ఆధునిక యుగ వైతాళికుడు.. జ్యోతిరావు ఫూలే

by Harish |   ( Updated:2023-04-10 18:45:52.0  )
ఆధునిక యుగ వైతాళికుడు.. జ్యోతిరావు ఫూలే
X

భారతదేశ ఆధునిక యుగ వైతాళికుడు, దేశ ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, గాంధీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న విశిష్ట మూర్తి జ్యోతిరావు ఫూలే.మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న ఫూలే జన్మించారు. తండ్రి గోవింద్ రావు. జ్యోతిరావు ఫూలే చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. క్రైస్తవ మత బోధకులు ప్రారంభించిన పాఠశాలలో చదువుకున్నాడు. తన 13వ ఏట సావిత్రిబాయి తో వివాహం జరిగింది.

జ్యోతిబా తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్ళి ఊరేగింపు లో పాల్గొన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో తన జీవితం మలుపు తిరిగింది. పెద్దయిన తర్వాత సమాజంలోని కుల వివక్షపై తనదైన అభిప్రాయాలు ఏర్పరచుకొని మిగిలిన వాళ్ళ కంటే తాము ఉన్నతులమన్న బ్రాహ్మణుల వాదనను ఖండించిసాగారు. శూద్రులు, అతి శూద్రులు కలిసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని జ్యోతిరావు ఫూలే కోరారు.

కులం పేరుతో తరతరాలుగా అన్నిరకాలుగా అణచివేతలకు వివక్షతకు గురైన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. శతాబ్దాలుగా అణచి పెట్టబడి ఉన్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావు ఫూలే. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి ఆయన. థామస్ పెయిన్ 1791లో రాసిన రైట్స్ ఆఫ్ మెన్ అనే గ్రంథం చదవడం ద్వారా ఫూలే మానవ హక్కుల గురించి తెలుసుకున్నాడు. అమెరికా స్వాతంత్య్రపోరాటం తనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది.

1848వ సంవత్సరంలో పుణేలో 'అంటరాని' కులాల బాలికల కోసం జ్యోతిబాపూలే ఒక పాఠశాలను స్థాపించాడు. 1851 వ సంవత్సరంలో రెండు పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1855 వ సంవత్సరంలో రాత్రి బడులు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారు. స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షతను జ్యోతిరావు పూలే విమర్శించాడు.1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి వితంతువుల గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. ఇటువంటి కేంద్రం స్థాపించడం దేశంలోనే మొదటిది. వితంతు పునర్ వివాహాలను ప్రోత్సహించారు.

సత్యం సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను జ్యోతిబాపూలే స్థాపించారు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్ళు అని చెప్పాడు. హిందూ సమాజంలో అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించారు. కుల వ్యవస్థను బానిసత్వం గా పరిగణిస్తూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గులాంగిరి వంటి ఎన్నో పుస్తకాలు రాశాడు. నిమ్న కులాల వాళ్లలో ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెంపొందించే విధంగా జ్యోతిబా ఫూలే కృషి చేశారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28 న కన్ను మూశారు. తన జీవితాంతం అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ జ్యోతిబాపూలే ప్రజల గుండెల్లో ఎల్లప్పుడు నిలిచి ఉంటారు.

(నేడు జ్యోతిబా ఫూలే జయంతి)

డాక్టర్ కోడూరి శ్రీవాణి

అసిస్టెంట్ ప్రొఫెసర్, శాతవాహన విశ్వవిద్యాలయం

99631 88743

Advertisement

Next Story