హేతువాద కవిరాజు... త్రిపురనేని

by Ravi |   ( Updated:2023-02-24 19:31:02.0  )
హేతువాద కవిరాజు... త్రిపురనేని
X

హేతువాద సాహిత్యం తెలుగు సాహిత్యానికి జీవగర్ర. ఎన్నో కొత్త విషయాలను బయటకు తీసుకొచ్చింది. తెలుగు వారు ఒకదశలో భారత రామాయణ భాగవతాలను గుడ్డిగా నమ్మారు. ముఖ్యంగా సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా, ఈ కథలు ప్రచారమయ్యాయి. వాటిని హేతువాద నాస్తిక కవులు, రచయితలు తిప్పికొట్టారు. ఈ గ్రంథాలని హేతువాద దృక్పథంతో చూశారు. ముఖ్యంగా రామాయణంలో శంబుక వధను త్రిపురనేని రామస్వామి చౌదరి గారు గట్టిగా ప్రశ్నించారు. ఒక శూద్రుడు చదువుతుంటే రాముడు తలనరకడం ఏమిటి అనేది ఆయన ప్రశ్న. ఆయన పురోహితుల దోపిడిని కూడా నిలదీశారు. కవిరాజు ‘శంబుకవధ’ పురాణ సాహిత్యం మీద తిరుగుబాటు జెండాను ఎగురవేసింది. శంబుకుని చంపడం ఒక మహాత్కార్యంగా ఆర్ష సాహిత్యం వర్ణిస్తే శంబూకుని వధను ఒక హింసాకాండగా కవిరాజు వర్ణించాడు.

తెలుగు సాహిత్యంలో హేతువాద భావజాలం వేమన నుంచి బలంగా ప్రారంభమైంది. వేమన గొప్ప హేతువాద కవి. వేమన గురజాడకు, శ్రీశ్రీకి, చెరబండ రాజుకు మార్గదర్శకుడయ్యాడు. వేమన మార్గంలో హేతువాదాన్ని బలంగా తీసుకెళ్ళిన వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, మహాకవి గుర్రం జాషువా, శ్రీశ్రీ, ఆరుద్ర, సి.వి. గార్లు హేతువాద భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళారు. హేతువాద భావజాలాన్ని ప్రచారం చేసిన వాళ్ళే కవులుగా, మహాకవులుగా ముందుకొచ్చారు. కవిత్వం కేవలం కవిత్వం కోసం కాకుండా సమాజహితం కోసం, మానవాభ్యుదయం కోసం, మానవతా స్ఫూర్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం రాసిన హేతువాదులు తెలుగు సాహిత్యంలో బలంగా వున్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి ‘సూత పురాణం’, ‘శంభూకవధ’ వంటి అనేక గ్రంధాల్లో దేవుళ్ళ పుట్టుపూర్వోత్తరాలను కళ్ళకు కట్టారు. ‘‘మల మల లాడు పొట్ట తెగమాసిన బట్ట కలంత బెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపుతున్న... అనే పద్యం మచ్చుకు ఒక ఉదాహరణ.

హేతువాద భావజాలం

దేవుళ్ళకు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తున్నారు. పట్టు వస్త్రధారణ చేస్తున్నారు. వజ్ర వైఢూర్యాలతో అలంకరిస్తున్నారు. కానీ నిరుపేద పొట్టకు అన్నం కరువైంది. పేదలేమో మసిబట్టలతో వున్నారు. దేవతా విగ్రహాలేమో పట్టు పీతాంబరాలతో వెలిగిపోతున్నాయి. రాళ్ళను పూజించే వాళ్ళు చక్రపొంగలి ఆరగిస్తున్నారు. రాళ్ళుకొట్టే వాళ్కకేమో గంజిబువ్వ కూడా దొరకడం లేదు. ఈ వైరుధ్యాలను త్రిపురనేని రామస్వామి చౌదరి అలతి అలతి పదాలతో ఉత్పలమాలతో అద్భుతంగా చెప్పాడు. బ్రాహ్మణవాద భావజాలం మీద ఆయన గొప్ప తిరుగుబాటు చేశారు. రావణుడు గొప్ప పండితుడు. గొప్పరాజు. ఆయన్ని చంపడం అనే కథకి ఒక పెద్ద గ్రంథం ఎందుకు రాయాల్సివచ్చింది అని ఆయన ప్రశ్నించాడు. కోయ, చెంచు మొదలైన జాతులు చింత తోపుల్లోనూ, చెట్టు పుట్టలలోనూ, అడవుల్లో జీవిస్తూ రాత్రులు బలంగా వుంటారు. తమ బిడ్డలను కాపాడుకునే రక్షకులుగా వుంటారు. అందుకే వీళ్ళను రాక్షసులు అన్నారు అని చెప్పారు. మూలవాసులకు వ్యతిరేకమైన నామవాచకాలు పెట్టి వారిని అన్ పాపులర్ చేయడానికి చూసింది బ్రాహ్మణ సమాజం.

