హక్కుల యోధుడికి అడవిపూల నివాళి

by Ravi |   ( Updated:2023-10-08 00:46:12.0  )
హక్కుల యోధుడికి అడవిపూల నివాళి
X

ఆధిపత్యం చలాయిస్తున్న వారి హస్తాల్లో ఆటవస్తువుగా ఆదివాసీలు, దళితులు, బడుగు బలహీన వర్గాల వారు ఉన్నంతకాలం నిర్బంధమే తప్ప హక్కులు అనుభవించే వీలుండదు. వారు వారసత్వ హక్కులు పొందాలంటే ముందుగా మానవ హక్కుల గురించి తెలియాలి. హక్కుల కోసం అనునిత్యం పోరాడాలి. ఈ అవసరాన్ని గుర్తించిన అతి కొద్దిమందిలో బాలగోపాల్ ఒకరు. ఆదివాసీల జీవనాధారమైన నీరు, అడవి, భూమి వారి హక్కుగా ప్రచారం చేస్తూ... జీవిత పర్యంతం ఆదివాసీల కోసం ఉద్యమం కొనసాగించారు.

హక్కుల వేదిక ఏర్పరచి..

కందల్ల బాలగోపాల్ 1952, జూన్ 10న అనంతపురం జిల్లా బళ్ళారిలో జన్మించారు. ఆయనకు చిన్ననాటి నుండే ప్రగతిశీల భావాలు, అభ్యుదయ భావాలు కలిగి ఉండేవారు. గణితంలో ప్రావీణ్యం సంపాదించి కాకతీయ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్‌గా సేవలందించారు. వరంగల్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న కాలంలోనే అభ్యుదయ భావాలు, విప్లవోద్యమం వైపుగా బాలగోపాల్ ఆలోచనలు మారాయి. దాంతో సామాజిక, ఉద్యమ రచనలు చేస్తూనే.. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థను స్థాపించారు. రాజ్యం నుండి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఉమ్మడి రాష్ట్రంలో పౌరహక్కుల సంస్థను మానవ హక్కుల వేదికగా నామకరణం చేశాడు. మానవ హక్కుల రక్షణ కోసం రాజీలేని పోరాటం చేసిన బాలగోపాల్ హక్కుల యోధుడుగా చిరస్మరణీయుడు.

ఎంతో నిరాడంబరంగా ఉండే బాలగోపాల్ ఎక్కువగా ఆదివాసీలపై, ప్రజా ఉద్యమాలపై లోతైన విశ్లేషణ రచనలు చేసి ప్రజల హక్కులకు సరికొత్త నిర్వచనం తెలిపాడు. ఎక్కడ బూటకపు ఎన్ కౌంటర్లు జరిగినా ఆ ప్రదేశానికి వెళ్ళి విచారణ జరపడం ఆయన నైజం. దేశంలో ఎక్కడ హక్కులకు భంగం వాటిల్లినా వెంటనే స్పందించేవాడు. వివిధ ప్రాజెక్టుల వల్ల, సింగరేణి ఓపెన్ కాస్ట్ ల వల్ల నిర్వాసితులు అయ్యే ఆదివాసీలు, దళితులకు అండగా నిలిచాడు. అడవిని నమ్ముకొని గుడిసెలు వేసుకొని జీవిస్తున్న విశాఖ ఏజెన్సీ చింతపల్లిలోని వారి గృహాలను 1987లో పోలీసులు దహనం చేశారు. అన్నలకు ఆశ్రయమిస్తున్నారనే అభియోగంతో 46 గ్రామాల్లో 638 గుడిసెలను తగులబెట్టి నిరాశ్రయులను చేశారు. అంతటి భయానక వాతావరణంలోనూ బాలగోపాల్ పరామర్శించటం వారిలో ఎంతో ధైర్యాన్ని నింపింది. కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి న్యాయం కోసం అడుగులు వేయగల శక్తినిచ్చింది. ఇండియన్స్ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసి వారి ముంగిటకు న్యాయస్థానం రప్పించగల్గిన నిఖార్సయిన హక్కుల కార్యకర్త బాలగోపాల్. ముగ్గురు ఉన్నత న్యాయమూర్తులతో విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయించిన సాహసి.

అందరికీ సమాన హక్కులు ఉండాలని..

2007, ఆగష్టు 20న విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం వాకపల్లికి చెందిన 11 మంది ఆదివాసీ మహిళలపై కూంబింగ్‌కు వెళ్ళిన గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. పైగా అక్కడి సాక్ష్యాధారాలను మాయం చేయడమే గాక బాధిత మహిళలను మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసింది ప్రభుత్వం. పోలీసులు, అధికారులు కుమ్మకై వారి మానాలకు ఐదు లక్షలు వెలకట్టి కొనాలని చూశారు. అయినా బాధితులు ఆ డబ్బు తిరస్కరించడంతో, మహిళలు సంఘీభావంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు ఆత్మగౌరవం చంపుకొని బ్రతకలేమని, తమ పిల్లాపాపలతో పాడేరు వచ్చి ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్న ఆత్మగౌరవ ఉద్యమానికి బాలగోపాల్ బాసటగా నిలిచారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూనే న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. సాక్ష్యాధారాలు లేవని జిల్లా కోర్టు కేసు కొట్టేసింది. ఆదివాసీ మహిళల ఆవేదనలో నిజముందని గ్రహించిన బాలగోపాల్ తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ మహిళల ఆత్మవేదన న్యాయస్థానానికి వినిపించే సమయం వచ్చే నాటికి అనగా 2009, అక్టోబర్ 8న ఆత్మీయ ఆదివాసీ హక్కుల గొంతు ఆగిపోయింది. ఆయన అనుకున్న విధంగా బాధితులకు అనుకూలంగా కేసును తిరిగి కొనసాగించాలని తీర్పు వచ్చింది. వాకపల్లి దుర్ఘటన జరిగి పదహారేళ్లు గడిచింది. ఐనా పాలకుల ఉక్కుపిడికిలిలో నలిగిపోయి నిరాకరించబడ్డ న్యాయం నిందితులను కాపాడుతూ వస్తున్నది. అణగారిన వర్గాలు, ఆదివాసీల హక్కుల సాధన కోసం న్యాయస్థానాలను సైతం ఆశ్రయించి, వారి సమస్యల పరిష్కారం కోసం తాపత్రయపడిన నిత్యకృషీవలుడు బాలగోపాల్. ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసీలకు స్వయం పాలనను కాంక్షించిన వారిలో బాలగోపాల్ కూడా ఒకరు. ఈ సమాజంలో పౌరులందరికీ అన్నిరంగాల్లో సమాన హక్కులు కావాలని రాజ్యంపై పోరాడిన అరుదైన హక్కుల యోధుడు బాలగోపాల్ అనడంలో అతిశయోక్తి లేదు. హక్కుల పోరులో తన జీవిత పర్యంతం పోరాడిన బాలగోపాల్‌కు అడవిపూల నివాళి.

(నేడు బాలగోపాల్ వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీ నారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక

94913 28409

Advertisement

Next Story

Most Viewed