ప్రాబల్యం లేని 'మైనారిటీ' సెక్షన్లు

by Ravi |   ( Updated:2023-11-23 00:30:26.0  )
ప్రాబల్యం లేని మైనారిటీ సెక్షన్లు
X

మెజారిటేరియనిస్ట్ దృక్పథం భిన్నమైన సంస్కృతులను, భిన్నమైన జీవన శైలిని, భిన్నమైన విశ్వాసాలను ప్రోత్సహించక గుర్రానికి డొప్ప గంతలు కట్టినట్టు ఒకే తీరులో సమాజాన్ని నడిపించేట్టు చేస్తూ, ఇక ఎటువంటి మెరుగును సూచించలేక ప్రతిష్టంభనకు లోనై, కాలక్రమంలో తిరోగమన గతి పట్టడం, తీవ్ర వైరుధ్యాలకు లోనవ్వడం జరుగుతుంది. ఇటువంటి దృక్పథాలున్న వ్యవస్థలో మైనారిటీలపై, వాళ్ళను సపోర్ట్ చేసే భావజాలాన్ని అనుసరిస్తున్న వాళ్ళపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. సమాజంలో దీని ప్రభావం వ్యక్తిగత మానసిక ఒత్తిడి మొదలుకుని, పౌర అశాంతి, ప్రాణాలు కోల్పోవడం వరకు ఉంటుంది. ఈ దేశంలో 'మెజారిటేరియనిజం' పేరు తీసుకుని అందుకు వ్యతిరేకంగా గళమెత్తిన సైద్ధాంతిక వాది, రాజకీయవాది ఒక్క అంబేద్కర్ మాత్రమే. ఆ తర్వాత ఎంతో మంది లిబరల్స్, మార్క్సిస్టులు ఈ భావజాలం చుట్టూ ఎన్నో వాదనలు, తీర్మానాలు ప్రతిపాదించుకుంటూ పోయినా... 'లెటర్ అండ్ స్పిరిట్'లో పాటించిన వాళ్ళు ఇంచుమించుగా లేరు. అందుకు నిష్పక్షపాతంగా, నీళ్ళను నీళ్ళుగా పాలను పాలుగా చూడగలిగే ఒక మానసిక స్థితి, సైద్ధాంతిక దృక్పథం అలవడి ఉండాలి. ఈ సమాజం ప్రతి మైనారిటీ అభిప్రాయానికి ఒక 'స్పేస్' ఇవ్వగలిగేంత విశాలత్వం ఉండగలగాలి.

సెక్యులరిస్టులు వీటిపై మాట్లాడరు..

మన దేశంలో సెక్యులరిజం విలక్షణంగా ఈ మెజారిటేరియనిజంను వ్యతిరేకిస్తూనే, మెజారిటేరియలిజంను ఫాలో అవుతుంది. దేశంలో పెద్ద సంస్థ అయిన ఇవాంజిలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ప్రకారం గత పది సంవత్సరాలలో క్రిస్టియన్‌ల మీద దాడులు నాలుగురెట్లు పెరగగా, ఈ సంవత్సరం ఆగస్టు వరకు 525 దాడులు నమోదైనాయి (ఇందులో సుమారు 65,000 చర్చ్‌లు, 200 మిషన్స్ సభ్యులుగా ఉన్నారు). ఈ దాడులు ఎక్కువగా గ్రామాల్లో, సెమీ అర్బన్ ఏరియాలలో దళిత కులాల నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్న చోట జరుగుతుంది. గణాంకాలు మణిపూర్ లోని సంఘటనలు లెక్కలోకి తీసుకోకుండా చెప్తున్న అంకెలు. మణిపూర్లో జరిగిన జరుగుతున్న దాడుల్లో దాదాపు 650 చర్చ్‌లు ధ్వంసం చేయబడ్డాయి. వందల్లో హత్యలు అత్యాచారాలు జరిగాయి.

దురదృష్టవశాత్తు ఎన్‌సీఆర్‌బీ మతపరంగా జరిగిన నేరాలను తమ డేటాలో వర్గీకరించి ఉంచదు కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థల డేటా ప్రకారమే మనం ఒక అంచనాకు రావాల్సి ఉంది. ఈ నేరాలు ముస్లింల మీద జరుగుతున్న దాడులతో పోల్చి చూస్తే చాలా తేడాలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో ఒక్క సంఘటన కూడా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం గాని, సెక్యులరిస్టుల నుండి నైతిక బలాన్ని సంపాదించడంలోనూ వెనుకబడ్డాయి. ఒడిషాలో 1999లో పాస్టర్ గ్రాహం స్టెయిన్స్‌ను అతని పిల్లలతో కలిపి సజీవ దహనం చేసిన, 2014లో వికారాబాద్‌లో పాస్టర్ సంజీవులును బహిరంగంగా హత్య చేసిన ఉదంతాలు చూస్తే, సెక్యులరిస్టుల గొంతు ఇటువంటి సంఘటనల్లో చాలా బలహీనంగా వినిపిస్తుంది. ఇదే ఏ ముల్లాపై జరిగిన దాడి గాని అయి ఉంటే ఈ దేశం దహనం అయి ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. అంటే, ఈ ప్రతిస్పందనల్లో తేడా స్పష్టంగా గమనిస్తున్నాము.

