నిర్బంధ శిబిరాలుగా ప్రైవేటు విద్యాలయాలు

by Ravi |   ( Updated:2023-03-17 19:00:56.0  )
నిర్బంధ శిబిరాలుగా ప్రైవేటు విద్యాలయాలు
X

టీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే నిమిత్తం, ముక్కుపచ్చలారని వయసులోనే నిండా మూడు సంవత్సరాలు నిండకుండానే ప్రైవేటు పాఠశాలల్లో చేరిపిస్తూ, రెండు ఇంగ్లీష్ మాటలు, నాలుగు రైమ్స్ చెబుతూంటే మురిసిపోతూ వేలు, లక్షల రూపాయలు ఫీజులు కడుతూ తమ జీవితాలను గడుపుతున్నారు.‌ అమ్మనాన్నల ప్రేమ, అనురాగం చిన్నతనం నుంచే దూరం అవుతూ, బాల్యం నుంచే మార్కులు, గ్రేడులే లక్ష్యంగా జీవిత ప్రయాణం కొనసాగుతోంది.‌ ఇక ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య వచ్చే నాటికి రోజులో దాదాపు పద్దెనిమిది గంటలపాటు రెగ్యులర్ సిలబస్‌తో పాటు, రకరకాల ప్రత్యేక పరీక్షల పేరుతో ప్రత్యేక క్లాస్‌లు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థుల మధ్య పోటీ మొదలై కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.‌ దీంతో ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..

రోజంతా చదివించడం వలన..

చదువు ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యం మీద, పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వ్యక్తి అభ్యసనా ప్రక్రియలపై కూడా ఆధారపడి ఉంటుంది.‌ ఇవి అందరి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ముందుగా గ్రహించాలి.‌ ప్రస్తుతం చదువులన్ని మార్కులు గ్రేడులే లక్ష్యంగా చేసుకుని సాగుతున్నాయి.‌ దీనికోసమే చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలు తమ ఆస్తులను సైతం అమ్ముకుని తమ పిల్లలను చదివిస్తున్నారు.‌ ఈ పరిస్థితి మంచి లాభసాటి వ్యాపారంగా ప్రైవేటు విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నారు.‌ అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనేక నూతన బ్రాంచ్‌లు నగరం నడిబొడ్డున చిన్న చిన్న ఇరుకు గదుల్లో నెలకొల్పుతున్నారు ప్రవేటు యాజమాన్యాలు. ప్రస్తుతం ఆట స్థలాలు లేని ప్రైవేటు విద్యాసంస్థలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఇటువంటి ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడం లేదు. అదే సమయంలో విద్యార్థులని హాస్టల్లో చేర్పించడం వలన విద్యార్థి తన ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించకుండా, విశ్రాంతి లేకుండా రోజంతా నిర్భధించి చదివించడంతో విద్యార్థి పరిస్థితి అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతుంది.‌ విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసం లేకపోవటం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. పోటీలు, ర్యాంకులు సాధన మధ్యే కొన్ని బాల్య జీవితాలు దుర్భరం అవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువులు, కేవలం డబ్బు సంపాదించడం కోసమే అన్న ధోరణి నుంచి బయటపడి. ర్యాంకులు, గ్రేడులే ప్రతిభకు కొలమానం నుంచి బయటకు రావాలి. అప్పుడు మాత్రమే చదువు ఆహ్లాదకరంగా ఉంటుంది. నిండు నూరేళ్ళు హాయిగా జీవిస్తారు.

విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గాలంటే..

ప్రైవేటు విద్యాసంస్థలు, హాస్టల్ నిర్వహణపై ప్రభుత్వం తరచూ తనిఖీ చేయాలి. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిపై దృష్టి సారించాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని సరి చూడాలి. పాఠశాలలు, కళాశాలలు పని గంటలు, పని దినాలుపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులు కూడా నూతన ప్రైవేటు విద్యాసంస్థలు మంజూరు చే‌సే సమయంలో తూ.చా తప్పకుండా నిబంధనలు పాటిస్తూ, అనుమతులు మంజూరు చేయాలి. విద్యా, వైద్య అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి. దేశ భవిష్యత్తుకు యువతే ఆధారం. అటువంటి యువత విద్యా సంస్థల నుంచే ఉద్భవిస్తారు. కాబట్టి విద్యాలయాలు వికాసం కోసం పాటుపడేవిగా ఉండాలి గానీ, విద్యార్థులకు నిర్బంధ నిలయాలుగా, జైళ్లుగా ఉండరాదు. ఆత్మహత్యలకు నిలయాలుగా ప్రైవేటు విద్యాసంస్థలు మారడం బాధాకరమైన విషయం. ఇదే సమయంలో ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తనిఖీలు నిర్వహించాలి. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు వీటిల్లో ఏర్పడకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువులు, భవిష్యత్తుపై అత్యాశకు పోకుండా, వారి సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తు తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలి. అప్పుడే ఈ ఆత్మహత్యలు ఆగుతాయని గ్రహించాలి. విద్యార్థుల్లో కూడా ర్యాగింగ్ వంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలి. ప్రస్తుతం రాజకీయ నాయకులు ఆధ్వర్యంలోనే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఉండుట వలన, సరైన అజమాయిషీ చేయడానికి వీలు లేని పరిస్థితులు ఉండుట గమనార్హం. ఏది ఏమైనా ప్రభుత్వాలు, అధికారుల విద్యార్థులు భవిష్యత్తు కోసం అన్ని రకాల విద్యా సంస్థలను తరచూ తనిఖీలు నిర్వహించాలి. లోటు పాట్లు సరిచేయాలి. భవిష్యత్తులో భారత్ పట్టుకొమ్మలు మన విద్యార్థులే అని గ్రహించాలి.

ఐ.ప్రసాదరావు

6305682733

Advertisement

Next Story

Most Viewed