- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు విలువను తెలిపే ‘మార్టిన్ లూథర్ కింగ్’
సందేశాత్మక చిత్రాలను ఆదరించే కాలం ఇది కాదు. ఎప్పుడూ కూడా ఈ తరహా సినిమాలు విజయవంతం కాలేదు. అందుకే వాటికి కాస్త హాస్యం ‘కోటెడ్’గా పూసి తామనుకున్న కనీస పెట్టుబడిని రాబట్టుకున్న నిర్మాత దర్శకులున్నారు. ‘అహనా పెళ్ళంట’ అనే చిత్రం నుంచి నిన్న మొన్న(నవంబర్ 2) రిలీజయిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ వరకు సమాజపరమైన బాధ్యతాయుత అంశాలను సీరియస్‌గా చిత్రించే రోజులు కావని నిరూపిస్తాయి. ఆ మధ్య వచ్చిన ‘ప్రతినిధి’ వంటి సినిమాల ఫలితాలు అందరికీ తెలుసు. పారలల్ సినిమా ఛాయలున్న కథ అయినప్పటికీ, కమర్షియల్ హంగులు వలన ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రం ద్వితీయార్థంలో క్రమంగా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.
మంచి కథను రాసుకోవడం వేరు. దానిని తెరమీద చక్కగా ప్రజెంట్ చేయడం వేరు. ఇటువంటి చిత్రాలలో మొత్తం భారం ప్రధాన పాత్ర మీదనే ఆధారపడుతుంది. అటువంటి పాత్రలో నటుడిగా పరిమితులున్న సంపూర్ణేష్ బాబు ఎంపిక సబబుగానే ఉంది. కానీ.. అతను తన పాత్రను ‘భరించడం’లో కష్టపడ్డాడు కానీ, అంత ‘బరువు’ను మోయటంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథలో మంచి సమాజనీతి ఉంది. ఎన్నికల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను బాగానే ప్రజెంట్ చేశారు. ద్వితీయార్థంలో చిత్రంలో సన్నివేశాలు ‘రివీల్’ కావడం, కథ నెమ్మదించడం వంటి అంశాలు ప్రేక్షకులను చిత్రం ‘లక్ష్యం’ మరచిపోయేటట్టుగా చేశాయి. సంపూర్ణేష్ బాబు నటన కూడా క్రమంగా ‘ప్రత్యేకతలు’ లేనిదిగా మిగిలిపోయింది. ఎమోషన్ పండించవలసిన సన్నివేశాలలో ప్రేక్షకులకు ఏదో వెలితి తోస్తుంది.
కొత్తగా ఓటు సాధించుకున్న వ్యక్తి కథ
‘మార్టిన్ లూథర్ కింగ్’ తమిళ్ చిత్రం ‘మండేలా’ తెలుగు రీమేక్. ఒరిజినల్‌లో యోగిబాబు ప్రధాన పాత్రను పోషించారు. ఆ స్థాయి నటనను సంపూర్ణేష్ బాబు ఇవ్వలేకపోయారని అనుకోవాలి. ‘కొబ్బరిమట్ట’, ‘హృదయ కాలేయం’ వంటి స్పూఫ్ సినిమాల్లో నటించిన సంపూర్ణేష్‌ను పూర్తి భిన్నంగా చూపించిన చిత్రమిది. ఈ సినిమాలో కథానాయకుడు అందరూ చెప్పిన పని చేస్తూ, అవమానాలు భరిస్తూ, చెప్పులు కుట్టుకుని జీవించేవాడు. కథానాయక (అని గట్టిగా చెప్పలేం) శరణ్య ప్రదీప్ తన పరిధి మేరకు చక్కగానే చేసింది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలను బాగానే చిత్రించారు దర్శకురాలు పూజ కొల్లూరు. ప్రధాన పాత్రలు పోషించిన నరేష్, వెంకటేష్ మహా ఒకరికొకరు పోటీపడి నటించారు. సీనియర్ నటుడైన నరేష్‌తో పోటీపడి వెంకటేష్ మహా (రచయిత) నటించడం, వారిద్దరి నుంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు విజయం సాధించారు.
