- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుద్దపూస మాటలు ఇప్పుడెందుకు..?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెబుతున్నట్టుగా అబద్ధం ముందు అభివృద్ధి ఓడింది అనేదంతా వట్టి డంబాచారమే. బిఆర్ఎస్ పార్టీ పేరు మార్పుతో పెద్దగా ఏమీ జరగలేదు. ఒకరా ఇద్దరా... అధినాయకమాన్యులు అందరూ, ప్రజల పట్ల అనుసరించిన సాచివేత విధానాల వల్లనే బీఆర్ఎస్ పార్టీని కట్టేపెట్టి లేపినా ఇప్పట్లో లేవలేని దుస్థితి ఏర్పడింది. తామే పతనానికి కారణమనే జ్ఞానోదయం అధినాయకులకు కలగనంతవరకు ఇంతే సంగతులు.
ఒడ్డు కింద ఒక వరుస, ఒడ్డు ఎక్కితే మరో వరుస పెట్టి పిలిచే బీఆర్ఎస్ అధినాయకుడితో పాటు, కుటుంబ సభ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వారి వారి బంధువుల నడవడికలు, పోకడలే ఈ దుస్థితికి పార్టీ దిగజారడానికి ప్రధాన కారణం. అంతేగాక అభివృద్ధి పేరున జరిగిన అనేక అవకతవకలు, బినామీ లావాదేవీలు, మితిమీరిన అహంకారం, తల బిరుసుతనం, ప్రజలంటే లెక్కలేనితనం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కూడా మరో కారణం. దాదాపు పదేళ్ల పరిపాలన తీరు తెన్నులు, ప్రభావాలు, ప్రలోభాలు అన్నీ కలిసి ఓటమికి దారితీశాయి.
ముందుంది మొసళ్ల పండుగ
తమకు తమ పార్టీకి జీవగంజి అనుకునే పార్లమెంటు ఎన్నికల్లో సైతం కటికచేదు ఫలితం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇది అంతా తెలంగాణ ప్రజల సంపదను దోచిన సొమ్మే అని ఓటర్లు రూఢీగా నమ్ముతున్నారు. నిర్మొహమాటంగా చెప్పాలంటే ఇకముందు అధినాయకుడు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జీవన్మరణ సమస్యను అడుగడుగునా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు తప్పులు ఒప్పుకున్నా పదేళ్లు చేసిన నిర్వాకాన్ని ప్రజల మనోఫలకం నుంచి ఇప్పట్లో తొలగించలేరు. అవసరం ఉంటే మన ఇంటికి తలుపు కొట్టకుండా వచ్చి కూర్చుంటారు. అదే జనానికి అవసరమున్నప్పుడు వీరి గేటు కాడికి కూడా రానీయరు. అందుకనే పదేళ్ల తర్వాత ప్రజలకు తమ అభిప్రాయం బ్యాలెట్ ద్వారా చెప్పే అవకాశం రావడంతో టిట్ ఫర్ టాట్‌గా తమ తీర్పుతో బుద్ధి చెప్పారు.
కేసీఆర్ 1980 నుండి 2002 వరకు తనలోని అరాచక మోస స్వభావ వ్యక్తిత్వాన్ని ఆవుతోలు కప్పుకున్న పులి లాగా సాధు జంతువు రూపంలో అదను కోసం గుంభనంగా దాచుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే అంత వరకు నిద్రాణమై ఉన్న ఆయనలోని వంచకుడు, అవినీతిపరుడు బయటకు వచ్చి ఒక్కసారిగా ఊడలమర్రిలా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తన కుటుంబ సభ్యులే కాక బంధు వర్గం అంతా పునికి పుచ్చుకొని తెలంగాణ సంపదనంతా తోడుకున్నారు.
ప్రజలు చూస్తూనే ఉన్నారు
దీన్ని ప్రజలు గమనించలేదని, అర్థం చేసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. వీళ్ళు సమూలంగా మారుతారా అంటే గత అనుభవాల దృష్ట్యా అది సాధ్యం కాదనే చెప్పాలి. కేసీఆర్ ఆడిస్తుంటే, తెర ముందు ఆడుతూ, చిలుక పలుకులు మాట్లాడే హరీష్. కేటీఆర్, కవిత తెర వెనుక గేట్ పాసులు ఇచ్చే సంతోష్‌లో తెలంగాణ ప్రజలను తిరిగి నమ్మించేందుకు ఎన్ని వేషాలు వేసినా విశ్వసించడం అనుమానమే. కొత్త ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో నెల రోజులు దాటక ముందే బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం, వేలెత్తి చూపడం అహంభావంతో మాట్లాడుతున్న తీరును తదితర హావభావాలను గమనిస్తే ప్రజలకు ఒక విధమైన ఏహ్యభావం కలుగుతుంది. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను, నేను కావలి కుక్కలా ప్రభుత్వానికి రక్షణగా ఉంటాను అని కేసీఆర్ చెప్పిన దంబాచారపు మాటల్ని జనం అప్పుడే మర్చిపోయారనుకుంటే పొరపాటు.
మూఢనమ్మకాలకు, ముహూర్తాలకు పెట్టింది పేరైన కేసీఆర్ పార్టీ పేరు మార్చినప్పటి నుంచి ఆయన వేసే ప్రతి అడుగూ పురోహిత వర్గాలు పెట్టిన ముహూర్త బలాలే కదా! వీరి నాయకులంతా పార్టీ పేరు మార్చడం వల్ల ఏదో తెలంగాణ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోలేకపోయామని కడియం వంటి బుద్ధిమంతుడు కూడా వాపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు కేసీఆర్ ప్రభుత్వం 2014 ఏర్పడ్డ తర్వాత మాది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడే తెలంగాణ పేగు బంధాన్ని కూకటి వేళ్ళతో పెళ్లగించి వేసినట్లయింది.
కరి మింగిన వెలగపండుగా
ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు నిన్న ఇయ్యాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమికి తానే కారణమని రోజుకో సుద్దపూస మాటలు మీడియాకు రంజుగా వండి వారుస్తున్నారు. కొత్త ప్రభుత్వం 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో, చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని కూడా అంటున్నారు. ఇక్కడ నాకు ఒక చిన్నప్పటి విషయం మతిలకు వచ్చింది. రాత్రిపూట ఎందుకైనా మంచిది అని గిన్నెలో పూర్తిగా ఉర్చుకొని తినక, నాలుగు మెతుకులు ఉంచాలె అనేవారు. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు అకస్మాత్తుగా ఆకలితో వస్తే పెట్టడానికి అనే అర్థంతో చెప్పేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిన్నెలో ఒక మెతుకు ఉంచకుండానే ఊడ్చి వేశారనే సంగతి తెలిసిన కేటీఆర్ వారి బృందం అందుకే రోలు వచ్చి మద్దెలతో చెప్పుకున్నట్టు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారు. రైతుబంధు, దళిత బంధులో జరిగిన తప్పులు ఒప్పుకున్నట్టు నమ్మబలుకుతున్నారు. నిజానికి టీఆర్ఎస్ అధికారం వెలగబెట్టిన పదేళ్లలో తెలంగాణ కరి మింగిన వెలగపండుగా చేయబడిందనేది సత్యం. వాస్తవం. నిజం.
-జూకంటి జగన్నాథం
94410 78095