- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్త కులగణన చేయాల్సిందే!
భారత దేశంలో కులం పుట్టుక ప్రపంచ మేధావులు సైతం విప్పలేని చిక్కుముడిగా రూపొందింది. కులం భారత సామాజ ప్రత్యేక లక్షణం, ప్రత్యక్ష వాస్తవం కూడా. దైవ సిద్ధాంతాలు దైవ నిర్ణయమని, వృత్తి సిద్ధాంతాలు.. వృత్తి విభజన, శ్రమ విభజన అని అంబేద్కర్ లాంటి వారు శ్రామికుల విభజన, అంతర్వివాహాలు అని సిద్ధాంతీకరించినప్పటికి కులం చుట్టూ ప్రశ్నలు ఇంకా పట్టువదలడం లేదు. ప్రపంచ దేశాలలో రాజకీయ, ఆర్థిక అంతస్థులే సామాజిక అంతస్తును, జీవన విధానాన్ని నిర్ణయిస్తే.. దీనికి భిన్నంగా మనదేశంలో ఒక్క కుల సమూహం సామాజిక అంతస్తుతో పాటు రాజకీయ, ఆర్థిక పరిస్థితులను నిర్ణయిస్తుంది. ఇంతటి నిర్ణయాత్మక పాత్ర కలిగిన కులాల గణన శాస్త్రీయంగా గణించడం అవసరం!
భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వం 1872వ సంవ త్సరం నుండి ప్రతి దశాబ్దానికి ఒకసారి జన గణన చేపట్టింది. జన గణనతో పాటుగా 1931వ సంవత్సరం వరకు కుల గణన సైతం చేపట్టింది. స్వతంత్రం తరువాత 1951వ సంవత్సరం మొదటిసారిగా జన గణనలో భాగంగా కులగణన చెప ట్టాల్సి ఉండగా ప్రభుత్వాలు విస్మరించాయి. ఈ క్రమంలో 2021లో జనగణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఇప్పటికీ చేపట్టనేలేదు.
అన్ని రంగాలలో దయనీయ పరిస్థితులు..
దేశానికి స్వతంత్రం వచ్చిన మూడు దశాబ్దాల తరు వాత మండల్ కమీషన్ నివేదిక వెనుకబడిన తరగతుల వారి దయనీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టబయలు చేసింది. ఆ కమిషన్ నివేదిక ఇచ్చి కూడా నాలుగు దశాబ్దాలు అయింది. అప్పటి కంటే ఇప్పటి పరిస్థితి ఇంకా దారుణమయింది. అందుకే ఇప్పటికిప్పుడు కులగణన జరిపితే విస్తుపోయే వాస్తవాలు బయటపడే అవకాశం ఉన్నది. 2018 సంవత్సరంలో వరల్డ్ ఇనిక్వాలిటీ డెటాబేస్ విడుదల చేసిన ‘వెల్త్ ఇనిక్వాలిటి క్లాస్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా 1961-2012 ప్రకారం, దేశ కుటుంబ సగటు ఆదాయం కంటే 48% అధికంగా బ్రాహ్మ ణుల ఆదాయం ఉంది. సగటు కంటే 34% తక్కు వగా ఎస్టీలది, 21% తక్కువగా ఎస్సీలది, 8% తక్కువగా బీసీలది ఉన్నది. అలాగే బ్రాహ్మణులలో 50%, బనియాలలో 44%, కాయస్థలలో 57% అత్యంత ధనికులుగా ఉంటే, ఎస్టీలలో 5%, ఎస్సీలలో 10%, ఓబీసీలలో 16% మాత్రమే ధనికుల జాబితాలో ఉన్నారు. తాజాగా వెలువడిన వరల్డ్ ఇనీక్వాలిటి ల్యాబ్ నివేదిక ప్రకారం, 40శాతానికి పైగా దేశ సంపద కేవలం 1% జనాభా దగ్గరే కేంద్రీ కృతమై ఉన్నదని తెలిపింది. భారత బిలీనియర్లలో 88% వరకు అగ్రకులాల వారే ఉన్నారు. దీని ప్రకారం భారతదేశంలో ఆర్థిక అసమానతలు బ్రిటీష్ పాలన కాలం కంటే అధ్వాన్నంగా ఉన్నాయని తెలుస్తున్నది. ఇక విద్యా, ఉద్యోగాలలో ఇటీవల AIOBCSA వారు సమాచార హక్కు చట్టం ద్వారా ఐఐటీ, ఐఐఎంలలో సిబ్బంది వివరాలు సేకరించగా, ఐఐఎం ఇండోర్‌లో 97% జనరల్ కోటా వారు ఉండగా, ఎస్టీ, ఎస్టీల ప్రాతినిధ్యం సున్నాకు పరిమితమైంది. ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్ పూర్‌లలోను 90% నికి పైగా జనరల్ కోటా వారే. ఇలా అన్ని రంగాలలో వెనుకబడిన కులాల వారివి ఇవే దయనీయ పరిస్థితులు..
