'కథల్' మూవీ రివ్యూ.. పననకాయలు మాయమైతే..!

by Vinod kumar |   ( Updated:2023-06-09 23:45:58.0  )
కథల్ మూవీ రివ్యూ.. పననకాయలు మాయమైతే..!
X

ఒక రాజకీయ నేత ఇంట్లో నగ పోతుంది. ఒక పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో జాతి కుక్క తప్పిపోతుంది. మన దేశంలో ఇవి సాధారణ వార్తలు కావు. కంప్లయింట్ నమోదు చేసుకోకముందే యావత్ పోలీసు బలగం ఈ పనిమీదే తిరుగుతుంటుంది. వాళ్లకు ఇక ప్రపంచంలో ఏ సమస్యలూ కనిపించవు. ఆ నగను, ఆ జాతి కుక్కను వెదికి యజమానులకు అప్పగించేంతవరకు పోలీసు శాఖకు నిద్రాహారాలుండవు. సగటు మనుషుల విలువైన వస్తువులు పోతే ఇక అంతే సంగతి అని మనకు బాగా తెలుసు. కానీ నేతల ఇంట్లో నగపోతే తంటాలుపడి అలాంటి నగనే రీప్లేస్ చేయడానికి డిపార్ట్‌మెంటుకి ఒక అవకాశం అంటూ ఉంటుంది. కానీ తమ ఉన్నతాధికారి జాతి కుక్క తప్పిపోతే.. అది కనిపించేంతవరకు, వెదికి పట్టుకునేంతవరకు సంబంధిత ఏరియా పోలీసు విభాగానికి నరకం కనబడుతుంటుంది. కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో పనస చెట్టుకు కాసిన రెండు అరుదైన పనస కాయలు పోతే.. ఆ కాయలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి బహుమతిగా అందించడానికి ఉద్దేశించినవైతే.. ఏం జరుగుతుంది అనే ఆసక్తికరమైన అంశానికి వెబ్ చిత్రమే 'కథల్'

విచిత్రమైన వస్తువు జాడ..

ఒక విచిత్రమైన వస్తువు తప్పిపోతుంది, కానీ దానిని కనుగొనే క్రమంలో, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన స్వార్థ ఆసక్తి ఉంటుంది. కొందరికి అది పైకి అడుగు పెట్టడానికి నిచ్చెన; కొందరు తమ కలను సాధించుకోవడానికి; ఇతరులకు కేవలం ఒక విచిత్రమైన వస్తువు. కానీ ఆ వస్తువు దొరికితే అది వారికి భారీ బహుమతిని తెస్తుంది. కథల్‌ వెబ్ సినిమాకు ఆజ్యం పోసేది దురాశ. ప్రేక్షకుడు ఊహించని సీరియస్ సంభాషణలోకి ప్రవేశించడానికి మాత్రమే సినిమా జోక్‌గా ప్రారంభమవుతుంది.

సన్యా మల్హోత్రా లీడ్ పాత్రలో నటించిన కొత్త నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'కథల్ - ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ'. ఇటీవలే విడుదలైన సోనాక్షి సిన్హా ప్రైమ్ వీడియో సిరీస్ 'దహాద్' మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ దిగువ కులానికి చెందిన ఇద్దరు మహిళా పోలీసులు. వారి చుట్టూ ఉన్న వ్యవస్థ పనికిమాలినతనం, వారి సహోద్యోగులు, దౌర్జన్య రాజకీయ నాయకుల ఉన్నత కుల దురభిమానం మధ్యలో తమకు తాము నిలబడటానికి ఈ ఇద్దరూ ప్రయత్నిస్తుంటారు. తప్పిపోయిన పనస కాయ గురించి కథల్ ఒక చమత్కారమైన పరిశోధనతో ప్రారంభమైనప్పటికీ, లేడీ ఇన్‌స్పెక్టర్ మహిమా భోసర్, తప్పిపోయిన ఒక అమ్మాయికి సంబంధించిన కేసును పరిశోధించి సక్సెస్ కావటంతో కథను ముగించారు.

అంకుల్ హాంగ్ పసనకాయలు..

ఉత్తర భారతదేశంలోని మోబా అనే చిన్న పట్టణంలో, ఒక ఎమ్మెల్యే తన రెండు పనస కాయలు -జాక్‌ఫ్రూట్స్- (కథల్) తప్పిపోవడంతో ఫిర్యాదును దాఖలు చేశాడు. ఆ అరుదైన పనసకాయలతో పచ్చడి చేసి ముఖ్యమంత్రికి ఇచ్చి ఏదైనా పదవిని చేజిక్కుంచుకోవాలనే స్వార్థ చింతనతో ఉంటాడు. ఈ క్రమంలో ఆ పోలీసు స్టేషన్‌లోని అత్యంత సమర్థురాలైన ఇన్‌స్పెక్టర్ మహిమా బసోత్ (సన్య)కి ఈ కేసును అప్పగిస్తారు. ఆమె కానిస్టేబుల్‌గా పని చేస్తూన్న తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ద్వివేది (అనంత్)తో కలిసి దర్యాప్తు చేయడానికి బయలుదేరుతుంది. జాక్‌ఫ్రూట్స్ కోసం వేట మరింత ముఖ్యమైన కేసుకు దారి తీస్తుంది. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ మహిమా రెండింటినీ పరిష్కరించడానికి తనదైన మార్గాన్ని కనుగొంటుంది.

