సామాజిక న్యాయమే ఎజెండాగా

by Ravi |   ( Updated:2023-12-17 00:31:15.0  )
సామాజిక న్యాయమే ఎజెండాగా
X

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఓట్లు రాబట్టుకుని అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి హామిని ఇచ్చింది. అయితే వచ్చిన ఫలితాలు బీజేపీ అంచనాలు తప్పాయని నిరూపిస్తున్నాయి. ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా ఉన్న ముఖ్య నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లు ఎమ్మెల్యే రేసులోనే ఓడిపోయారు.

గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా బీసీ ప్రజలు బీసీ జనగణన డిమాండు చుట్టూ సమీకృతమవుతున్నారు. తమ జనాభా లెక్కలు తేలితేనే.. తమ వర్గానికి న్యాయమైన దక్కుతుందని బీసీ వర్గాలు గుర్తించాయి. అయితే లెక్కలు సేకరిస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ హామీనిచ్చింది నెరవేర్చలేదు, 2018లోనూ కేంద్రమంత్రి 2021లో జరగనున్న జనాభా లెక్కలలో బీసీ జనగణన సైతం చేపడతామని తెలిపారు. అయితే.. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొగ్గి బీజేపీ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు సేకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ సుప్రీంకోర్టుకు తెలియచెప్పింది. పైగా కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తే దేశం కుల ప్రతిపాదికన విడిపోతుందంటూ వ్యాఖ్యానించాడు. కులవ్యవస్థను ఆసరా చేసుకున్న అగ్రవర్ణాలు ఉన్నత స్థానాలకు ఎగబాకుతుంటే.. బాధితులమైన తామే కుల విభజనలకు కారకులన్నట్టుగా దేశ ప్రధాని నిందించడాన్ని బీసీ వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కానీ బీహార్ ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు రిజర్వేషన్లను జనాభాకి అనుగుణంగా పెంపుదల చేశారు. బీహార్ చేపట్టిన ఈ కులగణనను బీసీలు మెచ్చుకుంటుంటే, ప్రధాని వ్యాఖ్యలను వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో కోళ్లకి మేకలకి సైతం లెక్కలు ఉంటాయని, కానీ మెజారిటీ వర్గమైన బీసీల కోసం ఈ కులగణన చేయరా? అంటూ బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!

అప్పుడే అభ్యున్నతి సాధ్యం!

బీసీ ప్రజల అభీష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ కులగణనకు మద్దతుగా తన వాణిని బలంగా వినిపించింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో బీసీలు తక్కువ సంఖ్యలో ఉండడాన్ని పార్లమెంటు వేదికగా ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. జనాభాకి అనుగుణంగా ఉద్యోగావకాశాల పంపిణీ జరగాలంటూ వాదించాడు. అధికారంలోకొస్తే తెలంగాణలో బీసీ జనగణన చేపడతామంటూ, బీసీ రిజర్వేషన్ల పెంపుకు కూడా చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ బీసీ జనగణన చేయమంటూ సుప్రీంకోర్టుకే మోడీ ప్రభుత్వం తేల్చిచెప్పిన కారణంగా వారు బీసీ వర్గాల అంశాన్ని ప్రస్తావించలేరు.

కుల నాయకులు.. వారి పదవుల చుట్టూ తిరిగే రాజకీయాలు నేడు అంతటా కనపడుతున్నాయి. నా ఒక్కడికి పదవి ఇయ్యండి చాలు.. మా వర్గపు ప్రజల ఏ కోర్కెలు తీర్చకున్నా పర్వాలేదు.. అంటూ గులాంగిరి చేసే నాయకులను రాజకీయ పార్టీలు చేరదీస్తున్నాయి. ఇదంతా చూసి సోయికొచ్చిన బీసీ వర్గపు ప్రజలు.. తమ వర్గంలోని కొందరు నాయకులకు పదవులు కాదు, సమాన అవకాశాలకు దూరమైన తమ వర్గపు సామాన్య ప్రజల విశాల ప్రయోజనాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. కుల నాయకులు, కుల రాజకీయాలూ కాదు.. సామాజిక న్యాయ సిద్ధాంతానికి కట్టుబడిన ఎజెండాతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యం!

-యం. బీరప్ప

బీసీ ఐక్యవేదిక, తెలంగాణ.

[email protected]

Advertisement

Next Story