గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

by Ravi |   ( Updated:2023-01-10 02:20:08.0  )
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
X

పుస్తకం హస్తభూషణమన్నారు మన పెద్దలు. పుస్తక పఠనం ద్వారా జ్ఞాన సంపదతో పాటు మానసికాభివృద్ధి జరుగుతుందని మన పూర్వీకులు ప్రగాఢంగా విశ్వసించేవారు. పుస్తకాలు జ్ఞాన భాండాగారాలైనప్పటికీ అన్ని పుస్తకాలను వ్యక్తిగతంగా సేకరించడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు చక్కటి పరిష్కారమే గ్రంథాలయం. గ్రంథాలయ విశిష్టతను ప్రజలకు తెలియజేయడం కోసమే ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతారు. ఇటీవల జరిగిన బుక్ ఫెయిర్ సైతం పుస్తక ప్రియులను అలరించింది. ఇంతటి విశిష్టత ఉన్న గ్రంథాలయాల ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడానికి

పుస్తకాలు చదవడానికి పాఠకులు తప్పనిసరిగా గ్రంథాలయాలకు వెళ్ళాల్సిందే. అలా కాకుండా సంచార గ్రంథాలయాల ద్వారా పాఠకుల వద్దకే పుస్తకాలు రావడం తెలిసిందే, దీనిని రూపొందించిన ఘనత 'కనకసభై పిళ్ళై'ది. ఆయన స్వతహాగా ప్రభుత్వ ఇంజనీర్ అయినా, మారుమూల ప్రాంతంలో గ్రంథాలయాలు లేకపోవడాన్ని గుర్తించి రైతుల వ్యవసాయం, తేనెటీగల పెంపకం, కుటీర పరిశ్రమల స్థాపనకు మెలకువలు తెలుసుకోవడం కోసం పుస్తకాలు కావాలని గ్రహించి వాటిని అక్కడికి తీసుకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ఎద్దుల బండిని రూపొందించారు. దేశంలోనే ప్రథమంగా ఈ సంచార గ్రంథాలయాన్ని 21 అక్టోబర్ 1931 న తమిళనాడులో గ్రంథాలయాల పితామహుడిగా పేరుగాంచిన డా.ఎస్ ఆర్ రంగనాథన్(rs ranganathan) ప్రారంభించారు. పుస్తకాల విశిష్టతను తెలియజేయడానికి ఆయనే కాక వాకింగ్ లైబ్రరీగా పిలిచే 'రాధా మణి'(radhamani) సైతం ఎంతో కృషి చేశారు. ఆమె పుస్తక ప్రియులకు పుస్తకాలు అందించడానికి ప్రతి రోజు 6 కిలోమీటర్లు నడుస్తుంది.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు లైబ్రరీకి రావడంలేదని లైబ్రరీనే వారి వద్దకు తీసుకువెళ్ళేలా 'ది కేరళ స్టేట్ కౌన్సిల్ లైబ్రరీ' కృషి చేస్తోంది. వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచడానికి 'వుమెన్ రీడింగ్ ప్రాజెక్ట్'కు శ్రీకారం చుట్టి 'వాకింగ్ లైబ్రేరియన్' పదవిని సృష్టించి రాధామణిని నియమించారు. ఇప్పుడు దీనిని 'బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ ఆఫ్ వుమెన్ ఆండ్ ఎల్డర్లీ'గా మార్చారు. ఇప్పుడు మహిళలే కాదు యువకులు పెద్దవారు సైతం ఈమె వద్ద పుస్తకాలు తీసుకొని చదువుతున్నారు. దీంతో పాటు సామాజిక బాధ్యతలోనూ ఆమె తలమునకలయ్యారు. కొండ ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్ళి పుస్తకాలు పంచేవారు. దీనిని ఆమె గత పదకొండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలోనూ దీనిని ఆపలేదు. ఆమె వద్ద నమోదు చేసుకున్న దాదాపు నూట పది మంది సభ్యులలో తొంబై ఐదు మంది మహిళలే కావడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలు ఏర్పరచి

