ఆదివాసీల దేవుడు బిర్సా ముండా

by Ravi |   ( Updated:2023-11-14 23:16:03.0  )
ఆదివాసీల దేవుడు బిర్సా ముండా
X

ఆంగ్లేయులకు చుక్క‌లు చూపించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా త‌క్కువ కాలం మాత్ర‌మే జీవించినా ప‌ది కాలాల పాటు గుర్తు పెట్టుకునేలా పోరాడిన ధీరోదాత్తుడు. ఆనాటి బ్రిటిష్ దాష్టీకాల్ని ఎదిరించి,ఆదివాసీల‌ను స‌మీక‌రించి చైత‌న్య‌వంతం చేసి ఒక స‌మూహాన్ని ఏర్పాటు చేసి అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవంగా మారాడు. గిరిజ‌నులకు సంబంధించి భూమి హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించే చ‌ట్టాల‌ను ప్ర‌వేశ పెట్టాలంటూ డిమాండ్ చేశాడు ప‌ట్టుమ‌ని. ఈ నేల మీద కేవ‌లం 25 ఏళ్లు మాత్ర‌మే జీవించాడు. కానీ కాలం ఉన్నంత వ‌ర‌కు బిర్సా ముండా బ‌తికే ఉంటాడు ఆదివాసిల గుండెలో గిరిజ‌న నాయ‌కుడిగా, స్వాతంత్ర స‌మ‌ర యోధుడిగా గుర్తింపు పొందాడు. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువ కిశోరం బిర్సాముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి..

జార్ఖండ్ లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవంబర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు బిర్సాముండా జన్మించాడు కుటుంబం పేదరికం కారణంగా తన మేనమామ వారి గ్రామానికి తీసుకుపోయి ‘సాల్గా’ గ్రామంలో తన వద్దే ఉంచుకుని ప్రాథమిక విద్యను పూర్తి చేయించాడు. అనంతం చయిబాసా లోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సాముండా పేరు బిర్సాడేవిడ్‌గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. చోటా నాగపూర్ ప్రాతంలో అడవి మీద ఆధారపడే ఆదివాసుల హక్కుల కోసం పోరాటం నడిపాడు. ఆదివాసులు అందరూ చదువుకోవాలని మొట్టమొదటి సారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్ వాళ్ల బాధలు పడలేక చాలా మంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు.

తమ భూములను తిరిగిచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్లదొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. కుంతి, తామర్, బసియా, రాంచి ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్నినడిపారు. బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించేవాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతో మంది ఆదివాసీలను కాపాడాడు. తాను నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సాముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు.

జీవితమంతా ఆదివాసీల కోసమే..

తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్‌లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారి పై దాడులకు దిగేవారు బ్రిటిష్ వాళ్లు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు 1900 జనవరి 5న ఆయన ఇద్దరి అనుచరులను కాల్చిచంపారు. ఈ సంఘటన తన మనసును కలచి వేసింది. ఎంఏ ఫోబ్స్, ఎంసీ సిట్రిడ్ ఫైడ్ అనే బ్రిటిష్ కమిషనర్లు‘ బిర్సాముండా’ను చంపితే రూ. 500 ఇస్తామని రివార్డు ప్రకటించారు. బ్రిటిష్ ఆయుధ బలగాలు దుంబర్ హిల్ అనే పర్వత ప్రాంతంలో ‘బిర్సాముండా’ పైన కాల్పులు జరిపారు. ఆ ఘటనలో చాకచక్యంగా తప్పించుకున్నాడు.

జాతీయ ఉద్య‌మంపై ఎన‌లేని ప్ర‌భావం చూపించాడు బిర్సా ముండా. ఆయ‌న పుట్టిన రోజుకు గుర్తుగా 2000వ సంవ‌త్స‌రంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్ప‌డింది. త‌న జీవిత కాలమంతా ఆదివాసీల బాగు కోసం ప‌రిత‌పించిన యోధుడు బిర్సా ముండా. కోట్లాది ప్ర‌జ‌లు తనను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ భూమి ప‌విత్ర‌మైన‌ద‌ని, ఇది అడ‌వి బిడ్డ‌ల‌కు మాత్ర‌మే చెందింద‌ని నిన‌దించాడు బిర్సా ముండా. 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీప్రాంతంలో బిర్సాముండాను అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సాముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఆ పోరాట వీరుడికి మ‌ర‌ణం లేదు. యావ‌త్ దేశం బిర్సా ముండాకు స‌లాం చేస్తోంది. గిరిజ‌న బిడ్డ‌లు స్మ‌రించుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సాముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే.

(నేడు బిర్సా ముండా 149వ జయంతి)

ఎన్. సీతారామయ్య

94409 72048

Advertisement

Next Story

Most Viewed