- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఫ్రేమ్స్:కష్టకాలంలో కాశ్మీరీ సినిమా
స్వతంత్రంగా సినిమాల నిర్మాణానికి ఉత్సాహవంతులు, కళాకారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అక్కడ నిర్మాణమే కాదు, పంపిణీ, ప్రదర్శన రంగాలలో కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. టాకీసులు మూసేసిన నేపథ్యంలో విడుదల కూడా లేదు. ఇక అశ్విన్‌కుమార్ లాంటి దర్శకులు అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి రూపొందించిన 'నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' లాంటి సినిమా సెన్సార్ కోరలలో చిక్కుకొని ఎనిమిది నెలలపాటు నిలిచిపోయింది. దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించింది. ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి) తో నిర్మించారు. మొత్తం మీద కాశ్మీర్ సినిమా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
'కాశ్మీర్ ఫైల్స్' సినిమాకు సంబంధించి దేశవ్యాప్తంగా అవసరమయిన దానికంటే ఎక్కువే చర్చ జరిగింది. వాద వివాదాలూ చెలరేగాయి. కేవలం ఒక ప్రాపగాండా సినిమాకు సంబంధించి ఇంత ప్రచారం ఇంత హడావుడి ఎందుకో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రధాని నుంచి మామూలు కార్యకర్త దాకా ఈ సినిమాను ఎంతగా ప్రమోట్ చేసారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫలితంగా ఆ సినిమాకు ఊహించనంత ఆర్థిక విజయం లభించింది. ఆ సినిమా తీసుకున్న అంశం మీద, తీసిన సినిమాటిక్ విధానం మీద కూడా అనేక చర్చలు జరిగాయి.నేనిప్పుడు ప్రత్యేకంగా ఆ సినిమా గురించి కాకుండా అసలు కాశ్మీర్‌లో సినిమా ఉందా? ఉంటే ఏ స్థాయిలో మనుగడ కొనసాగిస్తున్నది? అన్న అంశం మీద నాలుగు మాటలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
'మేరి సప్‌నోంకి రాణి కబ్ ఆయేగి తూ' 'కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతా హాయ్ ' 'పర్‌దేశియోసే న అఖియా మిలానా' ఇలా ఒకటేమిటి హిందీ సినిమాకు సంబంధించి అనేకానేక పాటలలోనూ, దృశ్యాలలోనూ కాశ్మీరీ అందాలు వెల్లివిరుస్తాయి. అలనాటి సినిమాలలోని ప్రేమ, రొమాన్స్‌కు కాశ్మీర్ పర్యాయ పదం. అక్కడి అందమైన దృశ్యాలు 'దాల్ లేక్' నీలిదనం, చెట్ల పచ్చదనం, హిమాలయాల తెల్లని మెరుపు ప్రధాన నేపథ్యాలుగా అప్పటి సినిమాలు రూపొందాయి.
అక్కడి నుంచి వచ్చిన నటులు కొందరే
స్వాతంత్ర అనంతర కాలం నుంచి బాలీవుడ్ సినిమాకు లవ్, రొమాన్స్ ప్రధాన ఇతివృత్తాలు. అందుకే కాశ్మీర్ అప్పటి చలన చిత్రకారులకు స్వర్గధామంగా నిలిచింది. జంగ్లీ, కాశ్మీర్‌కీ కలీ, జబ్ జబ్ ఫూల్ ఖిలే 'కభీ కభీ, ఆప్ కీ ఖసం, బాబీ, సిల్‌సిలా, బేతాబ్ ఇలా ఎన్నో సినిమాలు కాశ్మీర్ అందాల్ని అందిపుచ్చుకొని ప్రేక్షకులను అలరించాయి. ఆ కాలంలో సినిమావాళ్లకు కాశ్మీర్ అంటే కేవలం లొకేషన్లు మాత్రమే తప్ప, అక్కడి జీవన పరిస్థితులు, అక్కడి స్థానిక నటులు తదితర అంశాలేవీ పట్టేవి కావు. నిజానికి కాశ్మీర్ నుంచి బాలీవుడ్‌లోకి ఎదిగి వచ్చిన నటులు అతి స్వల్పం. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకప్పటి హీరో రాజ్‌కుమార్ (కుల్ భూషణ్ పండిట్) గురించి. ఆయన 'నీల్‌కమల్' నుంచి అనేక సినిమాలలో హీరోగా నటించి తనదైన ప్రత్యేక సంభాషణల ఒరవడితో నిలదొక్కుకున్న నటుడు.
