నిజ జీవితానికి దూరంగా...

by Ravi |   ( Updated:2024-03-07 00:31:08.0  )
నిజ జీవితానికి దూరంగా...
X

ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపద వస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తులు ఆర్థిక సంబంధాల కొరకు మాత్రమే మానవ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరితో మనం కలిసి ఉంటే మనకు వారు ఏ విధంగా ఉపయోగపడతారనే ఆలోచన సమాజంలో పెరిగిపోయింది. చివరికి కుటుంబ సభ్యుల అనుబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం చాలా దురదృష్టం. ఈ పరిణామం మానవ సంబంధాలపై చాలా ప్రభావం చూపుతుంది.

బంధువుల్లో ఒకరు చనిపోతే వారి చుట్టాలు సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటించడం, అన్నదమ్ముల్లో ఒకరి పుట్టినరోజుకి ఇంకొకరు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం, పెండ్లి కార్డు వాట్సప్ గ్రూప్‌లో పెట్టడం, ఒకే కాలనీలో ఉండే వారిలో ఒకరికి అపద వస్తే సోషల్ మీడియాలో పెట్టారే కానీ సహాయం చేయలేదు కారణం.. సోషల్ మీడియాలో పెడితే ఎవరో ఒకరు సహాయం చేస్తారు అంటా! ఇంతలా మానవ సంబంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఎందుకు మారాయి? ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పలకరింతలు మాని వాట్సప్ సందేశాలు పంపుకోడం దేనికి సంకేతం. మానవ సంబంధాలకి వారు ఇస్తున్న విలువేంటి?

విలువైన కాలం మొత్తాన్ని...

గతంలో ఉమ్మడి కుటుంబాలలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేవారు. ఆ కుటుంబంలో ఉండే పెద్దవారు కుటుంబ సభ్యులకు వారికి తెలియకుండానే వ్యక్తిత్వ వికాస బోధన చేసేవారు. వారి ప్రవర్తన చూసి పిల్లలు నేర్చుకునే వారు. కానీ నేటి ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి.

ఈ కేంద్రక కుటుంబాలలో వ్యక్తిగత స్వార్థాలు పెరిగాయి. సమాజంలోని మిగతా కుటుంబాలతో సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోయాయి. గతంలో కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు కలిసినప్పుడు మనస్ఫూర్తిగా వారి అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్‌కి బాటలు వేసుకుంటూ ఆనందంగా, సంతోషంగా గడిపేవారు. నేడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అందరూ కలిసినప్పుడు భౌతికంగా మాట్లాడుకోకుండా స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తూ విలువైన కాలాన్ని సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తూ అనుబంధాలకు, ఆప్యాయతలకు దూరమవుతున్నారు.

సోషల్ మీడియా ప్రభావానికి లోనై ప్రజలు భౌతికంగా సంభాషించడం మానేసి చాలా రోజులైంది. వారి హావభావాలకు వేదికగా సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. వారి సంతోషం, బాధలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భౌతికంగా వ్యక్తుల మధ్య ఉండే సంభాషణలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలకు అనుబంధాలకి దూరమవుతూ..సామాజిక మాధ్యమాలలో ఉండే స్నేహితులే వారికి నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ వాటిలో వచ్చే లైకులు, కామెంట్లను చూసి సంబరపడిపోతున్నారు. అవి రాకపోతే బాధపడుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ప్రత్యక్ష అనుభూతులకు దూరమవుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లో నిజాలు గోరంతయితే దాన్ని కొండంతగా చూపించే పద్ధతికి అలవాటు పడి ఊహాలోకంలో విహరిస్తున్నారు. ఇది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి, వికాసానికి గొడ్డలి పెట్టులాంటిది.

సోషల్ మీడియాకు అంకితం చేసేలా...

స్టేట్ ఆఫ్ మొబైల్-2023 ప్రకారం, భారతీయులు ప్రతిరోజూ సగటున ఐదు గంటల పాటు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ ఆన్లైన్లో గడుపుతున్నారు. అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో భారతీయులు ఉన్నారు. విలువైన కాలాన్ని సోషల్ మీడియాలో వృధా చేస్తూ గడిపేస్తున్నారు. భారతీయ జనాభాలో యాక్టివ్ సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ప్రజలు 33.4%. వీరు దాదాపుగా 2.6 గంటలు ప్రతీ రోజు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్రజల అవసరాలను గమనించిన సోషల్ మీడియా కంపెనీల యజమానులు వారి కాసుల పంట పండించుకుంటున్నారు. కోట్లకు పడగెత్తుతున్నారు. ప్రజలు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడానికి ప్రత్యేకంగా యాప్‌లు రూపొందిస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. దీనికి సైకాలజిస్ట్‌ల, మార్కెటింగ్ మేనేజర్ల సలహా సూచనలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు సోషల్ మీడియా యజమానులు వారి ఎజెండాలను ప్రజలపై తెలియకుండానే రుద్దుతున్నారు.

వ్యక్తులు పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలవారుగా రూపొందించడంతో తల్లిదండ్రులు, సమాజం, నేర్చుకునే విద్య, చదివే పుస్తకాలు, చేసే వృత్తి, పాటించే నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. బాల్యంలోనే విద్యార్థులకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన, వీటిని విద్యా విధానంలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. చిన్నతనం నుంచి విద్యార్థులు సామాజిక స్పృహను ఎదుటి వారికి సహాయపడే గుణాన్ని అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక సమాజ సేవకులుగా కూడా మారి ప్రయోజకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మానవ సంబంధాలు ఆర్థిక అవసర సంబంధాలుగా కాక ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలుగా మారే అవకాశం ఉంటుంది.

పాకాల శంకర్ గౌడ్

సామాజిక విశ్లేషకులు

98483 77734

Advertisement

Next Story