ఆ ఊరికి శతాబ్దాల నాటి శాపం.. 7 దశాబ్దాలుగా ఈ ఊరు దీపావళికి దూరం

by Rani Yarlagadda |
ఆ ఊరికి శతాబ్దాల నాటి శాపం.. 7 దశాబ్దాలుగా ఈ ఊరు దీపావళికి దూరం
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పూజలు, దీపావళి నోములు, దీపాలు, బాంబుల మోతతో దేశం దద్దరిల్లింది. చీకటిని పారద్రోలి వెలుగుల్ని నింపే దీపావళిని ప్రవాసులు సైతం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ.. రెండు ఊర్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా దీపావళికి దూరంగా ఉంటున్నాయి. ఒక ఊరికి మహిళ ఇచ్చిన శాపం కారణమైతే.. మరో ఊరికి దీపావళి మిగిల్చిన విషాదమే ఆ పండుగకు దూరంగా ఉండేలా చేశాయి.

వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లా సమ్మూ గ్రామం.. కొన్ని వందల సంవత్సరాలుగా దీపావళిని జరుపుకోవట్లేదట. అందుకు కారణం సతీసహగమనం చేసిన ఓ వివాహిత ఇచ్చిన శాపమే కారణమంటున్నారు గ్రామస్తులు. దీపావళికి పుట్టింటికి వెళ్లిన ఆమె చెవిన భర్త మరణించాడన్న వార్త పడింది. రాజు ఆస్థానంలో పనిచేస్తున్న భర్త మరణించాడని తెలిసి.. ఆ బాధను తట్టుకోలేక సతీసహగమనం చేసింది. ఆ సమయంలో ఈ ఊరి ప్రజలు ఎన్నడూ దీపావళిని జరుపుకోలేరని శాపం పెట్టిందట. అప్పటి నుంచీ సమ్మూలో దీపావళి వేడుకలే జరగలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ ఊర్లోనే కాదు.. ఆ గ్రామానికి చెందిన వారు వేరే ఊరిలో ఉన్నా పండుగను జరుపుకోరు. అలా చేసుకుంటే.. ఏదో కీడు జరుగుతుందన్న భయం అక్కడి ప్రజల్లో నెలకొంది. ప్రత్యేక వంటలు కూడా చేయరు. ఓసారి ఓ కుటుంబం ప్రత్యేక వంటలు చేసేందుకు ప్రయత్నించగా.. వారి ఇల్లు అగ్నికి ఆహుతైంది. శాపం నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా ఫలితం లేకపోవడంతో దీపావళిని జరుపుకోవాలన్న ప్రయత్నం కూడా చేయట్లేదు.

ఏపీలోని గ్రామం కూడా దీపావళికి దూరం

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉన్న గ్రామం కూడా దీపావళికి దూరంగా ఉంటోంది. ఒకటి రెండు కాదు.. ఏడు దశాబ్దాలుగా దీపావళి జరుపుకోవట్లేదు జడ్ బెన్నవరం పంచాయతీలో ఉన్న కిత్తంపేట గ్రామం. ఇందుకు కారణం.. ఓ దీపావళి నాడు ఊరిలో జరిగిన విషాదమే. 70 ఏళ్ల క్రితం ఊరంతా పాకలే ఉండేవి. గడ్డివాములు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఉండేవి. దీపావళినాడు దివిటీలు తిప్పుతుండగా.. నిప్పరవ్వలు పడి ఇళ్లన్నీ కాలిపోవడంతో పాటు.. పశువులన్నీ మరణించాయి. నాటి నుంచీ ప్రతి సంవత్సరం దీపావళికి అపశకునాలే జరుగుతుండటంతో, ఆ పండుగ సమయానికే ఎక్కువగా మరణాలు సంభవించడంతో దీపావళిని జరుపుకోవడం మానేశారు. దీపాలను కూడా వెలిగించొద్దని నాటి పెద్దలు తీర్మానం చేయడంతో.. అదే పాటిస్తున్నారు. నాగులచవితినాడు పుట్టలో పాలు పోసి టపాసులు కాల్చుకుంటామని గ్రామస్తులు, మాజీ సర్పంచ్ కర్రి అర్జున తెలిపారు.

Advertisement

Next Story