కేటీఆర్ టైం వచ్చేసింది!

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:13:53.0  )
కేటీఆర్ టైం వచ్చేసింది!
X

రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌తో పోల్చితే కేటీఆర్‌కే ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. గత ఏడేళ్లుగా ఆయన మంత్రిగా కీలక శాఖలు నిర్వహిస్తూ సమర్థ పాలకునిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రసాధన ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఆయన పేరు తెలియని ఓటరు రాష్ట్రంలో లేరనడం అతిశయోక్తి కాబోదు. మరోవైపు, ప్రత్యర్థి నేతలిద్దరికీ మొదటి రెండు అర్హతలు ఎంతమాత్రం లేవు. రేవంత్‌కు పాపులారిటీ దండిగా ఉన్నా, ఓటుకు నోటు కేసు, చంద్రబాబు శిష్యరికం, రెండూ వ్యతిరేకాంశాలుగా పనిచేయవచ్చు. వాడివేడి విమర్శనాస్త్రాలు సంధించడంలో సంజయ్‌కు పేరున్నా ఆయనలో రాజకీయ పరిపక్వత తగినంత లేదనే విషయాన్ని బీజేపీ నేతలే ఒప్పుకునే పరిస్థితి ఉంది.

కేటీఆర్‌ను సీఎం చేస్తే పార్టీలో అసమ్మతి పెరుగుతుందని, హరీశ్, ఈటల వంటి సీనియర్లు ఈ మార్పిడికి వ్యతిరేక స్వరం వినిపించడం వల్లే ఆయా సందర్భాలలో కేసీఆర్ వెనక్కి తగ్గుతున్నారన్నది ఒక వాదన. జాతీయ రాజకీయాలలో ప్రస్తుతం కేసీఆర్‌కు తగిన భూమిక లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు. అయితే, కుమారుడిని సీఎం చేసేందుకు కూడా ఆయన వద్ద అంతకంటే బలమైన కారణాలే ఉన్నాయి. రాహుల్‌ను వారసునిగా తీసుకురావడంలో సోనియాగాంధీ చేసిన పొరపాటును కేసీఆర్ ఇప్పటికే గుర్తించివుంటారు. ఆ మాత్రం వ్యూహచతురత లేకుండానే ఆయన ఈ స్థాయికి వచ్చివుండరు.

కేసీఆర్ కుటుంబంలో వారసత్వంపై చర్చ ఉద్యమకాలం నుంచీ ఉంది. టీఆర్ఎస్ ఏర్పడిన కొత్తలో మేనల్లుడు హరీశ్‌రావు ఉద్యమంలో ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత 2006లో తెలంగాణ జాగృతి పేరిట కవిత రంగంలోకి దిగారు. సంస్కృతి పరిరక్షణ నినాదంతో ఊరూరూ తిరిగి ప్రజాదరణ సంపాదించుకున్నారు. 2007లో అమెరికా నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ ఆ వెంటనే రాజకీయ రంగప్రవేశం చేసి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పుడే అన్నాచెల్లెళ్ల మధ్య వారసత్వ వివాదం కుటుంబసమస్యగా మారిందని సన్నిహితులు చెప్తుంటారు.

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకొని రాజధాని వరకు ఆ పార్టీ శ్రేణులలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ముందు కినుక వహించిన నేతలు కూడా చివరకు ప్రమాణస్వీకారానికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణ తల్లి సోనియమ్మేనంటూ రేవంత్ చేసిన ప్రసంగం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఒకరకంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదిన సంకేతాలు కనిపించాయి. మోస్ట్ డైనమిక్ లీడర్‌గా పేరున్న రేవంత్ సారథ్యంలో ఆ పార్టీ యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కూడా యువనేత బండి సంజయ్‌ చేతికి పగ్గాలివ్వడం ద్వారా రాబోయే సమరంలో తన కమాండర్-ఇన్-చీఫ్‌ను ప్రకటించింది. ఇక మిగిలిందల్లా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి. 2023 ఎన్నికలలో ఆ పార్టీ ఎవరి నాయకత్వంలో బరిలోకి దిగుతుందో, మెజారిటీ సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుత సీఎం, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు కేసీఆరే నిర్ద్వంద్వంగా ఆ పార్టీకి తిరుగులేని నాయకుడు అయినప్పటికీ, పలుమార్లు ఆయన కుమారుడు కేటీఆర్ తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారని, ముఖ్యమంత్రి అవుతారని వార్తలు రావడం, పలువురు మంత్రులు, ప్రగతిభవన్‌వర్గాలు, కీలక నేతలు సైతం ఆ వార్తలను సమర్థించడం ఈ గందరగోళానికి కారణం.

