24 ఫ్రేమ్స్.. యాదోంకీ బారాత్..

by Vinod kumar |   ( Updated:2023-06-10 00:00:33.0  )
24 ఫ్రేమ్స్.. యాదోంకీ బారాత్..
X

''సినిమా అనేది అత్యంత ప్రజాస్వామ్య కళ. ఇది ప్రేక్షకులకు అత్యంత అనుకూలమైన భాషను ఉపయోగిస్తుంది. ప్రజాస్వామ్యం, శాంతి, స్వేచ్ఛను ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏకీకృతం చేయగలవు, నిర్వహించగలవు. కొత్త సంస్కృతులను అన్వేషించడానికి, సృజనాత్మకతను జరుపుకోవడానికి కలిసి రావడం ఎల్లప్పుడూ ముఖ్యమైనది సినిమా దానికి సరైన మాధ్యమం.''

సినిమాను ఒక కళ, అన్ని కళల సమ్మిశ్రితం అన్న భావనతో మంచి సినిమాను, కళాత్మక సినిమాను సాధారణ ప్రజానీకానికి దగ్గరగా తీసుకు రావాలనే లక్ష్యంతో మొదలయిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో కఫిసో (కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ) తన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే ఫిల్మ్ భవన్ నిర్మాణం. ఆ భవనాన్ని సంపూర్ణంగా లక్ష్య సాధన కోసం వినియోగించాలనే అభిలాషతో ఫిల్మ్ స్క్రీనింగ్స్ మాత్రమే కాకుండా ఫిల్మ్ఫ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ సెమినార్స్, వర్క్ షాప్స్ లాంటివి నిర్వహించాలనుకున్నాం. ఆ దిశలోనే మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని నేను ప్రతిపాదించాను. కఫిసో కార్యవర్గం ఒకే అంది. ఎట్లా చేస్తారో మీ ఇష్టం అన్నారు.

కరీంనగర్‌లో జాతీయ ఫిల్మ్ పెస్టివల్..

ప్రేక్షకులు ఏదో ఒక మంచి సినిమాను చూసి వెళ్లిపోవడం కాకుండా ఎంపిక చేసిన కొన్ని ఉత్తమ సినిమాల్ని ఏకబిగిన కొన్ని రోజులపాటు చూడడంతో పాటు ఆయా సినిమాల దర్శకులు ఇతర బాధ్యులతో కలవడం వారితో ఇంటరాక్షన్‌లతో ఎన్నో అంశాలు చర్చల్లోకి వస్తాయి. దాని వల్ల సినిమా, దాని సబ్జెక్ట్ విషయాలతో పాటు ఆసక్తి వున్నంతమేర టెక్నికల్ అంశాలు కూడా ఫెస్టివల్స్‌లో చర్చకు వస్తాయి. నేను వ్యక్తిగతంగా 1986 హైదరాబాద్ ఫిల్మోత్సవ్ నుంచి హైదరాబాద్, కలకత్తా, ముంబై, డిల్లీ లాంటి చోట్ల జరిగిన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న అనుభవంతో పాటు ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. సమావేశాల్లో చర్చల్లో భాగం పంచుకున్న అనుభవం కూడా కరీంనగర్‌లో జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనే ఆలోచనకు మూల కారణమయింది.

ఫిలింభవన్ లో ఆధునిక ప్రొజెక్షన్ వసతులు కల్పించుకున్నాం. కాబట్టి ఫెస్టివల్ నిర్వహణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు లేవు. కానీ మెట్రో నగరాలకున్న వసతులు అనుకూలతలు కరీనంగర్ లాంటి చిన్న పట్టణాలకు ఉండవు. పైగా ట్రావెలింగ్ సమస్య. దాంతో పాటు పెద్ద దర్శకులు సాంకేతిక నిపుణులు మా కరీంనగర్‌కు రావడం అంత సులభం కాదు. అంతే కాకుండా మెట్రోలకున్న మీడియా ఫోకస్ కూడా మాకు తక్కువే.

పోటీ రహిత ఉత్సవం..