తెలుగులో హేతువాద సాహిత్యం, అష్టాదశ పురాణాలను తిరగదోడింది. హేతువాద కవులు ముఖ్యంగా త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా మహాకవి, తాపీ ధర్మారావు గారు, ఆరుద్ర వంటి వారంతా మూఢ విశ్వాసాల మీద కొరడా జులిపించారు. హేతువాద సాహిత్యం తెలుగు సాహిత్యానికి జీవ గర్ర ఎన్నో కొత్త విషయాలను బయటకు తీసుకొచ్చింది. తెలుగు వారు ఒకదశలో భారత రామాయణ భాగవతాలను గుడ్డిగా నమ్మారు. ముఖ్యంగా సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా, ఈ కథలు ప్రచారమయ్యాయి. వాటిని హేతువాద నాస్తిక కవులు, రచయితలు తిప్పికొట్టారు. ఈ గ్రంథాలని హేతువాద దృక్పథంతో చూశారు. ముఖ్యంగా రామాయణంలో శంబుక వధను త్రిపురనేని రామస్వామి చౌదరి గారు గట్టిగా ప్రశ్నించారు. ఒక శూద్రుడు చదువుతుంటే రాముడు తలనరకడం ఏమిటి అనేది ఆయన ప్రశ్న. ఆయన పురోహితుల దోపిడిని కూడా నిలదీశారు. కవిరాజు ‘శంబుకవధ’ పురాణ సాహిత్యం మీద తిరుగుబాటు జెండాను ఎగురవేసింది. అవతార పురుషుల అఘాయిత్యాలను, దాడులను, హింసలను కవిరాజు నిర్భయముగా ఎత్తి చూపాడు. శంబుకుని చంపడం ఒక మహాత్కార్యంగా ఆర్ష సాహిత్యం వర్ణిస్తే శంబూకుని వధను ఒక హింసాకాండగా కవిరాజు వర్ణించాడు.

శంబూకుని కథలో స్పష్టమైన హైందవ మతంలోని కుళ్లును వెల్లడించడంలో కవిరాజు చేసిన పరిశ్రమ చూపిన ఆవేదన ఇంతయని చెప్పలేము. ఈ నాటకములో బీజ ప్రాయముగా గర్భితమైయున్న ‘ఆర్య ద్రావిడ భేదం గాథలే, తరువాత వచ్చిన సూత పురాణాలలో సమగ్రస్వరూపము చెందినవి. రామాయణ భారత గాథలను గూర్చి కవిరాజు ప్రారంభించిన ఉద్యమం తొలుత దృశ్య కావ్యములలో ఆవిర్భవించి తర్వాత, శ్రవ్యకావ్యములో ‘విశ్వరూపము’ దాల్చినది.’’ తమిళ కన్నడ సాహిత్యాల్లో కూడా కవిరాజు తీసుకువచ్చినంత తీవ్రమైన విమర్శ మరొకరు తేలేకపోయారు. శంబూకుడు శూద్రుడు. శూద్రుడెందుకు వేదం చదవకూడదు. వేదాల్లో ఆర్యుల గుట్టువుంది. ఆ గుట్టురట్టవుతుందని ఈ నిషేధం. ఏమిటా గుట్టు? ఆర్యులు అనార్యులను హింసించడం, వధించటం, మానభంగాలు చేయటం. ఈ వేదాలు శూద్రులు చదివినట్లయితే ఆర్యులు భారత భూభాగంపై ఎలా దండయాత్రలు చేశారో ఇక్కడున్న జాతులను ఏ విధంగా వర్ణ భేదంతో, విభజించారో ఇవన్నీ అర్థమవుతాయని వేదాలు చదవడం నిషేధించారు. అందుకే శ్రీరాముడు ఆర్య సంస్కృతిని కాపాడటంలో భాగంగా శంబూకుడ్ని వధించాడు. దీన్ని నాటకంగా మలిచి త్రిపురనేని రామస్వామి నూత్న సాహితీ సంపత్తిని భావవిప్లవ వాదులకు చేకూర్చారనడంలో అతిశయోక్తి లేదు.