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమానికి అయ్యంకి వెంకట రమణయ్య నాంది పలుకగా పాతూరి నాగభూషణం దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి గ్రంథాలయాల ఏర్పాటు, కృషికి ఐదు దశాబ్దాల పాటు కృషి చేశారు. ప్రజలలో పుస్తక పఠనంపై ఆసక్తి రేకెత్తించడానికి ఆయన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనే 'పడవ గ్రంథాలయాలు'. మొదటగా దీనిని పెదవడ్లపూడి-కొల్లూర్ మధ్య అక్టొబర్ 1935 న ప్రారంభించారు. రెండవది అదే సంవత్సరం నవంబర్‌లో ప్రారంభించారు. నాగభూషణం ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రంథాలయ చట్టం ముసాయిదా రూపకల్పనలో ఒక సభ్యుడు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో శాఖలు ఏర్పాటు చేయడమే కాక వాటి కార్యక్రమాల బలోపేతానికి కోట్ల రూపాయల స్థిరాస్తులను సేకరించి పెట్టారు.

దేశంలోనే ఏకైక లైబ్రరీ సైన్స్ మాసపత్రికగా పేరొందిన 'గ్రంథాలయ సర్వస్వం' కు 36 సంవత్సరాలు సంపాదకులుగా పనిచేశారు. అలాగే 1966 లో ఆయన ప్రారంభించిన లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోర్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు లభించింది. మనదేశంలోనే కాదు కెనడాలోనూ ఇలాంటి వారు ఉన్నారు. కెనడాలోని 'కాల్గరీ పబ్లిక్ లైబ్రరీ' 1912 న ఐదువేల పుస్తకాలతో ప్రారంభమయింది. ఇందులో నెల్లీ బేఫస్ అనే 91 ఏళ్ల మహిళ 45 సంవత్సరాలుగా సేవలందించింది. అయితే ఇంటి నుంచి కదలలేని వారు, ఆరోగ్య సమస్యల కారణంగా లైబ్రరీని సందర్శించలేని వారికి పుస్తకాలు అందించడానికి వయోజన స్వచ్ఛంద వాలంటీర్ కావాలన్న ప్రకటన ఆమెను ఆకర్షించింది. అందుకే 91 ఏళ్ల వయసులోనూ పాఠకులకు పుస్తకాలు అందించేందుకు వెళ్లారు.

సాంకేతికతను ఉపయోగించుకొని

మారుతున్న కాలానుగుణంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్& ఇండస్ట్రీస్ 2013లో ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల మనదేశంలో నాణ్యమైన విద్య అందించడానికి 20 సంవత్సరాలలో ప్రతి నెల ఆరు యూనివర్సిటీలు, 270 కొత్త కాలేజీలు ఏర్పాటు చేయవలసి ఉంటుందని అభిప్రాయపడింది. ఇది కాస్త ఆలస్యమయ్యే ప్రక్రియ కావడంతో అప్పటివరకు భారత ప్రభుత్వ విద్యాశాఖ సౌజన్యంతో ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసిన డిజిటల్ పోర్టల్ అయిన httpsndl.iitkgp.ac.in లో లాగిన్ అయ్యి మన దేశంతో పాటు విదేశాల లోని వందలాది లైబ్రరీలలో డిజిటల్ మాధ్యమంలో పొందుపరచిన వివిధ భాషల పుస్తకాలు, విడియోలు, పరిశోధనా పత్రాలు అధ్యయనం చేయవచ్చు.

నేటి యువతరంలో చదువుపై ఆసక్తి లేని వారు కొందరు, ఆర్థిక సమస్యలు, సౌకర్యాల లేమి సాకుగా చూపి పుస్తకానికి దూరం అవుతున్న యువత నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంతోపాటు దేశాభివృద్ధికి కృషి చేయాలి.

యేచన్ చంద్రశేఖర్

8885050822

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

317 జీఓ బాధితులకు న్యాయం జరిగేనా?


Advertisement

Next Story