షాపింగ్ మాల్స్‌లో...మహిళా కార్మికుల దీనస్థితి

by Ravi |   ( Updated:2023-10-26 03:15:33.0  )
షాపింగ్ మాల్స్‌లో...మహిళా కార్మికుల దీనస్థితి
X

రాష్ట్రంలో పండుగ సీజన్ మొదలైంది. అక్టోబర్ నెలలో దసరాతో మొదలయి నవంబర్‌లో దీపావళి, డిసెంబర్‌లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతితో ముగుస్తుంది. ఈ నాలుగు నెలలు ఆఫర్లతో, డిస్కౌంట్లతో యజమానులు మోత మోగించేస్తున్నారు. విద్యుల్లతలతో, రంగురంగుల కాంతులీనుతూ, పెద్ద పెద్ద భవంతులు వెలిగిపోతూ షాపింగ్ మాల్స్‌లో వ్యాపారాలు జోరుగా సాగిపోతున్న కాలమిది. ధమాకా ఆఫర్లతో, కస్టమర్లకు వంగి, వంగి నమస్కారాలు చేస్తూ, నవ్వుతూ ఆహ్వానాలు పలికే ఆ చల్లటి ప్రదేశాలలో ఆహ్లాదంగా షాపింగ్ చేసుకుని దర్జాగా కొనుగోలుదారులు వస్తుంటారు. ఆ రంగు, రంగుల దీపకాంతుల వెనుక, ఆ నవ్వుల వెనుక ఎంతటి విషాదం ఉందో తెలిస్తే మనసున్న మనుషుల హృదయాలు బరువెక్కక మానవు.

ఊరంతా పండుగే, దేశమంతా పండుగల సంబరాలే... కానీ ఆ మాల్స్‌లో పనిచేసే సగటు మహిళలు పండుగ రోజుల్లో కుటుంబంతో కలిసి భోంచేసి ఏళ్లయిందని చెమర్చిన కళ్లతో వివరిస్తారు. ఊరంతా పండుగే... వీరు మాత్రం ఏ పండుగలకూ నోచుకోరు. తమ జీవనయానంలో పండుగలన్నవి మరచిపోయామని వారు వివరిస్తారు. ఎవరు వీరు? వీరికున్న కష్టమేమిటి!? ఈ చమర్చిన కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయి? తమ కష్టాన్ని తమకున్న ఇబ్బందులను చెప్పుకోవాలని ప్రయత్నించే ఈ మనుషులకు తోడేళ్లలాగా తనిఖీ చేసే సూపర్వైజర్లు, యాజమాన్యపు సిబ్బంది నిఘా మధ్య కుక్కిన పేనుల్లా పనులు చేసుకుపోయే శ్రామిక మహిళల్ని షాపింగ్ మాల్స్, బట్టలషాపులు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో చూస్తుంటాము.

కూర్చునే హక్కు కూడా లేదా?

మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ మహిళలు ఎప్పుడు మనం షాపింగ్‌కు వెళ్లినా నిలబడుకునే కనిపిస్తారు. పక్కన కనీసం కూర్చోవడానికి స్టూలుకానీ, కుర్చీ కానీ కనపడదు. ఇవేవీ మనకు పట్టదు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వచ్చింది మొదలు రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగేంత వరకు సుమారు 12 గంటల పాటు కంటిన్యూగా నిలబడే ఉండాల్సిన ఉద్యోగం వారిది. ఇప్పటికైనా అర్థం అయిందా? వారి కష్టం ఏమిటో? మహిళలు షాపింగ్ మాల్స్‌లో కూర్చునే హక్కును దేశంలో మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ తరువాత తమిళనాడు ప్రభుత్వం కూర్చునే హక్కును కల్పిస్తూ చట్టం చేసింది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది హక్కుగా, చట్టంగా లేకపోవడం విచారకరం. తక్షణం ఈ సమస్యపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మారుతున్న జీవన సరళి, నూతన ఆర్థిక విధానాల ప్రభావం, ప్రజల్లో పెరుగుతున్న వినియోగదారీతత్వం కారణంగా పెద్ద నగరాలకు పరిమితమైన షాపింగ్ మాల్స్ చిన్న పట్టణాలకు సైతం వ్యాపిస్తున్నాయి. ఈ రంగంలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చి ఈ పనులలో అత్యధికులు చేరుతున్నారు.

