- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందరికీ విద్య అందేది ఎప్పుడో!?
‘Education is the most powerful weapon which you can use to change the World’ అంటారు దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా. అణ్వాస్త్రాలతో కూడా సాధించలేని విజయాలను సాధించేది, విశ్వమానవాళికి సౌఖ్యాన్ని, సుఖాన్ని అందించేది విద్య. మరి అలాంటి విద్యాయుధాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగించడం లేదు? వాడుకోవడం లేదు? ఇప్పటికీ అందరికీ విద్య అందుబాటులో ఎందుకు లేదు? కనీస స్థాయి అక్షరాస్యతను సైతం ఎందుకు సాధించలేకపోతున్నాం? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు, మొత్తం జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులే. దశాబ్దాలుగా ప్రపంచంలోనే అతి పెద్ద నిరక్షరాస్యత దేశంగా భారతదేశం ఎందుకు వర్ధిల్లుతోంది? ఇలాంటి జవాబులు లేని ప్రశ్నలెన్నో కనీస అక్షరాస్యత చుట్టే అల్లుకున్నాయి.
అక్షరాస్యత అంతంత మాత్రమే!
భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత, విద్యాభివృద్దికై అనేక కార్యక్రమాలు నిర్వహించబడినాయి, నిర్వహించబడుతున్నాయి. ప్రతి ఏటా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని విద్యాసంస్థలు విద్యపై సదస్సులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాయి. అక్షరాస్యత ప్రాముఖ్యత, విద్యారంగ సంబంధిత ర్యాలీలు నిర్వహిస్తూ, విద్యాభివృద్ధి, దాని ఆవశ్యకతపై నినాదాలు ఇస్తుంటాయి. అయితే ఇలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, విద్య, అక్షరాస్యత విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉంది.
మనకు తెలిసిన ప్రకారం, చదవడం, రాయడం, వినడం, మాట్లాడటం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం అక్షరాస్యత. కానీ యునెస్కో నిర్వచనం ప్రకారం గుర్తించడం, అర్థం చేసుకోవడం, పాల్గొనడం, సృష్టించడం, వార్తాలాపన, లెక్కించడం, ముద్రించిన, రాయబడిన విషయాలను గ్రహించే నైపుణ్యాలను కలిగి ఉండటం అక్షరాస్యత. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం 74.04%. ఇది ప్రపంచ అక్షరాస్యతతో పోల్చుకుంటే 10శాతం తక్కువగా ఉంది. ఇంకా దేశంలో చదువుకు నోచుకోని వారు దాదాపు 25.06% మంది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 12శాతం అక్షరాస్యత ఉండేది. గడిచిన 75 ఏళ్లుగా నిరంతరం ప్రయత్నిస్తే దానికి అదనంగా 62 శాతాన్ని జోడించగలిగాము. ఈ లెక్కన దేశంలో మిగతా పావువంతు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి మరో ఇరవై ఐదు ఏళ్ళు పడుతుందేమో? మొత్తం అక్షరాస్యతే తక్కువగా నమోదైనప్పడు, స్త్రీల అక్షరాస్యత గురించి ప్రత్యేకంగా ఆశలు పెట్టుకోలేము. దేశంలో, రాష్ట్రంలో అసలు వయోజన విద్య, నిరంతర విద్య ఊసే లేదు.
సాధించాల్సిన అక్షరాస్యత కనబడలే...
2017-18 నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ప్రస్తుతం దేశంలో అక్షరాస్యత 77.7%. 2011 జనాభా లెక్కల తరువాత నుండి 2018 వరకు అంటే ఐదు ఏళ్ళలో కేవలం 3.3% అక్షరాస్యతను పెంచగలిగాము. 2001 జనాభా గణన ప్రకారం అక్షరాస్యత 64.83 శాతం. అది 2011 నాటికి 9.21 శాతం పెరిగి 74.04 శాతం నమోదు అయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల గత పదేళ్లలో పెరిగినంతగా, ఈ పదేళ్లలో పెరిగే అవకాశం కనబడటం లేదు. ఈ సర్వే అనంతరం వచ్చిన కరోనా మహమ్మారి మరింతగా అక్షరాస్యతను దిగజార్చేలా కనబడుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు జరగబోయే జనాభా గణనలో మనం సాధించదలిచిన అక్షరాస్యతను సాధించలేదనేది వాస్తవం.
తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ప్రకటిస్తే కిందనుండి 4వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 66.5 శాతంగా గుర్తించారు. జార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాయి. అన్ని రంగాలలో అగ్రభాగాన ఉన్నట్లు ప్రకటించుకున్న తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం గమనించదగ్గ విషయం. అదే విధంగా 2017-18 ఎన్.ఎస్.ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత 72.7 శాతం. ఇది జాతీయ సగటు కంటే కూడా తక్కువ. 2011 జనాభా గణన ప్రకారంగా ఏ స్థానాన్ని పొందామో అదే చివరి నుంచి మళ్ళీ నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉండటం గమనార్హం. స్త్రీల అక్షరాస్యత విషయంలో తెలంగాణ రాష్ట్రం మరింత దిగజారి కేవలం 53.7 శాతంతో చివరి నుండి రెండవ స్థానంలో నిలిచింది. ఇక మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్ఎస్ సర్వే 2017-18 ప్రకారం, జాతీయ అక్షరాస్యత శాతం 77.7 శాతం కానీ దాని కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడే ఉంది. ఈ సర్వే ప్రకారం 15 ఏళ్లు దాటి అసలు చదువుకోని వారి శాతం కూడా ఏపీలో 38.7, తెలంగాణలో 31.7 ఉంది. అసలు చదువుకోని గ్రామీణ పురుషుల విషయంలో అయితే దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ మంది ఆంధ్ర, తెలంగాణల్లో ఉన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి కొరకు..
ఇక విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. దీని అమలుకు ప్రయత్నం చేస్తున్నామని గడిచిన దశాబ్దకాలంగా చెపుతూనే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1090 గురుకులాలు ప్రారంభించి ఉచిత విద్యను అందిస్తున్నారు. నూతన గురుకులాల ఏర్పాటుకు ముందుగా, ఉచిత విద్య పొందుతున్నది 37.1% ఉండేది. గడచిన పదేళ్లలో వారి సంఖ్య దాదాపు ఐదున్నర లక్షల పైచిలుకుకు చేరింది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు బడి బయట ఉండటం ఆలోచించదగిన విషయం. వ్యక్తి అన్ని రంగాలలో ముందుకు సాగేందుకు, అతని సర్వతోముఖాభివృద్ధికి విద్య అత్యంత అవసరం. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు, హక్కుల సాధనలోను విద్య కీలకమైంది. దేశాభివృద్ధిలో, వస్తు ఉత్పత్తిలో విద్యా నైపుణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అక్షరాస్యత, విద్యలతోనే మానవాభివృద్ధి మెరుగుపడుతుంది. ప్రభుత్వాలు అన్ని రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూనే దానికి మూలమైన విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటం శోచనీయం. ప్రభుత్వ సంస్థలను పటిష్టం చేయాల్సిన చోట ప్రవేటు వ్యక్తులకు, వ్యవస్థలకు తలుపులు బార్ల తెరవడం సామాన్యుడిని విద్యకు దూరం చేయడం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాలు సంపూర్ణ విద్య, అక్షరాస్యతను సాధించేందుకు చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రయత్నం చేయకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా సాధించేది శూన్యం. ఇక వయోజన విద్య, నిరంతర విద్య కార్యక్రమాలు లేకుండా అక్షరాస్యత పెంపొందించడం ఎప్పటికీ అసాధ్యం. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య’ అది అందరికి అందేది ఎప్పుడో.!
(రేపు జాతీయ విద్యా దినోత్సవం)
డా. సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
98496 18116