేళ్లలో రూ. 6 లక్షల 60 వేల కోట్ల అప్పులు చేసినా రాష్ట్రంలో సృష్టించిన ఆస్తి ఒక్కటి లేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించి ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులో ఒక లక్ష కోట్లు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చుచేసి ఉంటే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవి. ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి పెంపుతో సంపద సృష్టికి బీజం వేయాల్సిన ప్రభుత్వం అప్పులు తెచ్చి జనాకర్షణ పథకాలతో వ్యక్తిగత పరపతిని పెంచుకునేందుకు ధారపోస్తోంది. ఏది ఏమైనా అప్పుల్లో జగన్ ప్రభుత్వం ఆల్ టైం రికార్డు సృష్టించింది. నమ్మి అధికారం అప్పగించిన నేరానికి నాలుగేళ్లలో ప్రజలకు భవిష్యత్తే లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్‌ను దివాళా తీయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అంతులేని అప్పులతో ఆంధ్రప్రదేశ్‌కి తప్పవు తిప్పలు.
నీరుకొండ ప్రసాద్
9849625610
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672