- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోకోణం: మునుగోడు ఫలితం వెనకాల మోడీ-షాల వ్యూహం!
మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ తమ బలగాలను భారీగా మోహరించాయి. అర్థ, అంగ బలాలను విచ్ఛలవిడిగా వినియోగించాయి. ఓటుకు రూ. 3నుంచి 5వేల వరకు వెచ్చించాయి. టీఆర్ఎస్ వంద మంది వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపితే, ఆ స్థాయిలో కాకున్నా కమలనాథులు సైతం తమ సర్వశక్తులనూ కేంద్రీకరించారు. కొండల్లాంటి ఈ రెండు పార్టీల తాకిడి మధ్య కాంగ్రెస్ సహా ఇతర చిన్న పార్టీలు ఉనికి కోసం మాత్రమే పోరాటం చేశాయి.
ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వరుస సర్వేల్లో వెల్లడైన ప్రభుత్వ వ్యతిరేకతతో ఢీలా పడిన సీఎం కేసీఆర్‌లో ఈ విజయం కాస్త ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఖాయం. ఏడాది కాలంగా 'బీజేపీపై ఆలవుట్ వార్' వ్యూహాన్ని అనుసరిస్తున్న ఆయన ఇనుమడించిన ఉత్సాహంతో తన దాడికి మరింత పదును పెడతారు. కొత్త జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ని రూపుదిద్దడంపై కేంద్రీకరిస్తారు. తన ప్రయత్నాలకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు లభించాయని దేశమంతా తిరుగుతారు. గుజరాత్‌కు చెందిన శంకర్ సింగ్ వాఘేలా ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ వంటి చిన్న పార్టీలను, ఆయా రాష్ట్రాల రైతు సంఘాలను, వ్యక్తులను పార్టీలో చేర్చుకుంటారు. అలాగే, వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక అలయెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి ఢిల్లీలో కింగ్ కాకున్నా కింగ్ మేకర్ అవడానికి ప్రయత్నిస్తారు.
కేవలం 11వేల ఓట్ల తేడాతో మునుగోడును కోల్పోయిన బీజేపీ వాస్తవానికి ఓడినట్లు కానేకాదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి అక్కడ వచ్చిన ఓట్లు కేవలం 12వేల 725. ఆగస్టులో రాజగోపాలరెడ్డి తన స్థానానికి రాజీనామా చేసి కమలదళంలో చేరేవరకూ ఈ నియోజకవర్గంలో కమలనాథుల ఉనికి అంతంత మాత్రమే. 1967 నుంచి 2018 వరకు జరిగిన 12 ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒకసారి టీఆర్ఎస్ మునుగోడును గెలిచాయి. బీజేపీ ఇక్కడ ప్రవేశించిందే 2014 ఎన్నికల నుంచి. ఒక్క మునుగోడే కాదు.. నల్లగొండ జిల్లాలో, దక్షిణ తెలంగాణలో ఆ పార్టీకి చెప్పుకోదగిన ఆదరణ ఇప్పటివరకూ లేదు. అలాంటి పార్టీ ఇప్పుడు ఏకంగా విజయం అంచుల వరకూ వెళ్లిందంటే వారి వ్యూహం సక్సెస్ అయినట్లుగానే భావించాలి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 'బలీ కా బక్‌రా' కావడం అతిపెద్ద విషాదం. ఆరుమార్లు గెలిచిన స్థానంలో డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. సిట్టింగ్ స్థానం అయినా, ఆ పరిధి ఎంపీ తమవాడే అయినా అంతర్గత తగవులు, క్రమశిక్షణారాహిత్యం, నిధుల లేమి, హైకమాండ్ నిర్లక్ష్యం, రాహుల్ జోడోయాత్ర.. ఇలా కర్ణుని చావుకు వేయి కారణాలన్న చందంగా అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. అభ్యర్థి స్రవంతి చూపిన తెగువను, పోరాటపటిమను అధినాయకత్వం ప్రదర్శించి వుంటే గెలువకపోయినా కనీసం రెండో స్థానమైనా దక్కేదని విశ్లేషకుల భావన. రాబోవు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తోకగా మారే ప్రమాదం ఆ పార్టీకి ఇప్పుడు పొంచివుంది.