మైనారిటీల్లోనూ మెజారిటీ వర్గం

ఇలా ఎందుకు జరుగుతుందో ఒక కారణాన్ని లోతుగా పరిశీలిస్తే, ముస్లిములు చట్టపరంగా మైనారిటీలే గాని భారతదేశంలో వీరు రెండవ అతి పెద్ద మెజారిటీ వర్గం కిందకి వస్తారు. అయితే వీళ్ళ జనాభా శాతం సుమారు 15 శాతం ఉంటే, రాజ్యాంగం ఇచ్చిన 'హిందూ' నిర్వచనం ప్రకారం (ఎందుకంటే 'హిందూ మతానికి' ఆయా మత గ్రంథాల బట్టి ఒక నిర్దిష్ట నిర్వచనం కానీ అస్తిత్వం గాని లేదు కాబట్టి) హిందువులు 80 శాతం పైనే ఉంటారు. బ్రిటిష్ పాలన అనంతరం చారిత్రకంగా అయినా సరే ముస్లింలు మైనారిటీగా వర్గీకరించబడినా, వాళ్ళు రెండవ అతి పెద్ద మెజారిటీ కిందనే పరిగణింపబడి, హిందూమతంతో 'ఘర్షణ' ఏర్పడే పెద్ద మతంగా పరిగణింపబడ్డారు. అయితే, సంఖ్యాపరంగా వెనుకబడిన క్రైస్తవులకు మాత్రం ఈ పరిస్థితి లేదు. అంతే కాక వీళ్ళు ప్రధానంగా వెనుకబడిన దళిత కులాల నుండి ఎక్కువగా ఉండడం వల్ల రాజకీయ వ్యవస్థలో ప్రధాన భాగం కాలేకపోయారు. 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేవలం ముస్లిం రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులను అంచనా వేయడం కోసం సిఫారసుల కోసం ప్రత్యేకంగా 'సచార్ కమిటీ'ని ఏర్పరిచింది. అయితే మిగతా మైనారిటీ గ్రూపుల కోసం ఇలా ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఈ కమిటీ ఎంత దూరం వెళ్ళి సిఫార్సులు చేసిందంటే - మదరసాలలో డిగ్రీ దాకా విద్యను ప్రవేశ పెట్టాలని సూచించింది. 'మదరసా'లు నిజానికి ముఖ్యంగా ' ఇస్లాం ' మతం చదవడానికే ఉద్దేశించబడ్డాయి.

సంఖ్యాపరంగానే వారికి గుర్తింపు..

ఇక్కడ ప్రశ్న 'ఇస్లాం'ను అధ్యయనం చేయడం డిగ్రీ దాకా పెట్టాలా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్‌కు మాత్రం పరిమితం చేస్తే సరిపోతుందా? ముస్లింలను సముదాయించడానికి ఎంత దూరమైనా వెళ్ళే ప్రభుత్వాలు, రాజకీయాలు... క్రైస్తవుల విషయానికి వస్తే, ఎంత దూరంలో ఉంటున్నాయి. పైగా ఈ ఎన్నికల ప్రజాస్వామ్యంలో మెండుగా అంకెలున్న మైనారిటీలకుండే ట్రీట్‌మెంట్, స్పష్టమైన మైనారిటీలుగా ఉన్న సమూహాలతో పోల్చి చూస్తే తారతమ్యం కనిపిస్తుంది. చరిత్రను గమనిస్తే - జైన మతాన్ని ఒక మైనారిటీగా గుర్తించడానికి ఇండియాకు 67 సంవత్సరాలు పట్టింది. 2019 సంవత్సరం నాటి 74వ సెషన్‌లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం కూడా.. 'చాలా దేశాలలో, కొంత మంది మైనారిటీలు 'తగినంత ప్రాబల్యం' లేని మైనారిటీలుగా ఉండడం వల్ల వాళ్ళు 'సరి అయిన మైనారిటీలుగా' పరిగణింపబడ్డం లేదు' అని ఒక పరిశీలన చేసింది. మనదేశంలో ఉదార స్వభావులైన లౌకికవాదుల వైఖరి కూడా అదే విధంగా కలుపుకుపోయేతత్వంతో (ఇంక్లూజివ్) తయారవ్వాల్సిన అవసరం ఉంది.

ఈ మైనారిటీల మధ్య చూపే వివక్షను చూస్తుంటే, దళితులను ఎలాగైతే వర్గీకరించి వెనుకబాటుతనాన్ని కొలవాల్సి వస్తుందో, మైనారిటీలను కూడా గరిష్ట మైనారిటీ, కనిష్ట మైనారిటీలుగా విడదీసి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది.

పి. విక్టర్ విజయ్ కుమార్

96188 88955

Advertisement

Next Story