గోండుల తొలి పోరాటయోధుడు

by Ravi |   ( Updated:2024-04-09 00:45:23.0  )
గోండుల తొలి పోరాటయోధుడు
X

మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల (గోండుల) నాయకత్వంలోని రాంజీగోండు ఆధ్వర్యంలో 'రోహిల్లా తిరుగుబాటు' (1838-60), కుమరంభీమ్ చేసిన 'జోడేఘాట్ తిరుగుబాటు' (1938-40) దేశంలో ఆదివాసీ చారిత్రక పోరాటాలుగా నిలిచాయి. మధ్య భారత్‌లో నివసించే గిరిజనుల్లో ప్రధానమైంది గోండు తెగ. ఈ తెగకి మురియాగోండ్, మారియా గోండు ఉప తెగలు కాగా, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిషాల్లో రాజ్‌గోండ్, దుర్వుగోండ్ ఉపతెగలుగా ఉన్నాయి. వీరినే కోయత్తోర్'గా కూడా పిలుస్తారు.

గోండుల పరిపాలన క్రీ.శ 1240-1750 వరకు 5 శతాబ్దాలు సాగింది. సూర్జా బలాల్ సింగ్ ఢిల్లీ సుల్తానుల సైన్యంతో యుద్ధంచేసి విజయం సాధించారు. సుల్తానులు గోండ్వానాలోని దక్షిణ మండల ప్రాంతాన్ని, 'షేర్ షా' బిరుదును గోండుల తొలి రాజు బబాల్ సింగ్‌కు కానుకగా ఇచ్చారు.. దీంతో గోండురాజులు తమ పేరు చివరన షా పెట్టుకున్నారు. సూర్జా బలాల్ సింగ్ తనయుడు ఇందియా బలాల్ షా రాజధానిని సిర్పూర్ (టి) నుంచి చంద్రాపూర్‌కి మార్చాడు. గోండు రాజులలో చివరివాడైన నీల్ కంట్ షా ను మరాఠీలు బందీని చేసి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం క్రీ.శ. 1750-1802 వరకు మరాఠీల ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత మరాఠీ రాజులు బ్రిటీష్ వారికి తలొగ్గి గోండ్వానాను తెల్లదొరలకు అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై ఆంగ్లేయుల, నైజాముల పాలన ఆరంభమైంది.

బ్రిటిష్ పాలకుల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు ఉద్యమాలు ఒక్కొక్కటిగా ప్రారంభమైనాయి. బ్రిటిష్ వారి ఆకృత్యాలతో గోండు గిరిజనులు బానిస బతుకులు వెళ్ళదీశారు. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో రోహిల్లాలతో పాటు 500 పైగా గోండులు పులిబెబ్బులులై విల్లంబులు, బరిసెలు, తల్వార్లు ధరించి కదనరంగానికి సిద్ధమయ్యారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను కల్నల్ రాబర్ట్ కు అప్పజెప్పింది. ఆయన అడవంతా తుపాకుల మోత మోగించారు. సంప్రదాయక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న 'ఊడలమర్రి' చెట్టుకు 1880 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు "వెయ్యి ఉరిల మర్రిచెట్టు"గా ప్రసిద్ధి. అలాగే ఆ చెట్టు అమాయక అడవిబిడ్డల ఆర్తనాదాలను, బ్రిటిష్ నిరంకుశత్వాన్ని ఛేదించిన వైనాన్ని అణువణువునా జీర్ణించుకొని ఉంది. రాంజీగోండు స్మరణకు ఆనవాళ్ళు కూడా లేకపోవడం పాలకుల వివక్షకు దర్పణం.

(నేడు రాంజీ గోండ్ వర్ధంతి)

- గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

9491318409

Advertisement

Next Story

Most Viewed