- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో... ఎవరి వ్యూహమేంటి?
గౌరవం.. ఆత్మ గౌరవం, కుటుంబ పాలన, అవినీతి పాలన, గడీల పాలన, దొరల పాలన... అంటూ.. ఇటీవల కాలంలో ఎక్కువగా అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్‌పై విమర్శించడానికి ఉపయోగిస్తున్న పదాలు.. ఆధిపత్యాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు, నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొస్తున్న నినాదాలివి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో అందరికంటే ఒక అడుగు ముందుకేసి ఉంటారు.
2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ స్థాపించి, 13 ఏండ్లు పోరాడటంతో కేంద్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచింది. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తెలంగాణ ఆత్మను తట్టి లేపారు. అప్పటికే అధికార మత్తులో ఉన్న కాంగ్రెస్ నేతలు మళ్లీ అధికారం తమకే వస్తుందన్న భ్రమలో ఊగిసలాడుతుంటే వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడంలో కేసీఆర్ విజయవంతం అయ్యారు. ఆనాడు సాధారణ మెజారిటీతో టీఆర్ఎస్ అధికారం సొంతం చేసుకున్నది. ఆ తర్వాత అభివృద్ధి పేరిట తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ‘సొంతం రాష్ట్రం- సొంత పార్టీ’ నినాదంతో టీఆర్ఎస్‌లోకి గుంజుకున్నారు.. ఇక రెండోసారి 2018 నవంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్‌కి.. అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గుర్రుగా ఉన్న ఆంధ్ర సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినను...ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న కేసీఆర్. ‘శనేశ్వరమా’, ‘కాళేశ్వరమా’ అని కాలికి బలపం కట్టుకుని తెలంగాణ అంతటా, తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, మళ్ళీ ఆంధ్రోళ్ల పాలన అవసరమా? అంటూ సెంటిమెంట్ రగిల్చి ప్రచారం చేశారు. ఈ మాటలు తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి టీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు.
ఇక ముచ్చటగా తెలంగాణ వచ్చాక మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో కొనసాగడం మూలాన సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. నీళ్లూ.. నిధులు .. నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద రాష్ట్రమంతటా సాగునీటి వసతులు మెరుగయ్యాయనీ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. తొమ్మిదేండ్ల తర్వాత కూడా మళ్లీ ఆత్మగౌరవ సెంటిమెంట్ రగిల్చేందుకు ‘తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల’ పేరిట 21 రోజులు ఆత్మగౌరవం వ్యూహంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ దినోత్సవాలను జరిపారు. దీనికి తోడు గతేడాది టీఆర్ఎస్ పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలిగిపోయినను.. తెలంగాణ అస్తిత్వమే తమకు ముఖ్యమని ప్రజలకి విడమరచి చెపుతున్నారు, ఒక వైపు బీజేపీ పార్టీలో నాయకుల ఎడతెగని లుకలుకలు, మరోవైపు కర్ణాటకలో గెలిచిన జోష్‌తో కాంగ్రెస్ పార్టీ, ఈ నేపథ్యంలో స్థానిక నాయకత్వం, ఆత్మ గౌరవ నినాదం. ఉచిత పథకాలు, ప్రతిపక్షాల్లో కోవర్టుల సమస్యలు తమకు అనుకూలంగా ఓట్ల పంట పండిస్తుందని బీఆర్ఎస్ నమ్ముతోంది.
కాషాయ జెండా సాధ్యమా..?
