స్వయంపాలన దిక్సూచి

by Ravi |   ( Updated:2024-10-17 00:30:28.0  )
స్వయంపాలన దిక్సూచి
X

ప్రపంచ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవి. అవన్నీ భూమికోసం, భుక్తి కోసం, స్వయం పాలన కోసం జరిగినవి. భారతదేశానికి ఆంగ్లేయుల రాకపూర్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో క్రీ. శ. 1240 నుంచి క్రీ. శ.1749 మధ్య గోండ్వానా రాజ్యంగా ఏర్పడ్డాయి. గోండు గిరిజనుల్లో తొలి వీరుడైన రాంజీ గోండ్ తెల్లదొరల దమన నీతిని ఖండిస్తూ 1836 నుంచి 1860 వరకు వీరోచితంగా పోరాడాడు. గోండ్వానాలో అంతర్భాగమైన ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ఆదివాసీ ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురైనారు. రాంజీగోండ్ వారసత్వం పుణికి పుచ్చుకున్న గిరిజన నాయకుడు కుమ్రంభీమ్ సాయుధ తెలంగాణ పోరులో ఒక రంగల్ జెండా. ఆదిమ జాతుల వారికి స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 దాకా నిజాం నవాబులపై రణభేరి మ్రోగించారు. నిజాముల గుండెల్లో సింహస్వప్నంగా మారారు.

స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకుని..

రజాకార్లు గోండుల చేత వెట్టిచాకిరి చేయించేవారు. స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు. ఓ వైపు వస్తు దోపిడి మరోవైపు అడవులలో పశువులను మేపినా, పోయిల కట్టెలు తెచ్చుకున్నా... బంబరు, ధూపపెట్టి అనే పేరుతో శిస్తులు బలవంతంగా వసూలు చేసేవారు. పైగా వారి దోపిడి, దుశ్చర్యలను గోండులు ఖండించినందుకు జంగ్లాతోళ్లు స్థానిక జమీందార్లతో కలిసి జోడేఘాట్ పరిసరాల్లోని ఇండ్లను, పంటలను ధ్వంసం చేశారు. దీంతో తెల్లదొరలపై 'మన్యసీమ'లో 1922 నుంచి 1924 వరకు అల్లూరి సాగించిన మన్యం పోరాటం స్ఫూర్తితో కుమ్రంభీమ్ జోడేఘాట్ గుట్టల నుండి నిజాం పాలకులపై తుడుం మ్రోగించాడు. తన సహచరుడు కుమ్రం సూరు ద్వారా చదువు నేర్చుకుంటూ -రాజకీయం పట్ల అవగాహన పెంచుకున్నాడు. కుమ్రం సూరు సహాయంతోనే భీమ్ ఆదివాసీ హక్కుల పోరాటానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆసిఫాబాద్ పరిధిలోని 12 గ్రామాలకు చెందిన యువకుల సైన్యంతో కుమ్రంభీమ్ వాటిని "స్వతంత్ర గోండు రాజ్యం"గా ప్రకటించుకున్నాడు. అందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ సత్తార్‌తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. దీంతో కులపెద్దల సలహా మేరకు తమ డిమాండ్లను అర్జీ రాసుకుని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌కు విన్నవించడానికి వెళితే అధికారులు భీమ్‌కు అనుమతి ఇవ్వకపోవడమేగాక అవమానించారు.

వచ్చే తరాలు బాగుపడతాయని..

నిజాం రాజు తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఉద్యమ కేంద్రంగా జోడేషూట్ గుట్టల నుంచి పోరాటానికి భీమ్ సిద్ధపడినాడు. రాజీ పడని కుమ్రంభీమ్ పోరాట పటిమకు చలించిన నిజాం సర్కార్ ఓ మెట్టు దిగివచ్చి మన్యం గిరిజనుల' ప్రధాన సమస్య అయిన వారి భూము లకు పట్టాలిస్తామని వర్తమానం పంపింది. పట్టాలే కాదు అడవిపై సర్వహక్కులు, గూడేలకు స్వయంపాలన కావాలని భీమ్ మరోమారు డిమాండ్ చేశాడు. భీమ్ షరతులను ఒప్పుకోని సర్కార్ పోలీస్, సైనిక బలగాలతో నిఘా పెంచింది. అయినా "ఉద్యమంలో గెలిస్తే బతుకు తాం. వచ్చే తరాలు బతుకుతాయి, ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది. వెన్ను చూపడం తగదు. వెనుతిరుగేది లేదు" అని నినదించాడు. ఈ సందేశం భావితరాలకు స్ఫూర్తిదాయకం. చివరకు కుర్థుపటేల్ రహస్య సమాచారంతో జోడేఘాట్ గుట్టల్లో కుమ్రంభీమ్ 1940లో వీరమరణం పొందాడు. భీమ్ దాదా సాహసం, సంకల్ప బలం, త్యాగం, గోండు సమా జం నుంచి ప్రపంచానికి చాటింది. ఈయన చరిత్రను ఇంగ్లాండు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్ హైమండార్ఫ్ పరిశోధన చేసిన ఫలితంగానే ఆయన ఆదిమ గిరిజనులుగా బాహ్య ప్రపంచానికి పరిచయమైనారు. స్వయంపాలన ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన కుమ్రంభీమ్ చరిత్ర భావితరాలకు ఆదర్శనీయం. ఆ యోధుడి త్యాగ ఫలాలు ఆదివాసీలకు చేకూరేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. అదివాసీలకు ఎంతో చేసిన కుమ్రంభీమ్‌కి అదివాసీలు ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ మాసంలో శుద్ధపౌర్ణమి రోజున వర్ధంతి ఉత్సవాలను జరుపుతారు.

(నేడు కుమ్రంభీమ్ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం)

గుమ్మడి లక్ష్మీ నారాయణ

ఆదివాసీ రచయితల వేదిక,

9491318409

Advertisement

Next Story