కోయల మౌఖిక సాహిత్య మణిహారం

by Ravi |   ( Updated:2024-06-25 00:45:16.0  )
కోయల మౌఖిక సాహిత్య మణిహారం
X

కోయ గిరిజనుల చరిత్రకారుడు సకిన రామచంద్రయ్య జూన్ 23న కాలగమనం చెందడం ఆదివాసీ జానపద కళలకు తీరని లోటు. ఒక్కసారిగా కథల డోలి చప్పుడు మూగబోయింది. ఆయన మరణంతో కేవలం మౌఖిక సాహిత్యానికి పరిమితమైన ఆదివాసీ చరిత్ర ఆనవాళ్లు మరుగున పడతాయేమోనన్న దిగ్భ్రాంతి కలుగుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన ' మేడారం సమ్మక్క సారక్కల' కథలు చెప్పి జాతరను కీర్తికెక్కించిన ఘనత రామచంద్రయ్యదే! ఈ జానపద మౌఖిక సాహిత్యానికి గాను 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

కోయల చరిత్రను పాట రూపంలో..

రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆయనది కోయ గిరిజన తెగ. కోయ జాతి సంప్రదాయ వేడుకలకు జరిపించడంలో డోలి కళాకారులది ప్రధాన భూమిక. కోయలకు వీరు ఆర్తి బిడ్డలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వీరిని డోలికోయలు లేదా పట్టేడోల్లు అని పిలుస్తారు. ఈ కళాకారులు కోయ తెగ వారైనప్పటికీ డోలీలుగా ప్రస్తావించడం పరిపాటి. వీరి సంప్రదాయ కళను పరిశీలిస్తే... కోయల గీతాలు రేల పాటలు, వాటికి సంగీత సాధనాలు డోలీలు. డోలి అంటే రెండు అడుగుల వెడల్పు, మరికొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ఇలవేల్పుల పూజలలో వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకు కర్మకాండలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. ఇది వారికి అధికారిక కోయవాద్యం. కోయ సంస్కృతికి మూలాధారం కూడా. వీరు కోయ తెగ వీరులు, వివిధ గోత్రాలకు చెందిన పెద్దల కథలు చెబుతారు. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రను, గోత్రాలు పూర్వాపరాలను ఉయ్యాల పాటల రూపంలో పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు లేకపోతేనేం.. ఆదివాసీల మూలాలు, సంప్రదాయాలని, వనదేవతల కథల్ని ఇలవేల్పుల పండుగలలో అక్షరం పొల్లు పోకుండా చెబుతారు.

ఈ కళ మలితరంగా మారకూడదని..

అతని పాట డోలి చప్పుడు వింటే... శివసత్తులు పూనకాలతో ఊగిపోతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని వనదేవతల జాతరల్లో గత 50 ఏండ్లుగా ఆదివాసీ చరిత్రని, మౌఖికంగా వినిపించాడు. తన పన్నెండేళ్ళ వయసు నుంచే కంచుతాళం, మేళం చేతపట్టి కాళ్లకు గజ్జెలతో మేడారం జాతరకు వన్నె తెస్తున్నాడు. నాలుగు తరాలుగా ఆదివాసీ సంప్రదాయాల్ని గానం చేస్తున్నది వీళ్ల కుటుంబమే. డోలి వాయిస్తూ వాద్యకథకులు 'పూర్బం' చెబుతారు. అంటే గోత్రాల పూర్వ చరిత్ర జ్ఞాపకం చేసుకోవడం. డోలీలే కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. ఈ డోలు శబ్దంలో తరతరాల గిరిజన చరిత్ర దాగి వుందంటే ఆశ్చర్యమే! ఈ వాయిద్య కళ మలితరంగా మారకూడదని తనయుడు బాబురావుకు, మరో 15 మందికి నేర్పించే ప్రయత్నం చేశాడు. రామచంద్రయ్య 'పద్మశ్రీ' తో సంప్రదాయ డోలి కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. తరతరాల కోయల సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుతున్న రామచంద్రయ్య వారసత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు భౌతికంగా లేకపోయినా వీరి తెలంగాణ జానపద సాహిత్యం సజీవంగా ఉంటుంది.

-గుమ్మడి లక్ష్మీనారాయణ

ఆదివాసీ రచయితల వేదిక

9491318409

Advertisement

Next Story

Most Viewed