గెలుస్తామనే నమ్మకం వంద శాతం లేకున్నా, ఈ మేరకు రాష్ట్ర నేతలు మొర పెట్టుకున్నా అగ్రనేతలు రాజగోపాలరెడ్డితో రాజీనామా ఎందుకు చేయించినట్లు? ఉపఎన్నిక ఎందుకు అనివార్యం చేసినట్లు? రాజకీయంగా తప్ప ఇతరత్రా ఆ పార్టీ అధిష్టానం మునుగోడుపై ఎందుకు కేంద్రీకరించనట్లు? ప్రత్యర్థి పక్షం భారీ ఎత్తున డబ్బులు పంచుతున్నా, అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోనట్లు? అమిత్ షా కాని, నడ్డా కాని ప్రచారానికి ఎందుకు రానట్లు? ఇవన్నీ జవాబు వెతకాల్సిన ప్రశ్నలు.
బీజేపీ థింక్ టాంక్ వ్యూహాన్ని గమనిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' ఆ పార్టీ అసలు టార్గెట్. ఈ విషయాన్ని ప్రధాని మోడీ కాని, నంబర్ టూ అమిత్ షా కాని, అధ్యక్షుడు నడ్డా కానీ ఏనాడూ దాచుకోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఆ దిశగా ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజార్చే గేమ్ ప్లాన్‌ను అమలుచేస్తున్నారు. 54 ఏళ్ల పాటు దేశాన్నేలిన పార్టీని ప్రస్తుతం కేవలం రెండంటే రెండు రాష్ట్రాలకు పరిమితం చేశారు. అందులో ఒకటైన రాజస్థాన్ సర్కారు ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉన్నది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. రాజ్యసభలో సైతం సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడానికి మోడీ-షాలు ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ లేదా యూపీఏ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకవైపు తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, అధికారంలోకి రావడానికి సామ దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూనే ఆ పాచికలు పారని చోట కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు పుంజుకునేలా పావులు కదుపుతున్నారు. తమ ప్రభుత్వాలు ఉన్నచోట ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలిన స్థితిలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాకుండా పరోక్షంగా ఇతర పార్టీలు బలపడేందుకు తోడ్పడుతున్నారు.
మోడీ-షాల ఈ వ్యూహంలో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ అంటున్న ఆప్, తృణమూల్, ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్‌లు సరిగ్గా ఇమిడిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌ను పడగొట్టిన ఆప్ ఇప్పుడు గుజరాత్‌లో అదే పని చేయబోతున్నది. అక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా లేదంటే ఆప్ సర్కారు ఏర్పాటు చేసినా కమలనాథులకు వచ్చే నష్టం ఏమీలేదు. గత ఎన్నికల్లో కేవలం పది సీట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెసే ఆ రాష్ట్రాన్ని మరోమారు చేజార్చుకుంటుంది.
బీజేపీని, కాంగ్రెస్‌ను సమానస్థాయిలో వ్యతిరేకిస్తానంటున్న కేసీఆర్ కూడా ఆచరణలో కాషాయపార్టీకే తోడ్పడుతున్నారు. మునుగోడు ఫలితం తదనంతర పరిణామాల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్Xబీజేపీ అన్నట్లుగానే రాజకీయం నడుస్తుంది. ఏడాది లోపునే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ఏదో అల్లావుద్దీన్ అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ మూడో స్థానం పొంది టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే పార్టీగానే నిలిచిపోక తప్పదు. ఒకవేళ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే సొంతంగా తిరిగి అధికారం దక్కినా జాతీయస్థాయిలో కమలనాథులకు జరిగే నష్టం ఏమీ ఉండదు. తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు ఎక్కువ లోక్‌సభ సీట్లు రాకుండా చేయడమే వారి అసలు లక్ష్యం. అన్నీ కలిసివచ్చి తెలంగాణలో అధికారం చేజిక్కితే అది ఆ పార్టీకి డబుల్ ధమాకా అవుతుంది.
ఇలా ఆలోచిస్తే.. మునుగోడులో నిజంగా గెలిచిందెవరు? ఓడిందెవరు? చెప్పండి.