- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: వర్షం చినుకులు..
చాలా రోజులకి ఆకాశం కరుణించింది. నాలుగు చినుకులు పడ్డాయి. ఆ చినుకుల శబ్దం విని అతను ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు. అతని ఒంటి మీద నాలుగు చినుకులు పడ్డాయి. భూమి మాదిరిగా అతను పులకరించిపోయాడు. మట్టి పరిమళాలు వెదజల్లింది. మల్లెపూలను మించిన ఆ సువాసనతో అతడు పరవశించిపోయాడు.
అతడి మనస్సు ఎక్కడికో వెళ్లిపోయింది. నాస్టాల్జియా అంటే అందరికీ ఇష్టమే. బయటకు అందరూ ఇష్టం లేనట్లు వ్యవహరిస్తారు. అది చీకట్లో బిజిలీ మాదిరిగా ప్రకాశిస్తుంది. మనం నడిచిన దారిలో మళ్లీ ప్రయాణం చేయడమే నాస్టాల్జియా. ఆ జ్ఞాపకాల్లో అందరూ మునకలు వేయాల్సిందే. ఇప్పుడు అతను చేస్తున్నది అదే.
అతనికి చిన్నప్పటి వర్షపు చినుకులు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు అతన్ని వర్షపు చినుకుల్లో తడవనిచ్చేవారు కాదు. ఎవరో ఒకరు అతన్ని లోపలికి తీసుకుని వచ్చేవాళ్లు. పెద్దవాళ్లని మాయ చేసి అతను వర్షంలో తడిసి వచ్చేవాడు. వాళ్ల అమ్మ అతని దుస్తులని విప్పి మందలించేది. ఆవిడ మూడ్ బాగా లేకపోతే ఓ రెండు దెబ్బలు కూడా వేసేది. కోపగించుకునేది. వాటిని అతను ఆనందంగా స్వీకరించేవాడు.
చిన్నప్పుడు అతనికి చినుకులు పడినా సంతోషమే. ముసురు వచ్చినా ఆనందమే. చినుకులు పడితే తడిసి ఆనందించవచ్చు. ముసురు పడితే బడి ఉండకపోయేది. ఇంట్లో ఆడుకోవచ్చు. అదో గొప్ప అనుభూతి. ఆ విషయాలన్నీ అతనికి గుర్తుకొచ్చాయి. ఆ చినుకులతో తడుస్తూ, ఆ జ్ఞాపకాల్లో మునకలు వేస్తున్న సమయంలోనే అతని కోడలు బయటకు వచ్చింది.
''మామయ్యా, వర్షంలో తడవకండి. సర్ది అవుతుంది. జ్వరం కూడా రావచ్చు. లోపలికి రండి'' అంది హెచ్చరికగా. ఆమె స్వరంలో ప్రేమ ఉంది. భయం కూడా ఉంది. ఇంకా నయం నా కొడుకు చూడలేదు. వాడు చూస్తే గట్టిగా అరిచేవాడు అనుకున్నాడు అతను. తన ఆనందాన్ని పక్కనబెట్టి లోపలికి వచ్చాడు. కోడలు ఇచ్చిన టవల్‌తో తల తుడుచుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు.బట్టలు మార్చుకుని కిటికీ నుండి వర్షపు ధారలని చూస్తూ కూర్చుండిపోయాడు.
అతని మనస్సు ఎక్కడికో వెళ్లిపోయింది. తను ఉంటే ఏదో పని ఉన్నట్లు బయటకు వెళ్లి వర్షంలో తడిసి వచ్చేవాళ్లు. ఆమె అమెరికాలో కూతురు ప్రసవం కోసం వెళ్లింది. తనను రమ్మని చాలా బలవంతపెట్టింది. తాను వెళ్లలేదు. మిత్రులు లేకుండా అక్కడ ఉండటం ఇష్టం లేదు. రెండు నెలలైతే ఫర్వాలేదు. ఆరు నెలలు అంటే కష్టం. అదే మాట చెప్పి అతను అమెరికా వెళ్లలేదు.
వర్షం చూస్తుంటే అతనికి చిటపట చినుకులు పాట గుర్తుకొచ్చింది. 'శ్రీ 420'లోని 'ప్యార్ హువా ఇక్రార్ హువా హై, ప్యార్ సె ఫిర్ క్యోం దర్తా హైదిల్' అన్న రాజ్ కపూర్ నర్గీస్ పాట గుర్తుకొచ్చింది.
వర్షాలు, ప్రేమ రెండూ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. 'ఇది ఆత్మల కలయిక' అన్న పాబ్లో నెరూడా కవితా చరణాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. నెరూడా అక్కడితో ఆగలేదు. 'రెండు హృదయాల విభజన' అని కూడా అన్నాడు. వర్షం రెండు హృదయాల కలయిక అన్న మాటలతో ఆయనకు పేచీ లేదు. రెండు హృదయాల విభజన అన్న వాక్యం అతనికి నచ్చలేదు.
ఇప్పుడున్న అతని స్థితి రెండు హృదయాల విభజనని గుర్తుకు తెచ్చింది. తను ఎందుకు ఆమెతో కలిసి అమెరికా వెళ్లలేదని అనుకున్నాడు. తన గది నుంచి బయటకు వచ్చి కొడుకుతో ఇలా చెప్పాడు. ''ఈ వారంలో నేను అమెరికా వెళ్తాను అమ్మ దగ్గరికి. టికెట్ బుక్ చెయ్యి.'' కొడుకు సంతోషంతో తండ్రి వైపు చూశాడు. ఇద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండలేదు కదా అని అనుకున్నాడు.
- మంగారి రాజేందర్ జింబో
94404 83001