- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జ్ఞానజ్యోతులను విరజిమ్మే కాంతి గురువు
ప్రపంచమంతా అక్టోబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది. కానీ ఒక భారతదేశం మాత్రమే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది. ఈరోజు దేశమంతా ఉపాధ్యాయుల గొప్పతనం గురించి, గురుశిష్యుల అవినాభావ సంబంధం గురించి గుర్తు చేసుకుంటారు. ఏ స్థాయిలో ఉన్న వారైనా వారి చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు గురించి, తాము గొప్ప స్థాయిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయులను తప్పకుండా గుర్తు చేసుకుంటారు. గురువులను పూజిస్తారు. ఉపాధ్యాయులకు దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గౌరవ సత్కారాలు పురస్కారాలు అందజేస్తారు.
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర..అంటే గురువు స్థానం త్రిమూర్తులతో సమానం. ఏ రంగంలో రాణించిన వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్న వారే. గురువు అందించిన విజ్ఞానంతో, ప్రోత్సాహంతో, స్ఫూర్తితో, ఉన్నత స్థానాలకు అధిరోహించినవారే. అలాగే విద్యార్థులను గొప్పగా, సంస్కారవంతులుగా, జ్ఞానులుగా, బాధ్యతగల భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువే. ఒక గొప్ప తరం తయారు కావాలంటే అది కేవలం గొప్ప గురువుల వల్లే సాధ్యం.
పరమ పవిత్ర వృత్తి!
సెప్టెంబర్ 5నే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం, మన భారతదేశానికి తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన గొప్ప మానవతావాది, తత్వవేత్త మాత్రమే కాదు గొప్ప పండితులు కూడా, రాజకీయ రంగంలోకి ప్రవేశించక మునుపు ఎన్నో యూనివర్సిటీలలో తత్వశాస్త్ర పాఠాలు బోధించేవారు. ఆయన బోధించే పాఠాలకు విద్యార్థులు మంత్రముగ్ధులయ్యేవారు. తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికై 1962 మే 13న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన శిష్యులందరూ ఆ ఏడాది ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5ను ఎంతో గొప్పగా జరపాలని నిర్ణయించుకుని రాధాకృష్ణను అనుమతి కోరారు. అందుకు సమాధానంగా తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణం అని ఆయన తెలిపారు. ఆరోజు నుంచి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5ని భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. రాధాకృష్ణన్ ఎన్నో విజయాలు పొందినప్పటికీ జీవితాంతం ఉపాధ్యాయుడిగానే ఉండిపోయారు.
అన్ని వృత్తుల్లో కెల్లా పరమ పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. గొప్ప దానం విద్యా దానం. దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉంది. ఉపాధ్యాయులు అంటే తరాల తయారీదారులు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. తనకంటే ఎదిగిన వారిని చూస్తే అసూయ కలగడం మానవ నైజం కానీ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం తన శిష్యులు ఎంత ఎదిగితే ఆ ఉపాధ్యాయుడు అంత సంతోషపడతాడు. సమాజంలో గొప్ప పేరు కీర్తి ప్రతిష్టలు తన శిష్యులు పొందితే గురువుకు అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అప్పుడు ఉపాధ్యాయుని జీవితం సార్థకమైనట్లే. ఒకప్పుడు ఉపాధ్యాయ కేంద్రకంగా ఉన్నటువంటి విద్య నేడు విద్యార్థి కేంద్రకంగా మారిపోయింది. విద్య అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. నేటి అవసరాలను బట్టి విద్య అందించబడుతోంది. విద్య అంటే కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాదు, నైతిక విలువలు, మానవత్వం , జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు తరగతి గదిలో బోధిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఒక గురువు స్థానాన్ని మాత్రం ఏదీ ఆక్రమించలేదు. సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి యువత అభిలాషతో అడుగుపెట్టి ఆలోచనలకు పదును పెడుతూ దేశ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-స్వప్న కొండ , ప్రిన్సిపల్
మహాత్మ జ్యోతిబాఫూలే బాలుర పాఠశాల
రాజపేట (ఆలేరు)