అప్పటి నుంచే సన్నాహాలు

నిజానికి, కేటీఆర్ సీఎం అవుతారన్న వార్తలు ఆరేళ్ల కిందటే మొదలయ్యాయి. 2016 ఫిబ్రవరి జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేటీఆర్ ఒక్కడే ప్రచార సారథ్యం నిర్వహించడం, కేసీఆర్, కవిత, హరీశ్‌రావు ఆ కేంపెయిన్‌కు దూరంగా ఉండడం ఈ వార్తలకు మూలమని చెప్పవచ్చు. రాజధానిని గెలిచిన ఊపులో కొడుకును సీఎం చేస్తారని అప్పుడు రాజకీయవర్గాలు కోడై కూసాయి. అంతకు నెల ముందు కేసీఆర్ దంపతులు తమ ఫాంహౌజ్‌లో నిర్వహించిన అయత చండీయాగం లక్ష్యం కుమారుడికి అధికార మార్పిడి సాఫీగా సాగేందుకేనని పరిశీలకులు అంచనా వేసారు. కేసీఆర్ కూతురు కవిత సైతం ఆ యాగం ముగింపు దశలో తండ్రి వారసత్వం తన అన్నదేనని స్పష్టం చేసారు. అయితే, ఎందుకనో అప్పుడు ఈ అంశం వాయిదా పడింది. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా తిరిగి ఈ విషయం తెర పైకి వచ్చింది. ఊహించని విధంగా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడంతో మళ్లీ వదంతులు షికార్లు చేసాయి. ఈసారి కేటీఆర్‌నే సీఎం చేస్తారని కొన్నిరోజులు, ఓ ఆరునెలలు పాలించిన తర్వాత కొడుక్కు అప్పగిస్తారని మరికొన్ని రోజులు వార్తలు వచ్చాయి. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ తాను జాతీయ రాజకీయాలకు వెళతానని, ఇకముందు ఢిల్లీ కేంద్రంగానే పనిచేస్తానని ప్రకటించడం, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్‌లాంటి నేతలతో కేసీఆర్ సమావేశమవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే, ఆ ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం, ప్రతిపక్షాలు బొక్కబోర్లా పడడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి.

ప్రచారం ఊపందుకుని

తిరిగి 2021 ఆరంభంలో మరోమారు కేటీఆర్ సీఎం కానున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈసారి స్వయంగా మంత్రులే ఆ విషయాన్ని ప్రకటించడం, అదీ కేటీఆర్ సమక్షంలో కూడా జరగడంతో దాదాపు అందరూ విశ్వసించారు. ప్రధాన స్రవంతి మీడియా పతాక శీర్షికలలోనే ఆ విషయాన్ని ప్రచురించాయి. దాదాపు నెల రోజులు కొనసాగిన ఈ ప్రచారం చివరకు జీహెచ్ఎంసీకి ఎన్నికైన కార్పొరేటర్లతో జరిపిన సమావేశంలో కేసీఆర్ స్పష్టతనివ్వడంతో ముగిసింది. ఇంకా పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి తానే సీఎంగా ఉంటానని, తన ఆరోగ్యానికి ఢోకా లేదని ఆయన ప్రకటించారు. తదుపరి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. అయినప్పటికీ, కేటీఆర్ సీఎం కాబోవడం లేదంటే ఈ రాష్ట్రంలో నమ్మేవాళ్లు చాలా తక్కువ. అదే ఆయన పట్టాభిషక్తుడవుతున్నాడంటే ఎవరైనా ఇట్టే నమ్ముతారన్నది అందరికీ తెలిసిన విషయం.

ఆనాటి నుంచే చర్చ

ఇందుకు కారణాలు అనేకం. కేసీఆర్ కుటుంబంలో వారసత్వంపై చర్చ ఉద్యమకాలం నుంచీ ఉంది. టీఆర్ఎస్ ఏర్పడిన కొత్తలో మేనల్లుడు హరీశ్‌రావు ఉద్యమంలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత 2006లో తెలంగాణ జాగృతి పేరిట కవిత రంగంలోకి దిగారు. సంస్కృతి పరిరక్షణ నినాదంతో ఊరూరూ తిరిగి ప్రజాదరణ సంపాదించుకున్నారు. 2007లో అమెరికా నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ ఆ వెంటనే రాజకీయ రంగప్రవేశం చేసి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పుడే అన్నాచెల్లెళ్ల మధ్య వారసత్వ వివాదం కుటుంబసమస్యగా మారిందని సన్నిహితులు చెప్తుంటారు. తెలంగాణ సాధన తర్వాత 2014 ఎన్నికలలో కవిత ఎంపీగా గెలిచి ఢిల్లీ రాజకీయాలకు పరిమితం కాగా, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. సహజంగానే రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి, ప్రజాదరణ బాగా పెరిగింది. అయత చండీయాగం ముగింపులో అన్న నాయకత్వాన్ని కవిత అంగీకరించడం, మొదట కొంత కినుక వహించిన మంత్రి హరీశ్ కూడా దారిలోకి రావడంతో ఇక కాబోయే సీఎం కేటీఆరే అన్న విషయం తేటతెల్లమైంది. బాధ్యతలు ఎప్పుడు స్వీకరిస్తారన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నది మాత్రం రాజకీయ పరిశీలకుల ఏకాభిప్రాయమని చెప్పవచ్చు.

