వందరూపాలలో.. తెలుగు వాడి గుండెల్లో!

by Ravi |   ( Updated:2023-08-29 00:15:28.0  )
వందరూపాలలో.. తెలుగు వాడి గుండెల్లో!
X

నిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు, తరతరాలకి తరగని వెలుగౌతారు, ఇలవేలుపులౌతారన్న అక్షరాలకు నిలువెత్తు సాక్ష్యం నందమూరి తారక రామారావు. ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. తెలుగువారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ, వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ‘అన్న’ ఎన్టీఆర్.

వెనకడగు వేయకుండా..

సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి.. తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత. శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటి నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి’ అంటూ 1982 మార్చి 29న ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి ఢిల్లీ కోటలే కదిలించారు. పార్టీ పెట్టగానే రాజ్యసభ సీటు ఇస్తామని రాయబారాలు మొదలెట్టినా ‘లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరు’ అనే వివేకానందుడి మాటల్ని ఒంటపట్టించుకున్న ఎన్టీఆర్ వెనకడుగు వేయకుండా ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు ‘రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్’ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు.

ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరాజిల్లింది. ఆయన ప్రతి మాట ఓ తూటాగా, ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ, పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా పూజలందుకున్న నటుడు.. రాజకీయ నేతగానూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా..

రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్నోసార్లు తన సేవా నిరతిని చాటుకున్నారు. రాయలసీమ కరువు నుంచి ప్రజలకు కాపాడేందుకు సహచర నటులతో కలిసి జోలి పట్టుకుని తిరిగారు. అలాగే దివిసీమ ఉప్పెన సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు స్వయంగా నడుంబిగించారు. చైనా యుద్ధ సమయంలో కూడా విరాళాలు సేకరించి ఆర్మీకి బాసటగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారు. అయితే ఎన్టీఆర్ విషయంలో తెలుగుజాతి ఆకాంక్ష ఒకటి మిగిలిపోయింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తెలుగు ప్రజలు ఎంత డిమాండ్‌ చేసినా ఫలితం శూన్యం. ఢిల్లీ పెద్దల సంకుచిత స్వభావం, ప్రాంతీయ తారతమ్యాలు, ఇలా అనేక అంశాలు ప్రభావం చూపాయి. చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో సైతం ఈ విషయంపై ఎప్పుడు దృష్టి సారించలేదు. కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్ళినా ఫలితం లేదు. కానీ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ నాణాన్ని ముద్రించింది. భారతరత్నకి అన్ని విధాలా అర్హుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు వంద రుపాయల ప్రత్యేక నాణాన్ని విడుదల చేయటం కేవలం కంటి తుడుపు చర్య.

సమిష్టి పోరాటలేమి, అలసత్వం, వెరసి ఆ మహనీయునికి భారతరత్న దక్కకుండా చేశాయి. తెలుగు హృదయాలను కట్టిపడేసిన యుగపురుషుడి స్మరణలో ప్రతిక్షణం తెలుగు నేల పులకరిస్తుంది. తరగని చరిత్రకు.. చెరగని చరితకు ఆయన నిలువెత్తు రూపం. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఓ శకం. 300 పైగా చిత్రాల్లో నటించి సాంఘిక, పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించిన ఎన్టీఆర్‌.. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా.. వెండితెర ఇలవేల్పుగా కీర్తి గడించారు. ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన మకుటం లేని మహారాజే. మన తెలుగు జాతికి వెలుగు రత్నమే. వందరూపాయల నాణెం మీద కాదు వివిధ రూపాల్లో తెలుగోడి గుండెల్లో కొలువైన వెండితెరవేల్పు తెలుగు జాతి ఆత్మగౌరవానికి మీ స్పూర్తే మేలుకొలుపు.

(దివంగత సీఎం ఎన్టీఆర్ స్మారకంగా కేంద్రం రూ. 100 రూపాయల నాణెం విడుదల చేసిన సందర్భంగా)

-వి.సుధాకర్

99898 55445

Advertisement

Next Story