ఎన్నికల పాఠాలు...గుణపాఠాలు

by Ravi |   ( Updated:2023-12-07 00:30:53.0  )
ఎన్నికల పాఠాలు...గుణపాఠాలు
X

మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 64 మెజారిటీ స్థానాలు కట్టబెట్టి సమర్థవంతంగా పరిపాలించమని ప్రజాతీర్పునిచ్చారు. మరి మెజారిటీ స్థానాల్లో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కూడా అంతే ఉండాలి.

నిరంకుశ పాలనను చూసి..

రానున్న రోజులలో కొత్త ప్రభుత్వం శ్రద్దలతో, ప్రణాళికబద్ధంగా, మార్గదర్శకంగా ఉద్యోగ అవకాశాలను కల్పించి యువతను తద్వారా రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధి సాధించేలా ఉండాలి! ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలన లాంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పకడ్బందీగా అమలు చేయడంలో ఈ మెజారిటీని ఉపయోగించుకోవాలి. అంతేకానీ, ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపునకో, ఇష్టారీతిన అధికార వినియోగానికో, ఒక మతాభివృద్ధికో, స్వప్రయోజనాలకో, పార్టీ ప్రయోజనాలకో కాకూడదు. మన యుద్ధం సంపద కోసమో, అధికారం కోసమో కాదు.. మన యుద్ధం స్వేచ్ఛ, మానవ వ్యక్తిత్వ పునరుద్ధరణ కోసం’ అని అంటారు డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్. మరీ నేడు తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పౌరుల అభివృద్ధికి పాటుపడటంలో పాలకులకు ‘నైతిక బాధ్యత అనే స్పృహ, ప్రజాక్షేమం అనే ధ్యాస’ కచ్చితంగా ఉండాలి. అభివృద్ధి అంటే సమాజంలో ఉన్న ప్రజల సమిష్టి ప్రయోజనాల అభ్యున్నతికై కృషి చేసి చూపించటం. రైతుల సమస్యలను పరిష్కరించి వారి 'ఆత్మహత్యలు' జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. అలాగే, పెరిగిపోయిన నిరుద్యోగ స్థాయి, 'సామాజిక న్యాయం' వీటికి పరిష్కార మార్గాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది.

ఉద్యమకాంక్షకు ప్రతిఫలం అయిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన, అభివృద్ధి పేరు మీద ప్రచార పర్వం కొనసాగిందన్నది సుస్పష్టం. అధికారం కేవలం ముఖ్యమంత్రి స్థాయిలోనే కేంద్రీకృతం కావటం, పార్టీపై తిరుగులేని పెత్తనం, సమిష్టి ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకు పూనుకోవటం, మిగతా వారి సమస్యలను, సాధకబాధకాలను పెడచెవిన పెట్టడం లాంటి నిరంకుశ పోకడలను గమనించాము. రాష్ట్ర నవ సమ సమాజ నిర్మాణంలో కేవలం అధికారపక్ష నిర్ణయాలకే పెద్దపీట వేయడం, ప్రతిపక్షాల నిర్మాణాత్మక విమర్శలను బేఖాతరు చేయడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినవారిపై ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ప్రజాస్వామ్య ఉద్యమ పోరాటాన్ని నిరంకుశ పాలనతో అవమానించటం ప్రత్యక్షంగా చూసాం.

అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం..

పాలన విధానాలలో, కేబినెట్ మంత్రివర్గ నిర్ణయాలలో కూడా ముఖ్యమంత్రిది ఏకపక్ష స్వభావమే. అలాగే ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. ప్రజలు తమ నిరసనను తెలియజేసే ‘ధర్నాచౌక్’ను మూసివేయటం అప్రజాస్వామికంగా తీసుకున్న నిర్ణయం. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ‘ప్రజా దర్బారు’ని ఎత్తివేయటం, తనను కలవాలనుకున్న వారికన్న తను కలవాలనుకున్న వారినే అనుమతించటం గమనార్హం.గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు రావాల్సిందే. ఇంకా చెప్పాలంటే అధికారం ముఖ్యమంత్రి స్థాయిలో కేంద్రీకృతం కావటం వలన ముఖ్యమంత్రి కార్యాలయం మునుపెన్నడూ లేనంత బలంగా తయారై సామాన్య ప్రజల మన్ననను కోల్పోయింది. ఇవన్నీ కూడా ఒక రకంగా బీఆర్ఎస్‌కి ప్రజలు గట్టిగ చెప్పిన గుణపాఠాలే.

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లో సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, భిన్నాభిప్రాయాలు తెలియజేసే స్వేచ్ఛ ఉండటం మంచిదే. రాష్ట్రమంతా సమ్మిళిత వృద్ధి అనేది జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలి. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని ప్రతిబింబించేలా చేయడం లో శ్రద్దవహిస్తే ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అభివృద్ధి అనేది నిరంకుశ ధోరణితోనో, నిర్మాణాల నమూనాలతోనో జరిగేది కాదు. సమ సమాజ నిర్మాణానికి సమిష్ఠి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమిష్టి నిర్ణయాలతో వాస్తవ సామాజిక అభివృద్ధిని ప్రతిబింబించే ప్రణాళికతో ముందడుగు వేయటంతోనే సాధ్యపడుతుంది. కొత్త ప్రభుత్వం రూపొందించే ఎటువంటి అభివృద్ధి పథకమైన కార్యక్రమమైన ‘ఆవశ్యకత’, ‘నిబద్ధత’, ‘నిర్మాణాత్మకత’ అను మూడు ప్రధాన అంశాలను కూడా కలిగి ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లోపించిన అది లోపభూయిష్టంగా తయారవుతుంది. ఈ అంశాల ఆధారంగా ప్రభుత్వ పాలన కొనసాగి ఇచ్చిన ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేయాలి.

-డా. చాకేటి రాజు

పొలిటికల్ అనలిస్ట్

96250 15131

Advertisement

Next Story

Most Viewed