మన బతుకమ్మ.. మన సంస్కృతి

by Jakkula Mamatha |
మన బతుకమ్మ.. మన సంస్కృతి
X

తెలంగాణ సంస్కృతిలో భాగమే ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే అక్కాచెల్లెళ్లకు ఆనందమే ఆనందం. ఎందుకు అనుకుంటున్నారా, నాన్న కొత్త బట్టలు కొంటాడు. ఈ పండుగ సమయంలో ఏది అడిగితే అది అద్దనడు. పిల్లలకు, పెద్దలకు సంతోషం. భారతదేశంలో రకరకాల తీరొక్క పండుగలున్నా తెలంగాణ ప్రత్యేకత వేరు. బతుకమ్మ కడుపులో నింపే రకరకాల ఆకులు, తొడిమలు వాడనీకుండా బతుకమ్మ బలానికి సత్తువనిస్తాయి. తెలంగాణలో ప్రజల మేలిమి సంబంధం, విడదీయరాని బంధం ఈ పండగ.

పసిడి తంగేడు పూలతో తల్లి బతుకమ్మ గుమ్మడి పూల గౌరీ మన బతుకమ్మ, అన్ని రకాల పూల సమ్మిళిత సమూహమే ఈ బతుకమ్మ పేర్చడం. శిబ్బిలో గత కాలంలో శ్రేష్టమని పేర్చేవారు. మారుతున్న కాలాన్ని బట్టి స్టీలు, ఇత్తడి వెండి తాంబూలాల్లో అందంగా ఇప్పుడు పేర్చుతున్నారు. తెలంగాణ తల్లి చేల చలువతో గునుగు, గుమ్మడి, బంతి, సీత జడల పూలతో ఈనాటి యువతరం పిల్లలు కూడా ఉత్సాహంగా పేర్చి పెత్రమాస మొదలు సద్దుల బతుకమ్మ వరకు చక్కగా తొమ్మిది రోజుల పండుగ జరుపుకుంటున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో తెలంగాణకైతే ఉయ్యాలో ముద్దు బిడ్డ నువ్వు ఉయ్యాలో అంటూ అలవోకగా పాడుకుంటూ వలయాకారంగా తిరుగుతూ ఇంకా రాజుల కథలు, ఊరి కథలు పాటల్లో చెప్పుకుంటూ అందులోని నీతిని గ్రహిస్తూ ఆనందంగా గడుపుతారు.

ఆత్మీయంగా పూల స్వాగతం

ఈ ఆశ్వయుజ మాసంలో పూచే పూల అందమే వేరు. ఎన్నో రకాల పూలు మంచు బిందువులు కప్పుకుని మనకోసం ఆత్మీయంగా ఎదురుచూస్తాయి. చిన్న పెద్దలంతా పూల కొరకు తిరిగి తిరిగి పూలన్నీ తెంపి తెచ్చి కొన్ని విధమైన పూలను(గునుగు) సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మకు దాచుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు పసుపు గౌరమ్మ పెట్టుకుంటామని, తలారా స్నానం చేసి కొత్త బట్టలు కట్టి, రకరకాల సత్తుపొడులు చేసి తల్లికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆరగిస్తారు. ఒక్కో విధమైన పువ్వు ఒక్కో వాసన కలిగి మనల్ని ఎన్నో రోగాల నుండి కాపాడుతున్న వైద్యుడిలా ఆకులు, పువ్వులు నుండి వచ్చే వాసన పీల్చుతుంటే అర్థమవుతుంది. మన పూర్వీకులు ఏది చేసినా శాస్త్ర పరమైన మంచి జరిగే సంప్రదాయాలను మనకు అందించారు.

ప్రజల మేలిమి సంబంధం

బతుకమ్మ కడుపులో నింపే రకరకాల ఆకులు, తొడిమలు వాడనికుండా బతుకమ్మ బలానికి సత్తువనిస్తాయి. తెలంగాణలో ప్రజల మేలిమి సంబంధం, విడదీయరాని బంధం ఈ పండగ. ప్రకృతి ప్రసాదించిన అనేక పుష్పాలు సప్తవర్ణాలు విరజిమ్ముతుండగా పేర్చి బతుకమ్మను పూజించుట ప్రకృతి మాతను ఆరాధించడమే. అన్ని పూలు బతుకమ్మ సొంతమే. పూజకు పనికొచ్చేవి, పనికిరానివి అనే తేడాయే లేదు. బతుకమ్మ నీ ఆట, భాగ్యమే మా ఇంట అనుకుని ఆడపడుచులు, దసరాకు ఉండే సరదాయే వేరని పురుషులు అత్యంత ఉత్సాహంగా ఉంటారు.

స్త్రీల మనోభావాల ప్రతిబింబం

బతుకమ్మ ముఖ్యంగా స్త్రీల మనోభావాలకు అద్దం పట్టే పండుగ. ఎంతో శ్రద్ధ, ఓర్పుతో ఇంట్లో తన తాహతుకు తగిన విధంగా ఉన్న వాటితో బతుకమ్మ సుందరంగా అలంకరిస్తే ఇరుగు పొరుగు వారు మీ బతుకమ్మ బాగుందని అభినందిస్తే, మెచ్చుకుంటే అదో విధమైన మానసికోల్లాసం కలుగుతుంది. కొత్త కోడళ్ళు, అత్తవారింటి నుండి పుట్టింటికి చేరి అక్కడి ముచ్చట్లని మూటగట్టి తెచ్చినట్లు ఒక్కొక్కటి విప్పుతూ చెప్పుతు పోతుంటే యవ్వనంలో ఉన్నవారి ముచ్చట్లు, నవ్వులు అందాల మొగ్గలై విరుచుకుంటాయి. సాంప్రదాయం మరువకుండ తెలంగాణ స్త్రీలు, వృద్ధులైనా సరే ఎంతో శ్రద్ధగా ఈ బతుకమ్మ వేడుక తప్పనిసరిగా జరుపుకుంటారు. బతుకమ్మ వాయనం అత్తగారి ఇంటి నుండి కొత్త కోడళ్ళకు వస్తుంది. కాగితపు బతుకమ్మ, ఉన్నవారైతే వెండి బతుకమ్మ దానితోపాటు, సద్దుల వాయనం పంపుతారు. ఇది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఈ సమయంలో నవదుర్గలు కొలువయ్యే కనుల పండగ. కలిగిన వారి కైనా, నిరుపేదలకైన బతుకమ్మ పూలలో మార్పేమి ఉండదు. తేడాలేరుగని పండుగ ఈ తెలంగాణ పండుగ. సాంప్రదాయపు చక్కనైన సహజమైన పండుగ. అడవికి వెళ్లి పూలు తెచ్చి అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటారు. ఆడవాళ్లంతా ఈ తొమ్మిది పది రోజులు ఒకరికొకరు పూల, గురించి నగల గురించి, కొత్త బట్టల గురించి ముచ్చటించుకుంటూ అలంకరణకు అత్యంత ప్రాధాన్యమిస్తారు.

వారసత్వంగా పూల బతుకమ్మ

బతుకమ్మ పండుగ రానున్న తరాలు మరవకుండా జరుపుకునే విధంగా ఈ తరం వారు వారి పిల్లలను భాగస్వాములుగా బతుకమ్మ పేర్చి ఆడటం, పాటలు పాడడం నేర్చుకునేలా తీర్చిదిద్దాలి. ఇదొక విడి కుటుంబాల యుగం, ఐనా బతుకమ్మ పండుగ ఎంత గొప్పదంటే కల్మషం అంటని పల్లెల హృదయాలను, ఊరి సొగసులను ఆస్వాదించేందుకు నగరాల నుండి పట్టణాల నుండి అందరూ తరలి వస్తారు. చక్కనైన ఈ పూల బతుకమ్మను తొమ్మిది రోజులు అందరూ కలసి మెలసి ఆడి పాడి ఆనందంగా గడుపుతారు. ఆఖరి రోజున పోయిరా బతుకమ్మ పోయిరా అంటూనే తిరిగి ఆహ్వానం పలికి, వుసికెల పుట్టిన గౌరమ్మ వుసికెల పెరిగిన గౌరమ్మ అని పాడి ఆ పసుపు గౌరమ్మను అందరూ ముత్తైదువలు పంచుకుని ఒకరికొకరు పెట్టుకొని, సౌభాగ్యం చల్లగా చూడమని బతుకమ్మ తల్లికి మొక్కి వీడ్కోలు పలుకుతారు. బతుకమ్మ బతుకు పండగ, మన అందరి హృదయాలు నిండుగా. ఆడుదాం బతుకమ్మ ఆట, పాడుదాం బతుకమ్మ పాట.

((ఉయ్యాల పాట

స్త్రీల కొలిచే తల్లి ఉయ్యాలో

పూల పాలవెల్లి ఉయ్యాలో

హరివిల్లుల రంగుల ఉయ్యాలో

నవరాత్రుల సందళ్లు ఉయ్యాలో

బతుకు బండి ప్రయాణంలో ఉయ్యాలో

సంబరాల పెద్ద పండుగ ఉయ్యాలో

ఈ సద్దుల బతుకమ్మ ఉయ్యాలో

పట్టు చీరలు కట్టి, పడుచులాడంగా ఉయ్యాలో

పరికిణీలు కట్టి, పిల్లల కోలాటం ఉయ్యాలో

కొత్త గాజుల గలగలలు ఉయ్యాలో

తల్లి గోదావరి అలలు ఉయ్యాలో

స్వాగతించి, సాగనంపే ఉయ్యాలో

తల్లి బతుకమ్మ నిన్ను ఉయ్యాలో

తిరిగిరా బతుకమ్మ, తీరొక్క పూలతో ఉయ్యాలో!))




- బొమ్మిదేని రాజేశ్వరి,

పెద్దపల్లి - 90527 44215

Next Story

Most Viewed