కథల్ పరిశోధనాత్మక లక్షణాలతో కూడిన సామాజిక నాటకం. అగ్ర కుల ఎమ్మెల్యే పటేరియా (విజయ్ రాజ్) తోట నుండి పనసకాయల చౌర్యం మిస్టరీతో మొదలవుతుంది. అవి కేవలం జాక్‌ఫ్రూట్స్ మాత్రమే కాదు, అంకుల్ హాంగ్ వెరైటీకి చెందినవి, 'అంకుల్ హాంగ్' అనే రకం కాయలు అని వినగానే ఆ చెట్టుపై అంకుల్ హాంగ్ అనే అతను చనిపోయాడా లేదా అతనే దొంగా అనే సందేహంతో క్లూ లేని పోలీసులు ఒక్క క్షణం అయోమయానికి గురవుతారు. ఆ గందరగోళం క్లియర్ అయిన తర్వాత, అసలు కేసును విచారించే అధికారం మహిమకు అప్పగిస్తారు. తప్పిపోయిన పండ్లను, వాటి అహంకారపూరిత యజమాని సమస్యను పరిష్కరించే సమయంలో, మహిమ నిజానికి సరైన కేసులోకి అడుగుపెడుతుంది. పనసకాయల చౌర్యంపై మొదలైన పరిశోధన తప్పిపోయిన జీన్స్ అమ్మాయి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతంతో ముగుస్తుంది.

సన్యా మల్హోత్రా తన పాత్రలను ఎంచుకునే తీరు అభినందనీయం. సోనాక్షి సిన్హా దిగువ కులానికి చెందిన పోలీసు అధికారిణి పాత్రలో అద్భుతంగా నటించిన దహద్ చిత్రం తర్వాత ఈ నెలలో ఒక మహిళ పోషించిన రెండవ పోలీసు పాత్ర ఇది. అణగారిన వర్గానికి చెందిన ఇద్దరు స్త్రీలు, నిచ్చెన ఎక్కడానికి చాలా కష్టపడి తమదైన ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నమే దహద్, కథల్ సినిమాలుగా రూపొందాయి. సానియా, మహిమ పాత్రలో మూస వ్యంగ్య చిత్రాలకు దూరంగా తన ఇన్‌స్పెక్టర్ అవతార్‌కు చాలా మానవీయతను తెస్తుంది. చిత్ర కథలోని చాలా సంక్లిష్టతలను ఆమె లోతుగా పరిశీలించి పరిష్కరిస్తుంది.

కులాహంకారాన్ని ఎత్తిచూపిన చిత్రం..

ఉత్తరాది ఫ్యూడల్ రాజకీయ నేతల కులాహంకారాన్ని కథల్ చిత్రం ఎత్తి చూపింది. దర్యాప్తుకు ఇంటికొచ్చిన లేడీ పోలీస్ బూట్లతో నేరుగా ఇంట్లోకి అడుగుపెడితే విరుచుకుపడతాడా నేత. అడుగడుగునా కుల దర్పంతో దర్యాప్తు అధికారిని అడ్డుకుంటుంటాడు. తనకున్న పరిమితుల్లోనే పనిచేస్తూ, డిపార్టుమెంటులోని ఒత్తిళ్లను ఎదుర్కుంటూ, అమ్మాయిల రవాణాతో ముడిపడిన సమస్య వరకు దర్యాప్తును తీసుకెళ్లడంలో సన్యా మల్హోత్రా అరుదైన నటనను ప్రదర్శించింది. లేడీ పోలీస్ ఆఫీసర్ అంటే పదిమంది గూండాలతో ఫైటింగ్ సీన్ల తర్వాత కూడా చెరగని క్రాఫ్, మడత నలగని యూనిఫాం, ఒంటిమీద చిన్న గాయం కూడా తగలని ఆహార్యం.. ఇవే కదా ఇన్ని దశాబ్దాలుగా మనం చూస్తూ వచ్చిన లేడీ పోలీసు కథా చిత్ర రాజాలు. కానీ అమ్మాయిని అపహరించిన ముఠాతో ఫైటింగ్ సమయంలో సన్యా కానీ, తోటి పోలీసులు కానీ సగటు మనుషుల్లాగే కనిపిస్తారు. ఆ ముఠా మనుషులతో దెబ్బలు తింటారు. ఈ క్రమంలో వారి చేతులు గోక్కుపోతాయి. రక్తం వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే హీరోయిజానికి ఆమడ దూరంలో నిలిచిన దహద్, కథల్ వెబ్ చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం విశేషం.

అమ్మాయిల అక్రమ రవాణాకి చెందిన తీవ్రమైన అంశంతో వ్యవహరించినప్పుడు ఉండాల్సినంత టెంపో సినిమా ద్వితీయార్థంలో లేదనిపించినప్పటికీ, పనికి మాలిన హీరోయిజాలకు దూరంగా, తొడగొట్టడాలకు దూరంగా సాఫ్ట్‌గా సాగిన చిత్రమిది. దగుల్బాజీ గ్లామర్ ప్రదర్శనలకు, అతిశయ నటనలకు దూరంగా కథ కోసం మాత్రమే సినిమా చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్ చిత్రం 'కథల్ - జాక్‌ఫ్రూట్ మిస్టరీ' (Kathal : A Jackfruit Mystery). దాంతోపాటు సోనాక్షి సిన్హా పోలీసు ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించిన దహద్ (Dahaad- ప్రైమ్ వీడియో సీరీస్) కూడా తప్పక చూడవచ్చు. కథల్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

- కె. రాజశేఖరరాజు

73964 94557


Advertisement

Next Story