శంబుక వధ హేతువాద విశ్లేషణ

శంబుక వధ పీఠికలో అనార్యుల జీవన విధానాలను గురించి చాలా వివరాలిచ్చారు. అప్పటికీ పురాణాంశాలను చారిత్రకాన్వయాలతో పరిశీలించిన వారిలో ఆయన ప్రసిద్ధుడు. శంబుక వధ మీద బ్రాహ్మణ వాదులు తీవ్రమైన దాడులు చేశారు. నిందాభూయిష్టమైన విమర్శతో కవిరాజును అవమానించాలని చూశారు. కాని ఆయన అనార్యుల గురించి యిచ్చిన వివరణ వాస్తవాంశా సముచ్ఛయంగా ఉంది. మరీ ముఖ్యంగా ద్రావిడులను గూర్చి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

సంస్కృతాన్ని బ్రాహ్మణేతరులు బాగా అధ్యయనం చేశారు. గొప్ప గొప్ప ఋషులుగా పేరు పొందిన వాళ్ళకు ఎందుకు గోత్రాలు లేవు అని ప్రశ్నించారు. పుట్టుకను బట్టి బ్రాహ్మణత్వమే కాదు అని వాదించారు. బ్రాహ్మణత్వమే ఒక అభూత కల్పన అని నిలదీశారు. అయితే అందరం బ్రాహ్మణులం కావాలి లేకుంటే అందరం శూద్రులు కావాలని వాదించారు. అంతేకాదు మొత్తం జంధ్య ధారణకు ఉపక్రమించారు. గోత్ర నామాలన్నీ రూపకల్పన చేసినవే అని వ్యాఖ్యానించారు. అక్షరం అభ్యసించడానికి ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. మానవతా ప్రబోధం కోసం తమ కులాన్ని కూడా అవసరం అయితే వదులుకుంటామని కొత్త ధర్మాన్ని కూడా తీసుకొచ్చారు. బ్రాహ్మణేతర పండితులు పదును గలిగినవారు. అప్పటివరకు పురాణాలు చూసిన కోణానికి భిన్నంగా చూశారు.

ఋషుల పుట్టుపుర్వోత్తరాలు

మనుస్మృతిలోని ఋషుల జన్మకు సంబంధించిన శ్లోకాన్ని సామాజిక శాస్త్రకోణం నుండి విశ్లేషించారు. ‘ఋష్య శృంగో మృగేజాత కౌశికో గాధినందనః’ అని మొదలయ్యే శ్లోకం చూడండి. మనుస్మృతిలోని పై శ్లోకాన్ని అనుసరించి ఋష్యశృంగుడు లేడి కడుపున, కౌశికుడు గాధిరాజునకు, జంబుకుడు నక్క కడుపున, గౌతముడు గోవు గర్భమున, వాల్మీకి బోయెతగర్భమున, అగస్త్యుడు కుండయందున, వ్యాసుడు బెస్త కన్యా గర్భమున, వసిష్ఠుడు వేశ్యాగర్భమును, నారధుడు రజక నారీగర్భమున, కౌండిన్యుడు మాండు నారీగర్భమున, మాండవ్యుడు కప్ప కడుపున, సాంఖ్యుడు మాలెత గర్భమున, గార్గేయుడు గాడిద కడుపున, శౌనకుడు కుక్క కడుపున పుట్టారు. వీరుగాక, వాసిష్ఠులు వసిష్ఠునకు చండాలిక కడుపున పుట్టారు. శక్తిమునులు పరాశరునకు పుంగనూరు మాలెత కడుపున పుట్టారు. ఈ మునులందరు బ్రాహ్మణ మునులయ్యారు. బ్రాహ్మణుల గోత్రములకు, మూలపురుషులయ్యారు. వీరందరి పుట్టుకలకు నారదుని పుట్టుక యేవిధముగను తీసికట్టుకాదు. వీరిలో కొందరు మహర్షులు, మరికొందరు రాజర్షులు, ఇంకొందరు అయితే నారదుడు మహోన్నతమైన దేవర్షిగా, త్రిలోక సంచారిగా ప్రసిద్ధులయ్యారు. అయినా రజకుల్లో ఋషిగోత్రం ప్రసక్తి లేదు. నారదునకు జన్మనిచ్చిన రజక స్త్రీ యితర మునులకు జన్మనిచ్చిన వారికన్నా యే విధముగను తక్కువ కాదు. ఆమె ప్రజలకు ఆరోగ్య భాగ్యమును ప్రదానం చేయు లోకపావని, మాతృదేవత.

చివరగా... కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద సాహిత్యంలో దిట్ట.

కత్తి పద్మారావు

98497 41695

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed