మిడిల్ క్లాస్ మిక్చర్ పొట్లం - 'షరతులు వర్తిస్తాయి'

by Ravi |
మిడిల్ క్లాస్ మిక్చర్ పొట్లం - షరతులు వర్తిస్తాయి
X

మధ్యతరగతి జీవితాలు ఎటు కదిలినా 'షరతులు వర్తిస్తాయి'. ప్రేమైనా, పెళ్లయినా ఏదీ అంత ఈజీగా వారికి దక్కదు. చాలీచాలని సంపాదన వారిని ఎగిరెగిరి తంతుంది. వారి ఆశలన్నీ ఆకాశంలో మెరుస్తుంటాయి. నాలుగు మెట్లెక్కితే చాలు అవి చేతికందుతాయంటే జుట్టు చేతికిస్తారు. అలాంటివాళ్లు మోసపు కోరల్లో చిక్కితే బతుకులు ఏమౌతాయో చెప్పే సినిమా 'షరతులు వర్తిస్తాయి'.

ఒకటి కొంటే మరోటి ఉచితం అని చివర్న చిన్న స్టార్ ఉండే ప్రకటనలను చూస్తుంటాం. వాటిలో ఉచితం కన్నా కనీకనబడని చుక్కే ప్రధానం. ఆ చుక్కను వెతుక్కుంటూ పోతే అప్పుడు తెలుస్తుంది 'షరతులు వర్తిస్తాయి' అని. ఆ చుక్కను చూడని వారి ఇక్కట్లే ఈ సినిమా. గొలుసుకట్టు దందా మనందరికీ తెలిసిందే. నలబై వేలు కట్టి సభ్యత్వం చేరితే నాలుగు టికెట్లు వస్తాయి. వాటిని నలబై వేలు కట్టే మరో నలుగురికి కట్టబెడితే నీ డబ్బులు నీకొస్తాయి. ఆ నలుగురు తలో నలుగురిని చేర్చితే నీకు కమీషన్ రాక మొదలవుతుంది. అలా సభ్యులు పెరిగిన కొద్దీ లక్షల రూపాయల కమీషన్ ఇక మీదే. కళ్ళు బైర్లు కమ్మే స్కీమ్. ఇంకా వివరాలు అక్కర లేదు, మాకు దీని గురించి తెలుసు అంటారా! అవును నిజమే.. ఆటోవాలా నుంచి ఆఫీసర్ దాకా మనలో ఎందరో దీని బారిన పడినవారే! ఆ వలలో ఇరుక్కున్న మిడిల్ క్లాస్ పావురాల గోసే 'షరతులు వర్తిస్తాయి'. మధ్యతరగతి యువత ప్రేమ ఒక యుద్ధమే. పెళ్ళయితే ఇరుకుటింట్ల అవసరాలు అరకొరే. టీవీలో వచ్చే సీరియళ్లు అత్తకు ఇష్టం, కోడలుకు సినిమా పాటలిష్టం. మనసులు మంచివే. కోరికలే గూసులాటకు మూలం. మా ఇంట్లోను ఇదే కథ అనుకునే వారే ఎక్కువ. అందుకే 'ఈ దేశంలోని 80 శాతం ఉన్న సామాన్యుల కథ ఈ సినిమా' అని దీనికి ట్యాగ్ లైన్ తగిలించారు.

ఊహలకు, వాస్తవానికి మధ్య సయ్యాట

అందమైన జంట నడుమ చిగురించిన ప్రేమ ఉత్త సినిమా ప్రేమ కాదు, ఊహలకు, వాస్తవానికి మధ్య సయ్యాట. ఉన్న దాంట్లో బతుకుతున్న సావిత్రి ఫులే నగర్ మధ్య తరగతిలో ఆశలు రేపిన గొలుసు కట్టు ఓ మహా దోపిడీ. ఈ రెంటి మేళవింపుతో చక్కని డౌన్ టు ఎర్త్ డ్రామా ఈ సినిమా. మన హీరో, హీరోయిన్ల పేర్లు చిరంజీవి, విజయశాంతి. పేర్ల గొప్పే కానీ పనులు చూస్తే చిరుది ఇరిగేషన్ శాఖలో చిరుద్యోగం. శాంతిది శాంతిలేని సేల్స్ గర్ల్ జాబ్. ప్రేమించే కుటుంబాలు, ప్రాణమిచ్చే దోస్తులు, పక్కా తెలంగాణ గుణాలు వారి సంపదలు.

గొలుసుకట్టు కంపలో చిక్కుకుంటే...

గొలుసుకట్టు కంపలో చిక్కుకున్న కాలనీవాసులు చివరికి ఏమవుతారు, ఆ పగటి దొంగల వెనుక ఎవరున్నారు అనేది సినిమాకు కీలకం. తనే కథ రాసుకొని దర్శకత్వం వహించిన కుమారస్వామి (అక్షర)కి ఇది తొలి చిత్రం. కథ ఎంపికలోనే ఈ సినిమా విజయం తొలిమెట్టుపై నిలబడింది. చక్కగా పండిన ఎమోషనల్ సీన్లు సినిమాకు మరో విజయ సోపానం. మధ్యతరగతి జీవన సత్యాలను పాత్రల నోట పలికించడానికి పెద్దింటి అశోక్ కుమార్ మాటలు ఎంతో దోహదపడ్డాయి. మాటలతో పాటు ఆయన 'పన్నెండు గుంజాల పందిర్ల కిందా..'అనే పెళ్లి పాట కూడా రాశారు. సంప్రదాయబద్దంగా తెలంగాణ ఇళ్లలో జరిగే పెళ్లి పద్దతిని అచ్చమైన పదజాలంతో వివరించిన పాట ఇది. పుట్టింటి పేరును నిలబెట్టాలనే అప్పగింతల చివరి చరణం మనసుల్ని తడపడం ఖాయం. ఇప్పటికే యూట్యూబ్ లో ఆ పాట హల్ చల్ చేస్తూ లక్షల్లో వ్యూవర్స్ ను పెంచుకుంటోంది. 'కాలం చూపుల గాలంరా!' మరో థీమ్ సాంగ్ గోరటి వెంకన్న రాశారు. 'కాసుల కట్టల ఆశరా ఇది..' అంటూ రామ్ మిర్యాల కరకు గొంతులో కఠిన నిజాలు చెబుతోంది. మల్లె గోడ గంగ ప్రసాద్ రాసిన ప్రేమగీతం 'పాలపిట్టల్లే ప్రేమే వాలే..' హుషారెక్కించే బీట్ సాంగ్. యువ సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు వైవిధ్య బాణీల్లో అన్నీ హిట్టు పాటలే.

స్థానిక లొకేషన్ల నిసర్గ సౌందర్యం

హీరో హీరోయిన్లుగా చైతన్య రావు, భూమి శెట్టి పాత్రలను అర్థం చేసుకొని నటించారు. పాత్రలకు తగ్గట్లుగా వారి రూపం, ఆహార్యంలో మార్పు చక్కగా అమిరాయి. 'పోచంపల్లి కాటన్' కాస్ట్యూమ్స్ వారికి మధ్యతరగతి ముద్రనిచ్చాయి. మానేరు డ్యామ్, కరీంనగర్ టౌన్ లొకేషన్లను సినిమాకు నేటివిటీని అద్దాయి. సినిమా తొలి సగం కుటుంబ సన్నివేశాలతో సాగినా ఇంటర్వెల్ కు ముందు మొదలైన ఉత్కంఠ సినిమా చివరిదాకా సాగి వేగాన్ని పెంచింది. తెలంగాణ యాస బాసలున్నా కథాపరంగా ఇది అందరి సినిమా.

స్వచ్ఛమైన ప్రజాప్రయోజన సినిమా

కొన్ని సినిమాల్లో చూయిస్తున్నట్లు ఫుల్లుగా తాగడం, గాయి గాయిగా వదరడం, రఫ్ గా ఉండడం తెలంగాణ నడవడి కానేకాదు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని మహాకవి దాశరథి ఊర్కేనే అనలేదు. శుభ్రమైన ఇళ్లు, చక్కని కుటుంబ సన్నివేశాలు, ప్రేమలు, స్నేహాలతో ఈ సినిమా కవివాక్కును నిలబెట్టింది. సిగరెట్, మద్యం తాగే సన్నివేశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కమర్షియల్ విలువలతో పాటు దర్శకుడు కుమార స్వామి (అక్షర) అభిరుచి, నిజాయితీ ఇందులో కనబడతాయి. స్వచ్ఛమైన ప్రజాప్రయోజన సినిమా ఇది. ఎల్లలులేని సందేశం, సన్మార్గం ఇందులో ఉన్నాయి.

పక్కా తెలుగు నేల బతుకు చిత్రం

తెలంగాణ సంస్కృతితో పాటు అంతటా ఉండే మధ్యతరగతి కుటుంబాల దిగులును తెరకెక్కించిన పక్కా తెలుగు నేల బతుకు చిత్రమిది. సినీ పరిశ్రమలో ముందుకు సాగుతున్న తెలంగాణ సృజనకారుల కృషికి, ప్రతిభకి ఇది మరో విజయపతాక. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, కృష్ణకాంత్ చిత్తజల్లు సంయుక్తంగా దీనిని నిర్మించారు. కరీంనగర్ లొకేషన్స్, డైలాగ్స్ లో డెప్త్ బాగున్నాయని దిల్ రాజు, పెళ్ళిపాటలో లిరిక్స్, ట్యూన్, చిత్రీకరణ తనకు నచ్చాయని శేఖర్ కమ్ముల, షరతుల మధ్య కుటుంబాల కథ ఇది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర విజయాన్ని అభిలషించారు. ఇలా సినీ దిగ్గజాల ప్రశంసలందుకున్న ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలు, దర్శకుడు పరిశ్రమలో స్థిరపడాలి. గొలుసుకట్టు స్కీమ్ మోసాలకు కుటుంబాలు బలవుతున్న పరంపర రోజుకొక విషాదవార్తగా ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని వలలో పడకుండా కనువిప్పు కలిగించే సినిమా ఇది. ఈ సందేశం అందరికి చేరేలా ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ప్రకటిస్తే బాగుంటుంది.

('షరతులు వర్తిస్తాయి' సినిమా ముందుగా అమెరికాలో మార్చి 14న విడుదలవుతున్న సందర్భంగా)

-- బి. నర్సన్

94401 28169

Advertisement

Next Story