చిత్రకథకి వెళితే ఆంధ్ర ప్రాంతంలో పడమర పాడు అనే గ్రామం. దశాబ్దాలుగా రెండు కులాల మధ్య తగాదాలు. ఈ వర్గ వైషమ్యాలను నివారించేందుకు ఓ పెద్దాయన రెండు కులాల నుంచి ఇద్దరు అమ్మాయిలను వివాహమాడతాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు నరేష్, వెంకటేష్ మహా. కానీ.. వీరి వలన ఆ గ్రామంలో తగాదాలు తగ్గవు సరి కదా పెరుగుతాయి. గ్రామం తిరోగమన మార్గంలో పోతుంది. ఈలోగా ఎన్నికలు వస్తాయి. ఇద్దరూ పోటీ చేస్తారు. అయితే ఆ ఊర్లో రెండు కులాలకు ఓట్లు సమానం. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు సంపాదించుకున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’ ( సంపూర్ణేష్ బాబు) ఓటు వారికి అవసరమవుతుంది. ఒక్క ఓటుతో గెలుపు కోసం ప్రయత్నించే రాజకీయ పార్టీలు పడే పాట్లు ఈ సినిమాకు అవసరమైన మైలేజీని ఇచ్చాయి. అవే మైనస్లు అయ్యాయి కూడా. కథనంలో ఎలక్షన్స్ సమయంలో ఒక్క ‘ఓటుదారు’ నేపథ్యం కూడా ఆసక్తికరంగా సాగింది.
ఇటువంటి చిత్రాలు ఎంతో అవసరం!
చెప్పులు కుట్టుకొని ఊర్లో వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసే వ్యక్తికి కొత్తగా ఓటు రావడం, అతని ‘అవసరం’ పార్టీలు గుర్తించడం, అతడు అందరి చేత గౌరవింపబడటం, దండాలు పెట్టించుకోవటం మంచి ఆసక్తిని కలిగిస్తాయి. కింగ్ పాత్ర పైన జాలి, ఆపేక్ష కలిగేలా చేస్తాయి. కథలో కీలక మలుపు వచ్చేవరకు సినిమా వేగంగానే సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో హీరోను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించే క్రమంలో వచ్చే సన్నివేశాలు అంతవరకు చిత్రంపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తాయి. ఒక మూసలో సాగటమే ప్రధాన అంశం. చాలా సందర్భాల్లో లాజిక్ కనిపించదు. చూసిన సీన్లే మళ్లీ వస్తున్నాయనిపిస్తుంది. కథ ముందుకు వెళ్ళదు. క్లైమాక్స్‌లో సెంటిమెంట్ పండించే ప్రయత్నం కూడా ఇబ్బంది పెడుతుంది ప్రేక్షకులను. కొన్ని సన్నివేశాలలో ‘హీరో’ ప్రవర్తన అతి కనిపిస్తుంది. పైగా, మితిమీరిన నాటకీయత చోటు చేసుకుంటుంది. ఓటు ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి గొప్ప ఆయుధమని చెప్పే ప్రయత్నంలో వాస్తవిక దృక్పథం కనిపించదు. అయితే, ఆర్టిస్టులను చూడకుండా ఓపెన్ మైండ్‌తో సినిమాను చూస్తే పర్వాలేదనిపిస్తుంది. కమర్షియల్ హంగులతో తయారైన పారలల్ సినిమాగా మంచి ప్రయత్నం జరిగిందని చెప్పాలి. నరేష్, వెంకటేష్ మహా, వీరిద్దరి తండ్రిగా నటుడు చక్కగా చేశారు. సినిమాను చాలావరకు డ్రైవ్ చేసేది ఈ ఇద్దరే.. సాంకేతిక వర్గం ఈ చిత్రానికి తమ పరిధి మేరకు బాగానే వర్క్ చేశారు. స్మరణ్ సాయి సంగీతం బాగుందనిపిస్తుంది. దీపక్ యరగిరా చాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమాలో పల్లె జానపదాలు బాగా వాడుకున్నాడు. పల్లె వాతావరణంలో అనుగుణంగా సినిమా నేపథ్య సంగీతం, పల్లె వాసనలను పట్టిచ్చే కెమెరా పనితనం కనిపిస్తాయి. ఇక్కడ ఆర్ట్ వర్క్ ముఖ్యపాత్రని చెప్పాలి. రచయిత మహా తమిళ మాతృకథకు తెలుగు వాతావరణం అద్దే ప్రయత్నం చేసారు. దర్శకురాలు ఇదో రీమేకనే ఫీల్ రానీయకుండా తీసారు. టేకింగ్ ఓకే. అయితే, ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కొంతవరకు కరువనే చెప్పాలి. ఓటీటీలో లభ్యం కావచ్చు. వర్తమానంలో ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి చిత్రాల అవసరం ఉంది. ఓటు ప్రయోజనం తెలిసే అవకాశం ఉంది. నాయకులు, పార్టీల పాట్లు నిత్యం జనం చూస్తున్నవే అయినా ఆలోచింపజేస్తాయి. ఈ విషయంలో దర్శకులు, రచయిత, నిర్మాతలు శశికాంత్ చక్రవర్తి రామచంద్రల ప్రయత్నం అభినందనీయం.
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395