అయినా నా మాట మీద మా కార్యక్రమ నిర్వహణ మీద నమ్మకంతో పలువురు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వీటన్నింటి నడుమ ఫిల్మ్ ఫెస్టివల్ కావాల్సింది సినిమాల ఎంపిక. ఫీచర్ ఫిల్మ్స్‌తో ఫెస్టివల్ అంటే మన శక్తికి మించినది అవుతుంది కనుక డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనుకున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించేది మొట్టమొదటిసారి కనుక పోటీ రహిత ఉత్సవంగా నిర్వాహించాలన్నది ఆలోచన. అది విజయవంతమయితే తర్వాతి కాలంలో కాంపిటీటివ్ ఫెస్టివల్స్ చేయొచ్చు అనుకున్నాం. ఆ క్రమంలో ఏర్పాట్లకు సిధ్ధమయ్యాము. మొదట కావలసింది ఫిల్మ్స్ ఇన్ డిజిటల్ ఫార్మాట్స్. దానికోసం బెంగళూరు సుచిత్ర కు చెందిన నరహరి రావు, హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి బి.హెచ్.ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి లు ఎంతో సహకరించారు. సూచనలు చేశారు. కొన్ని సినిమాల్ని అందించారు. ముంబైకి చెందిన సుధీర్ నంద్‌గావంకర్, నువ్వు ముంబై వస్తే MAMI ఫెస్టివల్ వాళ్ళని పరిచయం చేసి సహకరిస్తానన్నారు. అట్లే కలకత్తా ప్రేమేంద్ర మజుందార్ కూడా. అంత సమయం లేదు అనుకుని ఫెస్టివల్‌కి అవసరమయిన సినిమాల్ని సేకరించే పనిలో పడ్డాను. నిర్వహణ కోసం కఫీసో నుంచి వివిధ కమిటీల్ని వేశాం.


ఫెస్టివల్ ఛైర్మన్‌గా కలెక్టర్ ఏం.వి. సత్యనారాయణ, ఫెస్టివల్ డైరెక్టర్‌గా నేను, అసోసియేట్‌గా కోల రాంచంద్రారెడ్డి, హాస్పిటాలిటీ కన్వీనర్‌గా ఎం.ప్రభాకర్, పబ్లిసిటీ కన్వీనర్‌గా పొన్నం రవిచంద్ర, స్క్రీనింగ్ కన్వీనర్‌గా రఘురాం, సెమినార్ కన్వీనర్‌గా టి.దామోదరస్వామి, ఫైనాన్స్ కన్వీనర్‌గా రావికంటి మురళి, సలహాదారులుగా నారదాసు లక్ష్మణరావు, ఎన్.శ్రీనివాస్‌లను వేసుకున్నాం. పని మొదలయింది. అన్నీ అట్టహాసంగా వుండాలి కదా. ఫెస్టివల్ కోసం పోస్టర్‌ని ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ చేత వేయించాము. ఆయన గొప్ప చిత్రకారుడే కాకుండా మంచి మిత్రుడు కూడా. పోస్టర్‌తో పాటు ఫెస్టివల్ బుక్ కోసం కరీంనగర్ పట్టణానికి ముఖద్వారం అయిన ‘జూబ్లీ కమాన్’ పెయింటింగ్ వేసి ఇచ్చారు.

ఈ జూబ్లీ కమాన్‌ను నిజాం రాజు సింహాసనం అధిష్టించి 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబిలీ అయిన సందర్భంగా కరీంనగర్ జాగీర్దార్ నిర్మించాడని చెబుతారు. నిజాం కిరీటం కూడా కమాన్ మీద కనిపిస్తుంది. ఇక మా కరీంనగర్‌లో వున్న మరో చారిత్రక నిర్మాణం ‘క్లాక్ టవర్’. మా కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అంతకుముందు వరకు వున్న ఎలగందల్ నుంచి ఇప్పటి కరీంనగర్‌కు 1905లో మార్చిన తర్వాత ఇంగ్లీషు వాళ్ళ పాలనలో ఆ క్లాక్ టవర్ నిర్మించారు. ఇక ఇప్పుడున్న అన్నపూర్ణ కాంప్లెక్స్ స్థానంలో పాత కలెక్టరేట్, ఇంకా కలెక్టర్ కాంప్ ఆఫీసు, జైలు, చర్చ్ తదితరాలు నిర్మించారు. ఇప్పటికీ కమాన్, క్లాక్ టవర్ కరీంనగర్ నగర సింబల్స్‌గా నిలిచి వున్నాయి. ఇక ఫెస్టివల్ కోసం రూపొందించిన పోస్టర్‌ని కలెక్టర్ ఎం.వి.సత్యనారాయణ చేత రిలీజ్ చేయించాము. అన్నవరం శ్రీనివాస్ అనంతర కాలంలో నా పలు కవితా సంకలనాలకు భావస్ఫోరక మయిన ముఖచిత్రాల్ని వేశారు.