ఏ మాల్ చరిత్ర చూసినా...

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో డజన్లకొద్దీ సంఖ్యలో షాపింగ్ మాల్స్ తో పాటు పలు జ్యూవెలరీ షాపులున్నాయి. వందల సంఖ్యలో మాల్స్, పెద్ద సంఖ్యలో ఇతర సంస్థలు పోటీలు పడి ముందుకు వస్తున్నాయి. వేల నుంచి లక్షల సంఖ్యలో శ్రామికులు వీటిలో ఉపాధికై పని చేస్తున్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు ఇవ్వటం లేదు. గంటలకొద్దీ నిలబడటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అత్యధిక చోట్ల మహిళలకు కూర్చునే సౌకర్యం లేదు. కస్టమర్లు లేనప్పుడు కూడా కూర్చునేందుకు కనీసం స్టూళ్లు కూడా లేవు.

బాత్‌రూమ్‌కి వెళితే బయోమెట్రిక్

తిరుపతి నగరంలో సీఐటీయూ కార్యకర్తల పరిశీలనలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ మహిళలకు నిలబడి ఉండటం కారణంగా మూత్రాశయ వ్యాధులు, కాళ్లపై వెరికోస్ వెయిన్స్ (నరాలు ఉబ్బటం) వ్యాధి, వెన్నుపూస, నడుమునొప్పి వంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. శుభమస్తు షాపింగ్ మాల్స్‌లో 10 నిమిషాలు మాత్రమే వాష్ రూంకూ వెళ్లాలనే నిబంధన ఉంది. బాత్ రూమ్‌కు వెళ్లిన ప్రతిసారి బయోమెట్రిక్లో నమోదు చేయాలి. చందనలో కస్టమర్లు లిఫ్ట్‌లో వస్తారు. కార్మికులు లిఫ్ట్ ఎక్కడానికి వీలు లేదు. ఎన్ని సార్లయినా, ఎన్ని అంతస్తులైనా మెట్లపై నడవాల్సిందే. పీరియడ్స్ సమయంలో మహిళల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

కార్మికులకు భోజనాలు చేయడానికి సౌకర్యాలు లేవు. టాప్ ఫ్లోర్‌లో వాష్ రూముల దగ్గర భోజనాలు చేస్తుంటారు. ఒంటరి మహిళలు, పెళ్లికానివారు, ఇంటిని పట్టించుకోని భర్తలున్న మహిళలు అనివార్యమై కుటుంబ భారాన్ని మోస్తున్నట్టుగా ఈ సర్వేలో వెల్లడైంది.పిల్లల రక్షణ, వారి భవిష్యత్తుపై వీరికి తీవ్ర ఆందోళన ఉంది. కుటుంబానికి సమయం ఇవ్వలేక పోతున్నామన్న బాధ వీరిలో కనిపిస్తుంది. ఇక ఒంటరి మహిళల బాధ వర్ణనాతీతం. పిల్లలు ఎలా పెరుగుతున్నారో పరిశీలన చేసే అవకాశం కూడా తమకు లేదని వాపోతున్నారు.

