- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాలం అంచున కాంతిపుంజం అలిశెట్టి
"అగ్ని పద్యం నేను/ దగ్ధగీతం నేను/ అక్షర క్షిపణి నేను". కవిగా అలిశెట్టి ప్రభాకర్ పరిచయం ఇది. ‘అరుదుగా కదిలే జన మైదానాలను కనో/ ప్రతిస్పందించే నాకు మెజారిటీ ప్రజల/ బాధల గాథలే ముడి సరుకు అయ్యాయి" అని చెప్పుకున్నారు. సామాన్యుల కష్టాలు, కన్నీళ్లే ఆయన కవితా వస్తువు.
‘అవార్డుల కోసం క్యూలో నిలబడే అర్భకుల కోసమో/ ఇస్త్రీ చొక్కా నలక్కుండా విప్లవ సందేశాల్ని అందించే మేధావుల కోసమో/ కవిత్వంలోను జీవితంలోను ద్వంద్వ ప్రమాణాలనవలంబించే/ దౌర్భాగ్యుల కోసమో కాక/ సామాన్య పాఠకుడి కోసమే నా కవిత్వం’ అంటారు. కళ్ళెదుట కనిపించే అన్యాయాన్ని, దుర్మార్గాన్ని అక్షర క్షిపణితో నిలువునా కూల్చేయడమే ఆయన నైజం. ‘పాలరాతి బొమ్మైన/ పార్లమెంట్ భవనమైన/ వాడు చుడితేనే శ్రీకారం/ వాడు కడితేనే ఆకారం’ అంటూ కార్మికుల పక్షాన నిలిచారు. తన రచనలలో ధిక్కారం, తిరుగుబాటు, చైతన్యం కలగలిసి రక్తాన్ని సలసలా మరిగిస్తాయి.
ఒక్కసారి చదవడం మొదలెడితే..
‘తను శవమై/ ఒకరికి వశమై../తనువు పుండై/ ఒకడికి పండై../ ఎప్పుడూ ఎడారై/ ఎందరికో ఒయాసిస్త్సె"../ అని వేశ్య కవితలో వారి దయనీయ స్థితి చిట్టిపొట్టి పదాలతో ఎక్కుపెట్టిన గాండీవం ఆయన కవిత్వం. వ్యంగ్యం, విమర్శ, చురకలు ఏదైనా ఆయన ప్రయోగిస్తే చదువరి హృదయాంతరాలలో కత్తుల్లా గుచ్చుకుంటాయి. రాజకీయాలను కవిత్వీకరిస్తూ చమత్కారంగా మారదు ఈ సిగ్గులేని సమాజం అన్నంతగా విడమరిచారు. "ఒక నక్క/ ప్రమాణ స్వీకారం చేసిందంట/ ఇంకెవర్నీ వంచించనని/ ఒక పులి/ పశ్చాత్తాపం ప్రకటించిందంట/ తోటి జంతువులను సంహరించినందుకు/ ఈ కట్టు కథలు విని/ గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ్" అంటూ తూర్పారబట్టారు. ఒక్కసారి ఆయనను చదవడం మొదలు పెడితే నిరంతర జ్వాలై మనల్ని రగిలిస్తారు.
బరువైన, కరుకైన, ఆర్ద్రతా భావాలు పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. అద్భుతం, అనన్య సామాన్యం తన రచనా శైలి. ఆయన కవిత్వం ఒక వ్యసనం. ఆయన ఆవాహన ఒక అలజడి. అది మనలోని లోపలి మనిషిని తట్టి లేపుతోంది. అలిశెట్టి జగిత్యాలలో 1956 జనవరి 12న జన్మించారు. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు మీదపడినాయి. దీంతో ఇంటర్ చదువు మధ్యలో ఆగిపోయింది. ‘సాహితీ మిత్ర దీప్తి సంస్థ‘ పరిచయంతో ఆయనలోని కవి పురుడు పోసుకున్నారు. జగిత్యాల జైత్రయాత్ర పాద ధూళిలో ఆయన పాళి పదునెక్కింది. అలిశెట్టి జీవించింది 39ఏళ్ళే. దానిలో ఇరవై ఏళ్ళు కవిత్వమే శ్వాసగా జీవించారు. ఆ ఇరవైల లోనే అరవై ఏళ్ళ సాహిత్యాన్ని సృజించారు. ఎనిమిది కవితా సంకలనాలను వెలువరించారు. అవి ఉద్గ్రంథాలేమి కావు. కానీ తెలుగు సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన శ్రీశ్రీ తరువాత ఎక్కువ 'కోట్' అయిన కవిత్వం అలిశెట్టిదే అంటారు సాహితీవేత్తలు.
అశేష పాఠక ప్రజాభిమానం
అలిశెట్టి ఎంతో నిబద్ధతతో జీవించారు. కళ కోసమే తప్ప, సంపాదన కోసం కాదని నమ్మారు. సినిమాలలో అవకాశాలు వచ్చినా వదిలేశారు. సంపాదన కొరకు ఏనాడూ వెంపర్లాడలేదు. ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకొని జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్‌లలో స్టూడియోలు స్థాపించి నడిపించారు. చివరి వరకు ఫోటోగ్రాఫర్‌గా జీవించారు. కవిగా రాణించారు. కుంచె, కెమెరా, కలం కలగలిపితే అలిశెట్టి. అలిశెట్టి పేదరికంలో పుట్టారు. పేదరికంలో జీవించారు. పేదరికంలోనే మరణించారు. కానీ ఎవరు సంపాదించుకోలేని అశేష పాఠక ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మరణించారని తెలిసి సగం హైదరాబాద్ ఆయన ఇంటి గుమ్మం ముందు నిలబడింది. వారు రాసుకున్నట్లే “మరణం నా చివరి చరణం కాదు”. అది నిరంతర ప్రభవం. అలిశెట్టి “కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహ/ కలల ఉపరితలమ్మీద కదలాడే కాంతి పుంజం". ఆయన ఎప్పటికీ అమరం, అజరామరం.
(నేడు అలిశెట్టి జయంతి, వర్ధంతి)
-డా. సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
98496 18116