అయిదు రోజుల్లో 50 లఘుచిత్రాలు..

ఇక ఫెస్టివల్ విషయానికి వస్తే అయిదురోజుల ఉత్సవాన్ని ప్లాన్ చేశాం. అప్పటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న కఫీసోకి ఈ ఫెస్టివల్ సొంత హాలులో జరగటం ప్రతిష్టాత్మకమయింది. ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 50 షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రాల్ని ప్రదర్శించాము. ఇందులో ప్రధానంగా ఆనంద్ పట్వర్ధన్ తీసిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’, గుజరాత్ మత కల్లోలాల గురించి రాకేశ్ శర్మా తీసిన ‘ఫైనల్ సొల్యూషన్’, ‘రీమిక్స్ ఆఫ్ హుస్సైన్’, బి.నరసింగ రావు తీసిన ‘మావూరు’, ‘ఆకృతి’ లాంటివి ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఫెస్టివల్‌ను మొదటి రోజు దర్శకులు ఎడిటర్ బి.లెనిన్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సభలో అతిథిగా దర్శకులు, ఆత్మీయులు అక్కినేని కుటుంబరావు పాల్గొన్నారు. కఫిసో ఫోటో ప్రదర్శనని అప్పటి మేయర్ డి.శంకర్ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా ఒక రోజు ‘ఎ ఫోకస్ ఆన్ కరీంనగర్’ అన్న విభాగాన్ని స్థానీయ దృక్పధంతో రూపొందించాము.

దాన్లో పోల్సాని వేణుగోపాల రావు రూపొందించిన ‘మనసున మనసై’, రమేశ్ తీసిన ‘నా తల్లి తెలంగాణ’, కే.ఎన్.టి.శాస్త్రి సిరిసిల్లా చేనేత కార్మికుల ఆత్మహత్యల పైన రూపొందించిన ‘డెత్ లూమ్స్’, పోలీసులు నక్సల్స్ నడుమ జరుగుతున్న హింస, దాని పర్యవసానాల పైన రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ కిల్లింగ్స్’ లాంటి అనేక ఫిల్మ్స్ ప్రదర్శించాము. ఫెస్టివల్‌లో మరో రోజు నిర్వహించిన సెమినార్లో 'ఇండియన్ డాక్యుమెంటరీ సినిమా - ఎమర్జింగ్ ట్రెండ్స్’ అన్న అంశం పైన ఆసక్తికరమయిన చర్చ జరిగింది. అందులో హెచ్.ఎన్.నరహరిరావు, కె,ఎన్.టి.శాస్త్రి, సినిమాటోగ్రాఫర్ దర్శకుడు ఎం.వి.రఘు, దర్శకుడు గోపాలకృష్ణ, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలూ, ప్రదర్శించిన సినిమాలు అన్నీ కఫిసో సభ్యుల్ని విశేషంగా ప్రభావితం చేశాయి.

ఫోటో ప్రదర్శనలో కేసీఆర్..

ఇక ఫెస్టివల్ ముగింపు రోజు అప్పటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు కే. చంద్రశేఖర్ రావుని అతిథిగా పిలిచాము. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు చొరవతో అధి సాధ్యమయింది. అప్పుడు ఎంపీ కేసీఆర్ కరీంనగర్‌లో భవన నిర్మాణంలో వున్నారు. ముగింపు రోజు నేనూ లక్ష్మణ్ రావు ఆయన దగ్గరికి వెళ్ళాం. నిర్మాణం పనిని తానే దగ్గర వుండి పర్యవేక్షిస్తున్నారాయన. మాతో పాటు ఫిలిమ్ భవన్‌కు వచ్చారు. మొదట హాలు పైన ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూశారు. ఆప్పుడు ఆయనపై వున్న క్రేజ్‌తో అనేక మంది తోసుకుని వస్తే తానే ‘ఏమయ్యా ఫోటోల్ని చూడనీయండి.. నేనెక్కడికీ పోను..’అంటూ నిలువరించారు. తర్వాత జరిగిన సభలో కళలు, సినిమాలు, తెలంగాణ అన్న అంశాల్నీ జోడించి అద్భుతమయిన ప్రసంగం చేశారు చంద్రశేఖర్ రావు.

