- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నూతన పాలనకు నవ్య సూచనలు
మహారాజ రాజశ్రీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ
ఏ విత్తనంలో ఏ వృక్షం దాగి ఉందో, అది పెరుగుతున్న తీరులో తెలుస్తుంది. అలాగే అది ఇచ్చే పూలు, పండ్లు, నీడను బట్టి దాని ప్రయోజకత్వాన్ని అంచనా కట్టవచ్చు. తెలంగాణ ద్వితీయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డికి అక్షరాల కాకుండా కొంచెం అటూ ఇటూ ఇది వర్తిస్తుంది. అంటే ఎవరికి ఎటువంటి సందేహం ఉండకపోవచ్చు అనుకుంటాను. ఎక్కడో పాలమూరు జిల్లా కొండారెడ్డి పల్లెలో పుట్టి రాజకీయంగా అననుకూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని ఎదిగిన రేవంత్ రెడ్డి తనదైన తీరును తన విలక్షణ గొంతుతో వినిపించిన రేవంత్ రెడ్డి 2006లో జెడ్పీటీసీ గా ఎన్నికై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఎత్తుపల్లాలను అధ్యయనం చేస్తే కొండొకచో ఆశ్చర్యం కలిగించక మానదు.
వాక్చాతుర్యంతో, అచంచల విశ్వాసంతో, తనదైన ఎత్తుగడలతో, రాజకీయ చాణక్యంతో తన ప్రత్యర్థులతోనూ బేష్ అనిపించుకునే నేత ఈనాటి ముఖ్యమంత్రి! తెలంగాణ ద్వితీయ... కాదు కాదు, తృతీయ ముఖ్యమంత్రి ఎనుముల, ఆ మాటకు వస్తే మాడపాటి హనుమంతరావు అనంతరం కేసీఆర్ తర్వాత హనుమంతుడిలా ఎదిగిన వాడు మాడపాటి జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి కావడం విశేషం.
ఈ సందర్భంగా రేవంత్ ముందు కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు తెలంగాణ ప్రజల తరపున బాధ్యతాయుతమైన కవిగా రచయితగా ఉంచవలసి వస్తోంది. ఎందుకంటే 60 ఏళ్ల ఆధిపత్య ప్రాంతాల ఏలుబడి ఒక ఎత్తు అయితే 9 ఏళ్ల స్వపరిపాలన యావత్తు కేసీఆర్ కుటుంబ సొత్తుగా పాలనలో, రాష్ట్రాన్ని ఆర్థికంగా కరిమింగిన వెలగపండును చేయడం మరొక ఎత్తు. 60 ఏళ్ళు లోయ అయితే 9 ఏళ్ల అనంతరం ఏలికల ముందు ఎత్తయిన మేరు పర్వతమై తెలంగాణ నిలబడింది. వాటి లోతు పాతుల్లోకి మంచి చెడ్డల్లోకి వెళ్లడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు కానీ, బాధ్యతాయుతమైన పౌరునిగా డజన్ ప్రతిపాదనలను, సూచనలను మీ ముందు వినమ్రంగా ఉంచుతున్నాను.
ప్రతిపాదనలు..
1.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైల్‌పై మొదటి సంతకం చేయడం.
2. తెలంగాణ ప్రజలు వేనోళ్ళ పాడుకునే "జయ జయహే తెలంగాణ" రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం.
3. తెలంగాణ లోని ఆయా రంగాలలో విషయ నిపుణులతో కూడిన ఒక సలహా కమిటీని ప్రభుత్వం నియమించుకొని, వారి సూచనల వెలుగులో ఆచరణాత్మకంగా పథకాలను అమలు జరపాలి.
4. తెలంగాణ అమర వీర కుటుంబాలకు, ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్న మేధావులకు తగిన గుర్తింపు ఇవ్వాలి.
5. ప్రకృతి సహజ వనరులను రక్షించి భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని సురక్షితంగా పదిలపరచాలి.
6. ఆధిపత్యాలకు అన్ని రకాల అణచివేతలకు దూరంగా సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దాలి.
7. గత ప్రభుత్వం పథకాల పేరున ముఖ్యంగా కాకతీయ, భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కాల పరిమితితో కూడిన విచారణ జరిపించి, ప్రజా సంపదకు ఒక భరోసా ఏర్పచవలసింది.
8. దఫ్తర్ ఖానా(సచివాలయం)ను సమూలంగా ప్రక్షాళన చేసి నిజమైన సుపరిపాలన ప్రజల ఎరుకలోకి తీసుకురావాలి.
9. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి.
10. ముఖ్యంగా నాటి నుంచి నేటి వరకు తెలంగాణ నేల నెత్తుటితో తడిసిపోయింది. రాజ్యాంగ పరిధిలో పౌరుల ప్రాథమిక హక్కులను నిజాయితీగా నిక్కచ్చిగా కాపాడాలి.
11. గత తొమ్మిదేళ్లలో వివిధ ముఖ్యమైన పద్ధుల ద్వారా వచ్చిన ఆదాయం అలాగే వివిధ పథకాల ద్వారా కార్య నిర్వహణ ఉద్యోగుల వ్యయాలను సంవత్సరాల వారిగా పొందుపరిచిన శ్వేత పత్రాన్ని పబ్లిక్ డొమైన్లో విడుదల చేయాలి. తద్వారా గత ప్రభుత్వ పాలనలోని భండారాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి.
12. గత పాలకుల పాలన పట్ల వ్యతిరేకతతో అసంతృప్తితో మిమ్మల్ని ఎన్నుకున్నారనే విషయాన్ని మరిచిపోవద్దు. అదే సమయంలో మంచి విషయాన్ని తమ ఖాతాలో వేసుకొని దుష్ఫలితాలకు గత ప్రభుత్వమే కారణమని రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాలు పదేపదే అదేపనిగా చెప్పుకునే ఆనవాయితీకి శుభం పలకాలి. పాలకులు అలసత్వం వీడటమే కాదు.. సమర్థ పాలనకు ఏమాత్రం వెన్ను చూపకూడదు.
రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో ప్రజావేదికల్లో పదేపదే నుడివిన విషయం "నిన్నటి వరకు ఒక లెక్క ఇక నేటి నుంచి మరో లెక్క". ఈ విషయాన్ని పక్కాగా ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం ఆచరణాత్మకంగా నిరూపించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ముందు ఈ 12 ప్రతిపాదనలను నాలుగు కోట్ల ప్రజల తరఫున ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వం ముందు ఉంచడమైనది.
జాగ్రత్తలు
అ) రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఇతర రాజకీయ పార్టీల నాయకుల పట్ల ఆచితూచి వ్యవహరించండి. ఆ) మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ప్రభుత్వంలో పాలకుల భజన మండలిగా మారి పదవులు అనుభవించిన మేతావులు ఇప్పటికే మీకు డిప్పర్ కొడుతున్న వారి పట్ల జాగరూకులై ఉండండి.
- జూకంటి జగన్నాథం,
తెలంగాణ రచయితల వేదిక పూర్వ అధ్యక్షుడు,
94410 78095