కూచిపూడి నాట్య పంచరత్నాలు

by Ravi |   ( Updated:2024-03-22 00:30:56.0  )
కూచిపూడి నాట్య పంచరత్నాలు
X

కూచిపూడి నాట్యం పేరైన, మారుమూల గ్రామంలో పుట్టి పెరిగినవాళ్లు, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజధానిలో ఉంటూ అదే నృత్యానికి గురువులుగా కొనసాగుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఘనత రాజారెడ్డి, రాధారెడ్డిలకు చెందుతుంది.

తెలంగాణలో వెనుకబడిన పూర్వ ఆదిలాబాద్ జిల్లా వారిది. నిర్మల్ సమీపంలోని గాజుల నర్సాపూర్ అనే గ్రామం రాజా రెడ్డి స్వస్థలం కాగా బైంసా దగ్గరి కోటల్ గాం రాధారెడ్డి ఊరు. వారి వివాహం తర్వాత భర్త అడుగుల్లో అడుగులేసి ఆమె కూడా నాట్యాచారిణిగా మారారు.

2023 సంవత్సరానికి కేంద్ర సంగీత అకాడమీ నాట్యానికిచ్చే జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం 'అకాడమీ రత్న'కు రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు ఎంపికయ్యారు. ఏటా కేంద్ర సంగీత అకాడమీ ఇచ్చే అవార్డుల్లో అకాడమీ రత్న అత్యున్నతమైనది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి, 6న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గ్రహీతలకు అకాడమీ అవార్డులను అందజేశారు. ఇది వరకే ఈ నృత్య జంటకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి.

కుగ్రామం నుంచి ప్రపంచ స్థాయికి...

అందరి పిల్లల్లా ఊర్లో ఆడుతూ పాడుతూ తిరిగే రాజారెడ్డిని చిన్నప్పుడే తమ ఊర్లో ప్రదర్శించే కూచిపూడి భాగవతం ఆకట్టుకుంది. ఆ నృత్యరీతుల పట్ల ఆయన పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. ఆ రోజుల్లో నిజామాబాద్ నుంచి వచ్చే నాట్య బృందాలు చుట్టూ ఊర్లలోనూ ప్రదర్శనలు ఇచ్చేది. వారు ఎక్కడికెళితే చూడడానికి అక్కడికి వెళ్ళేవాడు. అలా కూచిపూడి పట్ల పెరిగిన అనురక్తే జీవిత గగనమైపోయింది. ఉస్మానియాలో డిగ్రీ పూర్తి కాగానే రాజారెడ్డి హైదరాబాద్ లో కూచిపూడి నాట్య కళాశాలలో చేరి డిప్లొమా పూర్తి చేశాడు. పెళ్లి అయ్యాక భర్త కనబరుస్తున్న ఆసక్తిని గ్రహించిన రాధారెడ్డి తాను కూడా అదే డిప్లొమా పూర్తి చేశారు.

గురువుల కాళ్లు పట్టుకుని..

ఆ తర్వాత వారిరువురు నాట్యంలో మరింత ప్రావీణ్యత కోసం ఏలూరు సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళా క్షేత్రానికి వెళ్లారు. వారి ఊరు, పేరు చూసి 'మీ వల్ల కాదు, పొమ్మన్న గురువుల కాళ్ళు పట్టుకొని ఒప్పించాం' అని రాజారెడ్డి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అక్కడ వేదాంతం ప్రహ్లాద శర్మ శిష్యరికంలో నాట్యంపై పట్టు సాధించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపకార వేతనంతో ఢిల్లీకి వెళ్లి ప్రముఖ నాట్య చారిణి, శిక్షకురాలైన మాయారావు దగ్గర శిక్షణ పొందారు. ఒక నృత్యోత్సవంలో వీరి ప్రదర్శన చూసిన ఆనాటి పర్యాటక మంత్రి కరణ్ సింగ్ 1970లో నెహ్రూ జయంతి ఉత్సవాల్లో వీరికి అవకాశం ఇచ్చారు. వారి ప్రతిభను స్వయంగా తిలకించిన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ జంటకు ఢిల్లీలో ఒక నివాస గృహాన్ని కేటాయించారు. ఆదిలాబాద్‌లో పుట్టి పెరిగిన జంట తమ ప్రతిభనే సోపానం చేసుకొని ఆనాటి నుంచి దేశ రాజధానిలో స్థిరపడ్డారు.

కుటుంబమంతా నృత్యంతోటే...

రాజారెడ్డి, రాధారెడ్డిలకు పిల్లలు లేనందున రాధారెడ్డి సొంత చెల్లెలు కౌసల్యారెడ్డిని రాజారెడ్డి వివాహమాడారు. వీరికి యామిని, భావన అనే ఇద్దరు అమ్మాయిలు కలిగారు. ప్రస్తుతం ఈ అయిదుగురి జీవితాలు కూచిపూడి నృత్యానికి పెనవేసుకున్నాయి. 1980లో ఢిల్లీలో వారు స్థాపించిన 'నాట్య తరంగిణి' అనే కూచిపూడి శిక్షణ కేంద్రం నిర్వహణలో కుటుంబమంతా నిమగ్నమై ఉంది. ఆ సంస్థ ద్వారా కూచిపూడి నృత్యంతో పాటు సంగీతం, యోగ, సంస్కృతం కూడా నేర్పుతున్నారు. ఇందులో ఒక మినీ ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, వసతి గృహాలు ఉన్నాయి.

శిలా నీవే.. శిల్పి నీవే .. శిల్పం నీవే..

2001లో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం రాజారెడ్డి, రాధారెడ్డి ఇద్దరికీ ఒకేసారి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 2010 కామన్వెల్త్ క్రీడల సందర్భంగా ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో వీరు పాల్గొన్నారు. వివిధ దేశాలు తమ వద్ద కూచిపూడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని వీరిని ఆహ్వానించారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రియా, బ్రిటన్, బంగ్లాదేశ్, సింగపూర్, కువైట్, మలేషియా దేశాల్లో వీరి ప్రదర్శనలు ప్రశంసలు పొందాయి. శిలా నీవే.. శిల్పి నీవే .. శిల్పం నీవే.. అనే మాటకు ముమ్మూర్తులా ప్రతిరూపాలు ఈ పంచ రత్నాలు.

-బి. నర్సన్

94401 28169

Advertisement

Next Story

Most Viewed