మహిళలు, పురుషులకు వేతన వ్యత్యాసం ఉంది. ఎన్ని ఏళ్లయినా ఒకే రకమైన పనులు చేయాలి. దీంతో మనుషులు యాంత్రికంగా తయారవుతున్నారు. ప్రమోషన్లు లేవు. వర్కర్లతోపాటు ఈ రంగంలో హెల్పర్లు కూడా పని చేస్తున్నారు. వీరికున్న సమస్యలు వర్కర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పని ఎక్కువ, వేతనం తక్కువ. కొనుగోలుదార్లు చూసిన బట్టలు, వస్తువులను సర్ధటమే వీరి ప్రధాన పని. వేతనాలు రూ.6 వేల నుంచి 14 వేల వరకు చెల్లిస్తున్నారు. పెద్ద మాల్స్‌లో కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్‌లు అమలు చేస్తున్నా పని గంటలు చట్ట ప్రకారం అమలు కావడం లేదు. కార్మికులకు ప్రోత్సహకాలు, బోనస్ పేరుతో పోటీ పెంచుతున్నారు. ఒక్కో అంతస్తులో ప్రతిరోజూ 'మంచి ఉద్యోగి' పేరిట ఎంపిక చేస్తారు. దీనికోసం అమ్మకాలు పెంచమని విపరీతమైన టార్చర్ ఉంటుంది.

కూర్చోవటం... ఓ హక్కుగా ఉండాలి

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా 8 గంటల పని విధానం అమలు కావటం లేదు. 10 నుంచి 12 గంటలపాటు కనీసంగా వీరు పని చేయాల్సి వస్తున్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రోజులో రాకపోకలు కలుపుకుంటే 14 నుంచి 16 గంటలు ఈ పనిలో ఉండాల్సి వస్తున్నది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవులు అమలు కావటం లేదు. ఒక్కరోజు సెలవు తీసుకుంటే రెండు రోజుల వేతనాన్ని కత్తిరిస్తున్నారు. 2018వ సంవత్సరంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం షాపింగ్ మాల్స్ లో పని చేసే మహిళలకు 'కూర్చోవటాన్ని' ఓ హక్కుగా గుర్తిస్తూ కేరళ షాప్స్ & కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం - 2018ని కేరళ అసెంబ్లీ ఆమోదించింది. తరువాతి కాలంలో తమిళనాడు రాష్ట్రం మహిళలకు కూర్చోవటాన్ని ఓ హక్కుగా గుర్తిస్తూ చట్టం చేసింది.

తెలుగు సీఎంలకు పట్టదా?

కేరళ చట్టంలో ప్రతి కార్మికునికి వారానికి ఒకరోజు సెలవుదినంగా ఇవ్వాలని, మహిళా కార్మికులను రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేయించరాదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఐదుగురు కార్మికులు ఓ గ్రూపుగా ఉండాలి. అందులో ఇద్దరు మహిళలు ఉండాలి. వారికి తగిన రక్షణ కల్పించాలి. ఇంటి వరకూ రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. షాపుల్లో నిలబడి పని చేసేవారికి వారి పని ప్రదేశాలలో కూర్చోవటానికి సౌకర్యం కల్పించాలని స్పష్టంగా చట్టంలో వివరించారు. కేరళ, తమిళనాడు తరువాత దేశంలో ఎక్కడా ఇది చట్టంగా రూపుదాల్చలేదు. మహిళోద్దారకులుగా తమను తాము కీర్తించుకునే జగన్, కేసిఆర్‌లకు ఈ సమస్య పట్టడంలేదు.

ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ లాంటి నగరాలలో వీరి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఒక్కో ప్రాంగణంలో వేయి నుంచి రెండు వేల మంది పని చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో శ్రామిక మహిళలు పని చేస్తున్నా ఇంత పెద్ద వ్యవస్థలో చట్టాలు అమలవుతున్నాయా? లేదా? అన్న ప్రాథమిక పరిశీలన కూడా ప్రభుత్వాలు చేయకపోవటాన్ని ఓ నేరంగా భావించాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో పని చేస్తున్న మహిళల కనీస హక్కులు హరించబడుతున్నాయి. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల సమస్య కూడా తీవ్రమైన అంశంగా ఉంది. 2013 లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనుసరించి మాల్స్‌లలో ఎక్కడా అంతర్గత కమిటీలు లేవన్న వాస్తవం ఈ పరిశీలనలో వెల్లడయింది. తక్షణం ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల తరుణంలోనైనా వీరి సమస్యలకు పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత ఉంది.

- కందారపు మురళి

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్

94900 98840

Advertisement

Next Story