బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల

by Ravi |   ( Updated:2024-03-13 00:31:12.0  )
బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల
X

ఈయన అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గురువు! హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నికైన మొట్టమొదటి, చిట్టచివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే! న్యాయవాదిగా, బహుభాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు పాత్ర హైదరాబాద్ చరిత్రలో చిరస్మరణీయమైనది.

ఉద్యమకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు ఇంటి పేరు పుల్లమరాజు. వీరి గ్రామం బూర్గుల. వీధిబడిలో మొదలైన విద్యాభ్యాసం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదివి బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఆయనకు తెలుగుతో పాటు ఇంగ్లీషు, ఉర్డూ, పార్సీ, సంస్కృతం, మరాఠీ, కన్నడం, మలయాళీ భాషల్లో మంచి పరిజ్ఞానం ఉంది. ఆయా భాషల్లో రచనలు కూడా చేశారు. హైదరాబాదులో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన బూర్గుల పేదల పక్షాన నిలిచి కోర్టులో వాదించి సమర్థుడైన న్యాయవాదిగా పేరుపొందాడు. ధన సంపాదన కాకుండా ప్రజాహితమే లక్ష్యంగా తన అనన్యమైన వాదన పటిమతో కేసులు వాదించేవాడు. అపర చాణక్యుడిగా కీర్తించబడిన పీ.వీ.నరసింహారావు బూర్గుల వారి వద్ద జూనియర్‌గా పనిచేసే ఎంతో నేర్చుకున్నారు.

ఎన్నో సంస్కరణలకు శ్రీకారం..

బూర్గుల రామకృష్ణారావు ప్రతిభ విశేషాలు గుర్తించిన నాటి హైదరాబాదు దివాన్ (ప్రధానమంత్రి) సర్ మీర్జా ఇస్మాయిల్ ఆయనకు హైకోర్టు న్యాయమూర్తిగా, న్యాయశాఖాధిపతిగా పదవిని ఇవ్వజూపగా తిరస్కరించాడు. న్యాయవాదిగా ఉంటూనే అంద్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమాలలో పాల్గొన్నాడు. బ్రిటిష్ వారి పాలనను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. ఆ విధంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్న ఉద్యమకారుడు. హైదరాబాద్ రాష్ట్రంలో 1948 లో పోలీసు చర్య జరిగిన తర్వాత భారత ప్రభుత్వంచే ముఖ్యమంత్రిగా నియమితులైన ఎంకె.వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రెవిన్యూ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. హైదరాబాదు రాష్ట్రంలో మొదటిసారిగా 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షాద్ నగర్ నుండి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన భూసంస్కరణలు దేశానికే ఆదర్శవంతమైనాయి. హైదరాబాద్ రాష్ట్రంలో తరతరాల నుండి వస్తున్న జాగీర్దారు వ్యవస్థను రూపుమాపారు. కౌలుదారీ చట్టాన్ని తీసుకువచ్చారు. వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్ధత కల్పించారు.

గొప్ప సాహితీవేత్త కూడా..

ఆయన విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పటివరకు తెలుగు వారికి ఉర్దూ బోధన భాషగా ఉండేది. దానిని రద్దు చేసి తెలుగు మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించారు. బూర్గుల వారు గొప్ప పరిపాలకుడే కాక సాహితీవేత్త కూడా సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శృంగగిరి శారదాకృతి, శ్రీరామస్తవం, తెలుగులో కృష్ణశతకం పుష్పాంజలి తోకచుక్క మొదలైన పద్యకవితలను, అనువాద రచనలు, సాహితీ వ్యాసాలను, ఎన్నో గ్రంథాలకు పీఠికలను రాశారు. ఇంగ్లీషులో కూడా ఎన్నో కవితలు రాశారు. పారసీక వాజ్మయ చరిత్రను రాశారు. ఒక రాజకీయవేత్తలో ఇంత గొప్ప సాహితీవేత్త ఉండడం చాలా అరుదు. అందుకే మహాకవి దాశరథి సంస్కృత శ్లోకం, పారశీ, గజల్ తెలుగు పద్యం, వెరసి బూర్గుల అని బూర్గుల వారిని విమర్శించారు.

తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మద్దతు ఇచ్చి తన పదవిని త్యాగం చేశారు. ఆ తర్వాత కేరళ రాష్ట్రానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసారు. రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. ఇలా విశిష్టమైన వ్యక్తిత్వం ఉదారత్వం కలిగిన వ్యక్తిగా సుపరిపాలన శక్తిగా ఎదిగిన బూర్గుల రామకృష్ణారావు గారు 1967 సెప్టెంబర్ 14న గుండెపోటుతో కన్నుమూశారు.

(నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి)

- సుధాకర్.ఏ.వి

అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story