దేశభక్తికి అసలు ప్రతిరూపం

by Ravi |   ( Updated:2024-09-28 00:45:52.0  )
దేశభక్తికి అసలు ప్రతిరూపం
X

ఈ పేరు వినగానే బ్రిటిష్ వలస పాలనపై తిరుగుబాటు చేసిన పౌరుషం గుర్తుకొస్తుంది, చావును ధిక్కరించి దేశం కోసం, ఉరికొయ్యకు వేలాడిన వీరుడి ప్రాణత్యాగం మదిలో మెదులుతుంది. ఆయన దేశభక్తికి అసలు సిసలైన ప్రతిరూపంగా కనిపిస్తాడు. త్యాగం ధైర్య సాహసాలకు పోరాట సంకేతంగా నిలుస్తాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎత్తుకొని జాతీయోద్యమాన్ని ఉర్రూతలూగించిన వీరుడు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన ధీరుడు భగత్ సింగ్.

భగత్ సింగ్, ఉగ్గుపాలతో పాటు దేశభక్తి, విప్లవ భావాలు వంట పట్టించుకోని పెరిగిన గొప్ప విప్లవకారుడు. దేశం కోసం చిరునవ్వు చిందిస్తూ 23 ఎండ్లకే ఉరి కంబమెక్కి ఎంతో ఆదర్శప్రాయుడిగా నిలిశాడు. స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ జీవించింది అతి తక్కువ కాలమే అయినప్పటికీ, స్వాతంత్ర్య పోరాటంలో ధ్రువ తారాగ వెలిగాడు. తరాలు గుర్తు ఉండేలా పోరాట స్ఫూర్తి రగిలించాడు. అనునిత్యం ఈ దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా యువత భగత్ సింగ్ నుండి అత్యంత స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. దేశంలో నేడు ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం, కార్మిక, కర్షక హక్కుల కోసం గొంతెత్తి నినదిస్తున్న పోరా టాల్లో, ప్రశ్నల రూపంలో భగత్ సింగ్ ఆలోచనలు సజీవంగానే ఉన్నవి.

మార్క్సిజమే మార్గమంటూ...

భగత్ సింగ్ 12 ఏళ్ల పసి వయస్సు‌లోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడిగా మారాడు. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ ఊచకోత అతడిని రగిలించింది. స్వాతంత్ర పోరాటంలో ప్రజా వెల్లువ ఎగిసి పడుతున్న ప్రతి సందర్భంలోనూ గాంధీ నాయకత్వంలో రాజీ ధోరణులు, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు నిలిపివేయడం వంటి ఇతర అనేక అంశాలతో, విభేదించిన విప్లవకారులు భగత్ సింగ్ నాయకత్వంలో హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్టు ఆర్మీని ఏర్పాటు చేసి విప్లవ పోరాట కార్యాచరణ కొనసాగించారు. ప్రపంచంలో మొట్ట మొదటి సోషలిస్టు విప్లవం స్ఫూర్తి నందుకొని భారతదేశంలో మార్క్సిస్టు దృక్పథాన్ని వర్తింపజేసి పనిచేయడం ప్రారంభించారు.

వర్గ సమాజ స్థాపనే నా మతం!

ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి దోపిడీ చేయనటువంటి వర్గ రహిత సమసమాజమే తమ లక్ష్యంగా ప్రకటించారు భగత్ సింగ్. ఈయన సామ్రాజ్యవాదానికి, దోపిడీకి మాత్రమే గాక, భగవంతునికి, మతానికి కూడా వ్యతిరేకి. మీ, మాయ, తలరాత, భగవంతుడు ఇవన్నీ పాలక వర్గానికి చెందిన దోపిడీదారులు సామాన్య ప్రజలను మోసగించడానికి ఉపయోగించే విషపు భావాలే తప్ప మరొకటి కాదని భగత్ సింగ్ చెబుతుండేవాడు. 'ఇంతవరకు అన్ని మతాలు ప్రపంచ ప్రజలను విడదీశాయి. వారిలో కలహాలు రేకెత్తించాయి. ప్రపంచంలో ఇప్పటివరకు మతాల పేరిట కొనసాగించినంత రక్తపాతం వేరే ఏ విషయంలోనూ సంభవించలేదంటాడు. అందుకే మానవులను వర్గ రహిత సమాజం వైపు తీసుకుపోయే అన్ని ప్రయత్నాలు నా మతాలే' అంటాడు. అతను ఎప్పుడూ తనకు తాను నాస్తికుడు గానే అభివర్ణించుకున్నాడు. భగత్ సింగ్‌కు ముందున్న విప్లవకారుల ప్రధాన లక్ష్యం దేశ స్వాతంత్యం మాత్రమే.

భగత్‌సింగ్‌కి ముందు ఈ స్వాతంత్ర్యం ఎలా ఉండాలనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాలు లేవు. కానీ మన సమాజంలో ఆర్థిక అసమానత్వం ఒక మనిషిని మరో మనిషి దోచుకుంటుండగా, నిజంగా మనం స్వాతంత్రాన్ని అనుభవించగలమా? దేశ స్వాతంత్రం తరువాత ఏర్పడే ప్రభుత్వం ఎవరిదిగా ఉండాలి? అప్పటి సాంఘిక వ్యవస్థ ఎలా ఉండాలి? ఇటువంటి విషయాల గురించి విప్లవ వీరులలో అస్పష్టత అత్యధికంగా ఉండేది. భగత్ సింగ్ అందరికన్నా ముందుగా ఈ సమస్యలను లేవనెత్తి సోషలిజాన్ని తమ పార్టీ ధ్యేయంగా ముందు ఉంచాడు. అయితే తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడిన భగత్ సింగ్ కన్నకలలు ఈ దేశంలో ఇంకా నెరవేరలేదు. నేటి పాలకులు భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. నేడు దేశంలో పాలకులు మనుషులను మతాల పేరిట విడగొట్టి, విభజన రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతను మతం మత్తులో ముంచి మెదళ్లను విషపు భావాలతో కలుషితం చేస్తూ, ఉన్మాదులుగా మారుస్తున్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ, ప్రశ్నించే చైతన్యాన్ని అలవర్చుకోవడమే భగత్ సింగ్‌కి మనం ఇచ్చే నిజమైన నివాళి..

(నేడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా)

కోట రమేష్,

డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు

96183 39490

Advertisement

Next Story

Most Viewed