సార్వత్రిక ఎన్నికలు.. ఎవరి ప్రభావం ఎంతెంత?

by srinivas |   ( Updated:2024-04-05 00:16:04.0  )
సార్వత్రిక ఎన్నికలు.. ఎవరి ప్రభావం ఎంతెంత?
X

భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. మాజీ ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌ చెప్పినట్లుగా దశ మహాపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. 2024 ఎన్నికలకు దళిత బహుజనులు లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. ఐదేళ్లపాటు మన జీవిత నిర్మాణానికి అది ఒక ఆయుధం. ఓటు విలువ అత్యున్నతమైనది. అమూల్యమైనది. అది మానవ విలువలతో సమానమైనది. అందుకే అంబేద్కర్‌ రాజ్యాధికారమే ప్రధానమైన కీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎంతో చూద్దాం.

వృత్తికారులే కాక శ్రామికశక్తులు కూడా అయిన బీసీలకు రాజ్యాధికారంలో సమభాగం ఇవ్వటంలో అన్ని పార్టీలు వెనుకబడి వున్నాయి. చాలామంది బీసీలు తమ విముక్తిదాత అయిన ఫూలే గురించి ఈనాటికీ తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మాఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక రాజకీయ చైతన్యం వస్తుంది. శూద్ర అతిశూద్రులకు విద్యను నిరాకరించిన అంశాల మీద జ్యోతిరావుఫూలే పోరాడి వీరిలో విద్యా చైతన్యాన్ని కల్పించాడు. ఫూలే ఉద్యమం లేకుంటే నేటికీ కొందరి చేతుల్లోనే విద్యా సంస్కృతి, చరిత్ర, ప్రబోధం, మిగిలిపోయి వుండేది. కాని విద్యను అందరికీ సార్వత్రికం చేయటానికి ఆయన చేసిన పోరాటాన్ని మనం అవగాహన చేసుకోగలిగితేనే, ఏ ఆధిపత్య వర్గాలు కొన్నివేల సంవత్సరాలు విద్యను స్వాయత్తం చేసుకొని ఈనాటి నిరక్ష్యరాస్యతకు, పేదరికానికి కారణమవుతున్నాయో తెలుసుకోగలుగుతాం.

ముస్లింలపై తీవ్ర వివక్ష

భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్‌లోను, అసెంబ్లీలోను ప్రాతినిద్యం ఇస్తూ వస్తున్నారు. ఒకసారి మనం ఆ గణాంకాలను చూసి ముస్లింలను బీజేపీ ఎంత నిర్లక్ష్యం చేసిందో ఒకసారి చూద్దాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. దామాషా పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నిక కాగా. ఆనాడు ముస్లింల జనాభా 6% కంటే తక్కువగా వున్నారు. మొదటి రాజ్యసభలో 10.5% కంటే కొద్దిగా ఎక్కువ ముస్లిం సభ్యులున్నారు. ముస్లింలే ఎక్కువగా వున్న ప్రాంతాల్లో సైతం దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిగినపుడు 49 మంది ముస్లింలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎపుడూ ముస్లింల బలానికి తగినంత మంది పార్లమెంట్‌కు ఎన్నిక కాలేదు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో పార్లమెంట్‌ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కనీసం ఒక ముస్లిం మంత్రి కూడా ఎన్నిక కాలేదు.

ముస్లింలు ఏకమైతే...

హిందూత్వ బిజెపి మెజారిటీ జనాభాతో ప్రాతిపదికగా అధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో 2024లో జరగనున్న 18వ లోక్‌సభ ఎన్నికల్లో హిందూత్వ మెజారిటీ జనాభా దన్నుతో బీజేపీ చెలరేగిపోతున్నందున ముస్లింలంతా ఏకం కావచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిందూ జాతీయవాద ప్రభుత్వం ముస్లింలను అణిచివేస్తున్నందున ముస్లింలు ఏకమై సెక్యులర్‌ పార్టీలకు ఓట్లు వేస్తారని ఫిబ్రవరిలో ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేస్తున్న బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది.

క్రైస్తవులు, బౌద్ధుల ప్రభావం

క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైన వారు క్రైస్తవ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. క్రైస్తవమతం అపుడు మతంగా కాకుండా ఉద్యమంగా వచ్చింది. అందుకే దళితులు ఎక్కువమంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం, జనరల్‌ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల, లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని, తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వల్లింప చేసింది. మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌ బౌద్ధాన్ని పునరుద్ధరింప చేసారు. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ఈనాడు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజకీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది.

ప్రతిపక్షాలు ప్రభావం చూపుతాయా?

కమ్యూనిస్ట్‌లు, అంబేడ్కర్‌వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. ఇకపోతే ఇండియా కూటమి శివాజీపార్క్‌లో జరిపిన ర్యాలీ కూడా ఎంతో ప్రాధాన్యం వుంది. ఈ ర్యాలీకి ‘‘ఇండియా’’ కూటమికి ఐక్య సంఘటనలోని ప్రధానమైన నాయకులందరూ హాజరయ్యారు. ఇకపోతే 2014లో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం చుక్కల నంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం. అమలు కాని ఎన్నికల హామీలు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశంగా ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేయాలి.

ఓబీసీలకు సీట్లు పెంచకపోతే...

ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. స్త్రీలకు కూడా మునుపటికంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. విద్యాధికులు, రిటైర్డ్‌ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రముఖులు, రిటైర్డ్‌ జడ్జిలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. ఐదేళ్ల మన జీవిత నిర్మాణానికి అది ఒక ఆయుధం. ఓటును మనం దుర్వినియోగం చేసుకున్నాక మన హక్కులన్నీ కాల రాయబడతాయి. ఓటు విలువ అత్యున్నతమైనది. అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. అందుకే అంబేద్కర్‌ రాజ్యాధికారమే ప్రధానమైన కీ అన్నాడు. ఆ దిశగా నడుద్దాం. రాజ్యాధికారాన్ని సాధిద్దాం.

డాక్టర్‌ కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story

Most Viewed