కుల గణన చేపట్టకపోవడానికి కారణం..
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండే జరగబోయే జన గణనలో కచ్చితంగా కుల గణన చేపట్టాల్సిందే అనే నినాదాలు విస్తృతంగా వినిపించాయి. బహిరంగంగా అన్ని పార్టీ లు తాము కుల గణనకు వ్యతిరేకం కాదని ప్రకటిస్తున్నా, అంతరంగంగ మాత్రం వారి అగ్రవర్ణ ఆధిపత్యం కుల గణనపై దుష్ప్రచారం చేస్తుంది. ప్రధానంగా కాంగ్రె సు పార్టీ కుల గణన ద్వారానే సామాజిక న్యాయం చేకురుతుందని, అన్ని కులాలకు రాజ్యాంగ ఫలాలు దక్కుతాయని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రతిపక్ష ధర్మాన్ని సజావుగా నిర్వహిస్తుంది. అయితే, గతంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమాజిక న్యాయం గురించి ఎన్నడూ మాట్లడకపోగా, మండల్ కమీషన్ సిఫార్సుల అమలుపై ప్రదర్శించిన అగ్రవర్ణ ఆధిపత్య తీరును సమీక్షించుకోవాలి. ఆ పార్టీ అధికారంలోకి వస్తే జరిగిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకుంటారో, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో స్పష్టంగా, పార్టీ విధానంగా రాహుల్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక బీసీని ప్రధానమంత్రి చేసాం అని చెప్తున్న బీజేపీ పార్టీ, కులగణన చేయడానికి జంకడానికి కారణం కుల గణన జరిగితే మరో మండల్ లాంటి సామాజిక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని. మండల్ ఉద్యమం నుండే రాష్ట్రాలలో శూద్రుల ఆధ్వర్యంలో అనేక ప్రాంతియ పార్టీలు పుట్టుకొచ్చి, బలపడి వివిధ రాష్ట్రాలలో అధికారాన్ని చేపట్టాయని అగ్రవర్ణాలు గుర్తించాయి. అందుకే బీజేపీ కొత్తగా జరపబోతున్న జమిలి ఎన్నికల ద్వారా పూర్తిగా శూద్రుల రాజకీయ పార్టీలను బలహీన పరిచి.. దేశం మొత్తంగా హస్తిన అగ్రవర్ణ ఆధిపత్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా తన వ్యూహాలను రచిస్తున్నది.
కేంద్రం పట్టించుకోకపోవడంతో..
దేశంలో కుల గణన జరిగితే బీజేపీ తీసుకొచ్చిన ఈడ్ల్యూఎస్ రిజర్వేషన్లకు, 50% ఓబీసీ రిజర్వేషన్ల సీలింగ్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. శతాబ్దాలుగా కులం మరుగున జరిగిన అనేక సామాజిక, ఆర్థిక అంతరాలు బయటపడుతాయి. అయితే, కుల గణన చేయడం వలన దేశంలో కుల వైషమ్యాలు పెరిగి దేశ సమగ్రత, సమైక్యత దెబ్బతింటుందని అగ్రవర్ణాలు వాపోతున్నాయి. వేల సంవత్సరాలుగా ఈ సమాజాన్ని కులాలుగా విభజించి విద్యకు, ఉద్యోగాలకు ,విలువలకు, ఊరికి దూరంగ నెట్టివేసి దోపిడీ చేసిన అగ్రవర్ణాలు నేడు కులాన్ని గుర్తించొద్దు అనడం హస్యాస్పదం. కేంద్రం దీనిని చేపట్టకపోవడంతో కర్ణాటక, బిహర్, తెలం గాణ రాష్ట్రాలు కుల గణనకు పూనుకున్నాయి, అయినప్పటికీ జన గణన కేంద్ర జాబితాలో ఉన్నందున్న న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కేంద్రం కుల గణన చేపట్టి అన్ని రంగాలలో వెనకబడిన కులాలకు జరుగుతున్న అన్యాయాలకు చెక్ పెట్టకుంటే 2047 వరకు కావాలనుకుంటున్న ‘వికసిత్ భారత్’ అసమానతలతో ‘విలపించే భారత్’ కానుంది. మెజారిటీల పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ పరిస్థితులకు అనుగుణంగా విధానపరమైన చర్యలు తీసుకోవాలి.. లేదంటే అగ్రవర్ణాల పార్టీగా బీజేపీ మెజారిటీ హిందూ ఉనికిని కోల్పోనుంది.
-మధు యాదవ్ నూకల
ఉస్మానియా యూనివర్సిటీ
63033 43359