- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనుల ఆరాధ్యదైవం
ప్రకృతిని కన్నతల్లిగా ఆరాధిస్తూ, స్వతసిద్ధ విద్యలతో ప్రజలకు మేలు చేసే సంచార జాతులు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి కొన్ని జాతుల్లో ఎరుకల, యానాదులు, చెంచు తదితర జాతులు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి సంచార ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు, వారి చైతన్యం కోసం కృషి చేసి వారి జీవితాల్లో వెన్నెల వెలుగులు నింపిన మహనీయుడు, సంఘ సంస్కర్త వెన్నెలకంటి రాఘవయ్య.
ఆయన నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా సింగం పేట గ్రామంలో 1897 జూన్ 4న జన్మించారు. రాఘవయ్యది తీవ్రవాద భావాలతో మొదలై గాంధేయవాదిగా పరివర్తన చెందిన అపురూపమైన జీవితం. తన నవ యవ్వనంలో ఆయన పొణకా కనకమ్మ గారి ఆర్థిక సహాయంతో ఓ.వి.చిదంబరం పిళ్ళై ద్వారా ఆయుధాలు కొనుగోలు చేశారు. సుబ్రహ్మణ్య భారతి, అరవింద ఘోష్‌లను కలుసుకున్నాడు. తిలక్‌ని కూడా కలుసుకున్నాడు, కాని తిలక్ ఆయన్ని తీవ్రవాద పంథా నుంచి బయటపడాలంటూ మందలించాడు. ఆ తర్వాత ఆయన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నెల్లూరు జిల్లా నుంచి జైలుకు వెళ్లిన మొదటి సత్యాగ్రాహిగా చరిత్రకెక్కాడు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రాఘవయ్యను బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి 22 నెలలు జైల్లో ఉంచారు. జైలు నుంచి బయటకు వచ్చిన రాఘవయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం తేవడంలో తన వంతు పాత్ర పోషించారు. తొలిరోజుల్లో బహుముఖంగా సాగిస్తున్న ఆ పోరాటాలన్నింటినీ పక్కనపెట్టి, కేవలం గిరిజన విమోచన అనే ఏకైక లక్ష్యానికి అంకితమయ్యాడు.
యానాది రాఘవయ్య
సంచార గిరిజనులకు సంబంధించి రాఘవయ్య చేపట్టిన కృషిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు అంశాలు. మొదటిది, ఆయన బ్రిటిష్ ప్రభుత్వం చేసిన క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ని రద్దుచేయించడంలో చేసిన అసమానమైన కృషి. రెండవది, యానాదులు పట్ల తక్కిన సమాజాన్ని మేల్కొల్పడానికి సాగిస్తూ వచ్చిన నిర్విరామ పోరాటాలు. అవి ఏ స్థాయిలో నడిచేయంటే, ఆయనను ప్రజలు యానాది రాఘవయ్య గానే పిలవడానికి అలవాటు పడిపోయారు. ఇక మూడవది, గిరిజనుల గురించి, గిరిజన సమస్యల గురించి దాదాపు ఇరవైకి పైగా రాసిన విశిష్ట గ్రంథాలు.
యానాదులని ఒక్కటి చేసి..
భారతదేశంలో గిరిజనుల పట్ల శాపంగా మారిన అతి భయంకరమై, క్రూరమైన 1871 ట్రైబల్ యాక్ట్‌ని రద్దు చేయించడంలో రాఘవయ్యది ప్రధాన పాత్ర. ఇది ఎంత భయంకర చట్టం అంటే బ్రిటిష్ వారి అవసరాల కోసం అంటే రోడ్లు వేయడానికి, బ్రిడ్జ్‌లు కట్టడానికి రైల్వే ట్రాక్‌లు నిర్మించడానికి తమకు బానిసలుగా పని చేయడానికి గిరిజనులను దొంగలు, దోపిడీ దారులుగా చిత్రీకరించి వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్‌లు పెట్టి గిరిజనులను ప్రభుత్వ బానిసలుగా చేసుకునేదే ఈ చట్టం. తప్పు చేసినా చెయ్యకపోయినా తండాలు, సంఘాల్లో ఉండే గిరిజనులు వారం వారం వెళ్లి పోలీస్ స్టేషన్‌లో వేలి ముద్రలు వేసి రావాలి. ఈ చట్టం వలన దేశంలోని అనేక గిరిజన తెగలు, బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. ఈ చట్టం వలన గిరిజనులను ఊర్లలోకి రానిచ్చేవారు కాదు. రాఘవయ్య పోరాట ఫలితంగా 1947లో ఈ చట్టాన్ని తొలగించారు.
రాఘవయ్య ఆది ఆంధ్ర సంఘాన్ని స్థాపించి యానాదులు, ఎరుకలు, లంబాడీలు, చెంచులు, కోయలు, బుడబుక్కల వంటి సంచార జాతులను సమీకరించి, సంఘటితం చేసి వారిలో అనేక మార్పులకు కారణం అయ్యారు. ముఖ్యంగా చెట్టుకొకరు, పుట్టకొకరు విసిరేసినట్లుండే యానాదులు, చల్లా యానాదులను సంఘటితం చేసి కాల్వల పక్కన, చెరువుల పక్కన, పొలాల్లో గుడిసెలు వేసుకుని మిగిలిన సమాజంతో సంబంధం లేకుండా వెలి వేసినట్లు బతుకుతున్న యానాదులను ఒక్కటిగా చేసి వారికి కాలనీలు నిర్మించి, వారి పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, బాలబాలికలకు వేర్వేరు హస్టళ్లు నిర్మించి విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది.
నిర్విరామ సమరయోధుడు..
నేడు నెల్లూరు జిల్లాలో యానాదులకు చదువు అనేది తెలిసింది అంటే ఆ మహనీయుని పుణ్య ఫలితమే. ఇవాళ జిల్లాలో ఉన్న అనేక గిరిజన సంఘాలు, కాలనీలు ఆ మహానుభావుడు ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. గిరిజనుల పాలిట శాపంగా ఉన్న అనేక చట్టాలను రద్దు చేయించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు. ఆంధ్రదేశంలో గిరిజన పోరాటాలకు సంబంధించి వెన్నెలకంటి రాఘవయ్య కొనసాగించిన ఉద్యమం వెల కట్టలేనిది. ఆయన నిస్వార్థ, నిర్విరామ స్వాతంత్ర్య సమరయోధుడు. 1981, నవంబర్ 24న తుదిశ్వాస విడిచినా, ఆయన సేవలు అజరామరం. ఆయన స్ఫూర్తి అనంతం. నిమ్న జాతి ప్రజలకి సమాన అవకాశాలు కల్పించడంలో ఆయన చూపిన స్ఫూర్తిని మనం కొనసాగించాలి.
- సామల కిరణ్
99511 72002