ఆయన ప్రసంగం తర్వాత అధ్యక్ష్య స్థానంలో వున్న నేను ‘ఈ ప్రసంగం విన్న తర్వాత మిమ్మల్ని కేవలం రాజకీయ నాయకుడు అని ఎవరంటారు సర్’ అన్నాను. ఆయన నవ్వేసి ఊరుకున్నారు. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు, శ్రీనివాస్, నరహరి రావు తదితరులు ప్రసంగించారు. ఎంపీ కేసీఆర్ తన ఒక నెల జీతం కఫీసోకు ఇస్తామన్నారు, జీవితకాల సభ్యుడిగా వుంటానన్నారు. తర్వాత అవేమీ జరగలేదు. అది వేరే విషయం అనుకోండి. అట్లా కఫిసో మొదటి జాతీయ స్థాయి ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ))

ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్..

తర్వాత పర్యావరణంలో ప్రధానమైన నీరు అంశాన్ని తీసుకుని ఆగస్టులో ఫిలిమ్ భవన్‌లో ఒక ప్రత్యేక ఫిలిమ్ ఫెస్టివల్ ఏర్పాటుచేశాం. అప్పటికే బెంగళూరు తదితర కేంద్రాల్లో నిర్వహిస్తూ వచ్చిన “వాయిస్ ఫ్రమ్ వాటర్స్”, 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆన్ వాటర్’ ఉత్సవాన్ని కరీంనగర్‌కు తెచ్చాము. బెంగళూరుకు చెందిన నా మిత్రుడు జార్జ్ కుట్టి, హైదరాబాద్‌కు చెందిన సరస్వతి కవుల తదితరుల సహకారంతో ఈ ఫెస్టివల్ ఏర్పాటయింది. కుట్టి అప్పటికే ‘Deep Focus’ సినిమా పత్రికకు సంపాదకుడిగా వున్నాడు.

అది సినిమా గురించి చాలా సీరియస్ అంశాల్ని గురించి వ్యాసాలు, వ్యాఖ్యల్ని ప్రచురించేది. చాలా గొప్ప పేరున్న పత్రిక అది. దానితో పాటు జార్జ్ కుట్టీ కూడా పేరున్నవాడు. ఆ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాట్లు ఘనంగానే చేశాం. పోస్టర్ విడుదల, ఉత్సవ నిర్వహణలు కఫీసో మిత్రుల్నే కాకుండా పలువురు పర్యావరణ వేత్తలు, అసంఖ్యాక ప్రేక్షకుల నడుమ ఆ ఉత్సవం పది రోజుల పాటు విజయవంతంగా జరిగింది.

అప్పుడే ఆ ఉత్సవాల తర్వాత కఫిసో పక్షాన ఫిలింభవన్ లో ‘ఎర్త్’.‘వాటర్’ , ‘ఫైర్’ మూడు సినిమాలతో దీపా మెహతా ఫిలిమ్ ఫెస్టివల్‌ని ఏర్పాటు చేశాము. ఆ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. అయితే ఆ సినిమాల పైన కోపంతో కొన్ని సంస్థలకు చెందిన కొందరు ఫిల్మ్ భవన్‌పై దాడి చేశారు. ఫర్నీచర్ పగుల కొట్టి నానా హంగామా చేశారు.. అదంతా నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాను కనుక అదొక చిత్రమయిన భిన్నమయిన అనుభవం. ఆ రోజు నాకు జగదీశ్వర్ రావు లాంటి ఒకరిద్దరు మిత్రులు అండగా వుండి నాపై భౌతిక దాడి జరగకుండా చూశారు.

ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్

94405 01281




Advertisement

Next Story