ఆ సంగతి గుర్తించారా?

కేటీఆర్‌ను సీఎం చేస్తే పార్టీలో అసమ్మతి పెరుగుతుందని, హరీశ్, ఈటల వంటి సీనియర్లు ఈ మార్పిడికి వ్యతిరేక స్వరం వినిపించడం వల్లే ఆయా సందర్భాలలో కేసీఆర్ వెనక్కి తగ్గుతున్నారన్నది ఒక వాదన. జాతీయ రాజకీయాలలో ప్రస్తుతం కేసీఆర్‌కు తగిన భూమిక లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు. అయితే, కుమారుడిని సీఎం చేసేందుకు కూడా ఆయన వద్ద అంతకంటే బలమైన కారణాలే ఉన్నాయి. రాహుల్‌ను వారసునిగా తీసుకురావడంలో సోనియాగాంధీ చేసిన పొరపాటును కేసీఆర్ ఇప్పటికే గుర్తించివుంటారు. ఆ మాత్రం వ్యూహచతురత లేకుండానే ఆయన ఈ స్థాయికి వచ్చివుండరు. విదేశీ మూలాలున్నాయనే కారణంతో తనకు ప్రతిపక్షాలు అడ్డుతగిలిన నేపథ్యంలో 1991లో పీవీని ప్రధాని చేసిన సోనియా, 2004లో లేదంటే కనీసం 2009లోనైనా కుమారుడిని కుర్చీపై కూర్చోబెట్టి వుండాల్సిందన్న అభిప్రాయం రాజకీయవాదులలో బలంగా ఉంది. అప్పటికి రాహుల్‌ ఎంపీగా గెలవడమే కాకుండా పార్టీ వ్యవహారాలలో నిమగ్నమైవున్నాడు కూడా. అధికారంలో ఉండగానే వారసత్వ మార్పిడి జరగడం సరైందని రాజుల కాలం నుంచీ మనకు చరిత్ర చెబుతోంది. తను చేసిన బ్లండర్‌ను ఇప్పటికే సోనియా గుర్తించినా, ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితులలో ఆమె చేయగలిగింది ఏమీలేదు.

వారికంటే నయమే కదా!

రెండు ప్రధాన ప్రతిపక్షాలు యువనేతలను ముందుపీఠికన నిలబెట్టి వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్న ఈ తరుణంలో కేసీఆర్ తన కుమారుడి విషయమై ఓ నిర్ణయానికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌తో పోల్చితే కేటీఆర్‌కే ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. గత ఏడేళ్లుగా ఆయన మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహిస్తూ సమర్థ పాలకునిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణకు వేల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించారు. రాష్ట్రసాధన ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఆయన పేరు తెలియని ఓటరు రాష్ట్రంలో లేరనడం అతిశయోక్తి కాబోదు. మరోవైపు, ప్రత్యర్థి నేతలిద్దరికీ మొదటి రెండు అర్హతలు ఎంతమాత్రం లేవు. రేవంత్‌కు పాపులారిటీ దండిగా ఉన్నా, ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు శిష్యరికం, రెండూ వ్యతిరేకాంశాలుగా పనిచేయవచ్చు. వాడి వేడి విమర్శనాస్త్రాలు సంధించడంలో సంజయ్‌కు పేరున్నా ఆయనలో రాజకీయ పరిపక్వత తగినంత లేదనే విషయాన్ని బీజేపీ నేతలే ఒప్పుకునే పరిస్థితి ఉంది.

ఈ అన్ని విషయాలను కేసీఆర్ బేరీజు వేసుకుని తగిన నిర్ణయం తీసుకుని, వచ్చే రెండేళ్లలో సమర్థుడైన సీఎంగా నిరూపించుకునేందుకు కేటీఆర్‌కు అవకాశం ఇస్తారేమో చూడాలి. తెలంగాణ తెచ్చిన పెద్దగా గౌరవం అందుకుంటూ పార్టీని నడిపే బాధ్యతను ఆయన స్వీకరించవచ్చు. లేదంటే గతంలో సోనియాగాంధీ చేసినట్లుగా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసే పదవిలో కూడా కొనసాగవచ్చు. ఇక, జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొనే ఆప్షన్ ఆయన ఎదుట ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కేసీఆర్ ఆలోచన ఎలా ఉంది, వారసత్వంపై భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రేవంత్, సంజయ్‌ బహుముఖ దాడిని ఎలా ఎదుర్కొంటారు, ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి కొత్త పథకాలు తెస్తారు, రాష్ట్ర రాజకీయాలు ఏ దిశగా టర్న్ తీసుకుంటాయన్నది రానున్న రోజులలో తేలిపోతుంది.

డి. మార్కండేయ

Advertisement

Next Story