తెలంగాణలో అధికారంలోకి రావడం, కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ అంటున్నారు. ఆకాంక్ష ఉండగానే సరిపోదు, ఆ దిశగా తగిన నిర్మాణం, వ్యూహం బీజేపీకి ఉండి తీరాలి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు గెలవాలి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాలకు పోటీ చేసి ఒక సీటు మాత్రమే గెలిచింది. అప్పుడు సాధించిన ఓట్ల శాతం కేవలం 6.98 మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అప్పుడు 20 శాతం ఓట్లు సాధించింది. నాటి ఎన్నికలలో 21 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ ఓట్లు సాధించగా, మరో 22 స్థానాల్లో ఓట్ల పరంగా రెండో స్థానంలో నిలిచింది. కనుకనే తెలంగాణలో బీజేపీ బలం పుంజుకునే అవకాశం వుందని ఆ పార్టీ అగ్ర నాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్నట్టు కనిపించింది. కానీ పునాది స్థాయిలో బీజేపీ నిర్మాణం బలపడలేదన్నది వాస్తవం. నల్లగొండ, ఖమ్మం, జిల్లాల్లో పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువే మహబూబ్‌నగర్‌లో పేరున్న నాయకులున్నారే తప్ప పార్టీ నిర్మాణం అనుకున్నంతగా లేదంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ కొంత నిర్మాణం కలిగి వున్నా, గ్రామీణ ఓటర్లను గంపగుత్తగా ఆకట్టుకునే స్థితిలో లేదు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి గణాంకాల ప్రకారం చూసుకున్నా.. ఆనాడు మెజారిటీ సాధించిన 21 స్థానాలను కచ్చితంగా దక్కించుకోవాలి. అలాగే రెండో స్థానంలో నిలిచిన 22 స్థానాల్లో ఎంత వరకు పోటీ చేసి గెలుస్తుందో చూడాలి.
లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి గురించి మాట్లాడుతున్నారే తప్ప కేసీఆర్ చెపుతున్న అభివృద్ది పరంగా, సంక్షేమపాలన దిశగా తాము ఏం చేశామో. ప్రతి పథకంలో కేంద్ర వాట, సాయం గూర్చి ప్రజలకి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు, అధికారంలోకి వస్తే ఏం చేయగలమో ఇప్పటివరకు చెప్పలేకపోతోంది! బీజేపీ - బీఆర్‌ఎస్ ఒకటే అని రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న దూకుడు ప్రచారాన్ని అధిగమించి ప్రజల విశ్వాసాన్ని అందుకోగలదా..? కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌ల రొటీన్ మాటలు కాకుండా, వాళ్ళ పనితనం, పోరాట పటిమ. పార్టీ నాయకుల ఐక్యత. అవినీతి నేతలపై చర్యలు మాత్రమే బీజేపీ భవిష్యత్‌ను నిర్ణయించగలవని ప్రజలతో పాటు బీజేపీ నేతలు కార్యకర్తలు, రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు..
జోరుమీదున్న కాంగ్రెస్.!
తెలంగాణ వ్యతిరేకిగా, ఆంధ్రా పార్టీగా ముద్రపడ్డ టీడీపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టడం వల్లనే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అందరి అభిప్రాయం. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు మినహా ఎక్కడా కాంగ్రెస్ చెప్పుకోదగ్గ సీట్లు సాధించలేక పోయింది. పైగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని మహామహులు మట్టికరిచారు. మళ్ళీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందడం మినహా ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలలో కూడా విజయం సాధించలేకపోయింది..కర్ణాటక విజయంతో తెలంగాణలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. చాలామంది నేతలు ఎన్నికల పోరాటం ముంగిట్లో ఐక్యతారాగం ఆలాపిస్తున్నప్పటికీ, ఆధిపత్యం.. అధికారం వచ్చేసరికి అంతా పోటీలోకి వస్తారన్నది జగమెరిగిన సత్యం.. రేవంత్ రెడ్డి పైన పార్టీ కార్యకర్తలకు అపారమైన నమ్మకం ఉన్నప్పటికీ. కోవర్టులు, అవకాశవాదులు చివరికి గెలిచాక కూడా అదే పార్టీలో ఉంటారనే నమ్మకం ప్రజలలో ఏ కోశానా లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ సీట్లు రాలేకపోతే, వలసలను చివరికి దేవుడు కూడా అపలేడని సాక్షాత్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కాదనలేని సత్యం.
డా. బి. కేశవులు నేత. ఎండి.
ఛైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.