- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వెన్నుచూపని మన్యం వీరుడు.. గంటం దొర
భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్మరణీయుడు, మన్య విప్లవవీరుల్లో గొప్ప గిరిజన నాయకుడు గాము గంటందొర. ఆయన ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించారు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితిని తొలగించి, వారి జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి అల్లూరి సీతారామరాజుతో కలిసి గాము గంటందొర 1922 నుంచి 1924 వరకు మన్యం విప్లవం సాగించారు. అల్లూరి సీతారామరాజుకి కుడిభుజంగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తూ 1924 వ సంవత్సరం జూన్ 7న వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్ట కాలువ పైన ఉన్న సింగదార అనే ప్రదేశంలో వీర మరణం పొందారు.
బికారి అయిన మునసబు
గాము గంటందొర గ్రామ మునసబుగా పనిచేసేవారు. ఇతనిని ప్రజలు ఎంతగానో అభిమానించేవారు. ఆయన కూడా ఎప్పుడూ గిరిజన ప్రజల సంక్షేమాన్ని, వారి అభివృద్ధి కోరుకుంటూ వారి సర్వతోముఖాభివృద్ధికి నిత్యం కృషి చేసేవాడు. పరిపాలన వ్యవహారాలలో ఎంతో అనుభవం ఉండేది. ప్రజల మనస్తత్వం పూర్తిగా తెలిసినవాడు. ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉండేవాడు. ఇది గూడెం డిప్యూటీ తహసీల్దార్ సెబాస్టియన్‌కి నచ్చేది కాదు. ఎప్పుడూ గంటం దొరను ఇబ్బందులు పెడుతూ అవమానాలకు గురి చేసేవాడు. కుట్రపన్ని ప్రభుత్వ సొమ్మును కాజేశారని గంటం దొరపై నిందలు వేసి మునసబు పదవి నుంచి తప్పించేశాడు. బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గంగా ఆయన భూములను, ఎడ్లను జప్తు చేసింది. చివరకు ఆయన ఇంటిని కూడా ఆక్రమించింది. న్యాయ మార్గాన్ని నమ్ముకున్న గంటందొరకు తీవ్ర అన్యాయం జరిగింది. దానితో వీరి కుటుంబం పూర్తిగా పేదరికంలో కూరుకుపోయింది. దీంతో తమకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకొని అప్పటికే ప్రభుత్వంపై
పోరాటానికి సన్నాహాలు చేస్తున్న అల్లూరి సీతారామరాజుతో కలిసి మన్యం విప్లవానికి నాంది పలికారు. గంటం దొర గిరిజనులకు సుపరిచితుడు పైగా పాలన వ్యవహారాలలో పూర్తిగా అనుభవం కలిగి ఉండటం వలన అల్లూరి సీతారామరాజు 60 మంది గిరిజన పోరాటయోధులతో ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రధాన బాధ్యత గంటం దొరకు అప్పగించారు.
పోలీసు స్టేషన్లపై దాడులు
వీరిద్దరూ కలిసి మన్య విప్లవంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించి చింతపల్లి స్టేషన్‌పై దాడి చేయడంతో ఆరంభమైంది. పోలీస్ స్టేషన్ ఆక్రమించి తుపాకులు, తూటాలు తీసుకొని వెళ్ళిపోయారు.అలాగే, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, ఆ మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లను ఆక్రమించి, తుపాకులు, మందు గుండు సామాగ్రి స్వాధీనపరుచుకున్నారు. మన్య పోరాటంలో మరొక గొప్ప సంఘటన కర్కశులైన బ్రిటిష్ మిలటరీ అధికారులు స్కాట్ కవర్డ్, హైటర్లను అంతం చేయడం. వారు విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు అల్లూరి, గంటం దొర నాయకత్వంలో మన్యం వీరులు వారిని అంతం చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. ఆ తర్వాత అడ్డతీగల పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్లను ముందుగానే ముట్టడిస్తానని మిరపకాయ టపా పంపి మరీ వశపరుచుకున్నారు.
ఈ విధంగా మన్యవిప్లవంలో ముఖ్యమైన అన్ని సంఘటనలలో గంటం దొర చాలా కీలకపాత్ర పోషించారు. పితూరిని ముందుకు నడిపేందుకు ఎవరు ఏవిధంగా పనికొస్తారో, ఎవరిని ఉద్యమంలో కలుపుకొని వెళ్ళాలి అనే విషయాలను అల్లూరి సీతారామరాజుకి గంటం దొర చెప్పేవారు. అల్లూరి ఆలోచనా విధానాన్ని, సిద్ధాంతాలను, మనసును నూటికి నూరు శాతం అర్ధం చేసుకుని మెలిగిన వ్యక్తి గంటం దొర. మన్యవిప్లవం నుంచి గంటందొర జీవితాన్ని వేరుగా చూడలేం. పితూరీలు, పోరాటాలు గంటం దొర జీవితం. స్వేచ్ఛ కోసం జరిపిన గెరిల్లా పోరాటమే గంటం దొర జీవిత చరిత్ర. గిరిజన ప్రజల సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా, గిరిజన కష్టాలు తీర్చడమే తన కర్తవ్యంగా పోరుబాట సాగిన వీరుడు గాము గంటందొర.
అల్లూరి తర్వాత కూడా పోరు బాట వీడలేదు
అల్లూరి సీతారామరాజు మరణానంతరం కూడా బ్రిటిష్ ప్రభుత్వంపై మన్యంలో పోరాటం కొనసాగిస్తూ బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు గాము గంటం దొర. ఆ క్రమంలో చివరికి 1924వ సంవత్సరం జూన్ 7వ తేదీన కృష్ణదేవిపేట దగ్గరలో ఉన్న వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్ట కాలువ పైన ఉన్న సింగధార అనే ప్రదేశంలో బ్రిటిష్ సైన్యంపై వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు గాము గంటందొర. 1922 నుండి 1924 వరకు దాదాపుగా రెండేళ్లు సాగిన మన్య పోరాటంలో, ఎందరో వీరులు తమ జీవితాలను ధారపోసి అందించిన స్వరాజ్యం మనది. ఎందరో జైలు గోడల మధ్య చిత్రహింసల అనుభవించి, స్వాతంత్య్రాన్ని మనకు అందించి ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా జీవితాలు చాలించారు. ఆ వీరులందరి త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు.
(నేడు మన్య విప్లవ వీరుడు గాము గంటం దొర వర్ధంతి)
ఎన్. సీతారామయ్య
94409 72048
- Tags
- gam gantam dora