ఇంకా కాశ్మీర్ నుంచి వచ్చినవాళ్లలో అనుపమ్ ఖేర్, రాజ్ జుత్సి, రాహుల్ భట్, ఆర్కే రైనా, ఎంకే రైనా, రోహిత్ రైనా, ఆమిర్ బషీర్, లలిత్ పరిమో, సోనీ రాజ్‌దాన్ లాంటివాళ్లు కొంత నిలబడగలిగారు. తొలిరోజులలోనే సప్రూ, అతని కొడుకు తేజ్ సప్రూ, జీవన్ అతని కుమారుడు కిరణ్ కుమార్ బాంబే సినిమాలలో స్థానం సంపాదించుకున్నారు. కానీ, అత్యధిక శాతం కాశ్మీర్ కేవలం అందాలకే పరిమితమైంది. తర్వాతి కాలంలో కాశ్మీర్‌లో పెల్లుబికిన ఉగ్రవాదం లాంటి సమస్యల మీద సినిమాలు తీసినప్పటికీ, ఆయా సినిమాలలో కాశ్మీరీ పాత్రలకు కూడా బాంబే నటులే నటించడం చూసాం. కేవలం పఠాన్ పాత్రలకు మాత్రమే కొంత మంది కాశ్మీరీ కళాకారులకు అవకాశమొచ్చేది. అవే కాదు రోజా, దిల్‌సే, మిషన్ కాశ్మీర్, యహా చాహా, రాక్ స్టార్, హైదర్, హైవే, ఫనా లాంటి అనేక సినిమాలు కాశ్మీర్ నేపథ్యంలో వచ్చినప్పటికీ వాటిలో హిందీ తదితర ప్రధాన స్రవంతి నటులే తప్ప కాశ్మీరీ నటీ నటులకు అవకాశాలే రాలేదు.
సినిమా నిర్మాణాలకు ఆటంకాలు
నిజానికి మొదటలో కాశ్మీరీ భాషా చలన చిత్రాల నిర్మాణం కూడా కాశ్మీర్‌లో జరిగింది. అట్లా వచ్చిన మొట్టమొదటి కాశ్మీరీ సినిమా 'మైంజ్ రాత్' 1964 లో విడుదల అయింది. జగజీరాం దర్శకత్వం వహించారు. ఇది ఉర్దూ, కాశ్మీరీ భాషలలో విడుదలయిన ద్విభాషా చిత్రం. తర్వాత 1972లో కాశ్మీరీ కవి మహజూర్ జీవిత చరిత్ర ఆధారంగా 'షాయర్ ఎ కాశ్మీర్ మహ్జార్' సినిమా వచ్చింది. దర్శకుడు ప్రభాత్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ సమాచార శాఖ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. తర్వాత నాలుగు దశాబ్దాలకు కాశ్మీరీ సినిమా 'బాబాజీ' రూపొందింది. జ్యోతి సారూప్ దర్శత్వం వహించిన బాబాజీ కాశ్మీర్‌లో విడుదల కాలేదు. తర్వాత 'ఇన్‌క్విలాబ్' చిత్రం 1989లో నిర్మాణమయినప్పటికీ అప్పటి ఆందోళనకర పరిస్థితులలో అది విడుదల కాలేదు. అప్పటి నుంచి కాశ్మీరీ సినిమా ఉనికే లేకుండా పోయింది.
కాశ్మీర్ ఉగ్రవాదం, తిరుగుబాటు, చొరబాటు తదితర కారణాల వలన కేవలం నిర్మాణంలోనే కాదు, ప్రదర్శన రంగం కూడా తీవ్ర ప్రభావానికి లోనయింది. 1989లో వచ్చిన ఆందోళనకర పరిస్థితులతో కాశ్మీర్ లో సినిమా టాకీసులన్నీ మూసేసారు. రాజధాని శ్రీనగర్‌లోని ఏడు థియేటర్లు కూడా మూసివేతకు గురయ్యాయి. ఫలితంగా కాశ్మీర్‌లో సినిమా నిర్మాణం కాదు కదా, వీక్షణం కూడా కరువైంది. దాంతో డిజిటల్ పైరసీ పెరిగిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ చొరవతో 1996లో బ్రాడ్ వే, రీగల్, నీలం లాంటి సినిమా హాళ్ళు తెరుచుకోబడి 'కరీబ్' లాంటి సినిమాల్ని ప్రదర్శించాయి. 2015 తర్వాత మళ్లీ మూతబడ్డాయి. బషీర్ బద్‌గామీ, సిరాజ్ ఖురైషీలాంటి వాళ్లు రూపొందించిన టెలివిజన్ సినిమాలు మాత్రం నిర్మాణమవుతున్నాయి.
డాక్యుమెంటరీలు పరవా లేదు
డాక్యుమెంటరీ విభాగంలో కాశ్మీర్ కొంత విజయాన్ని సాధించింది. అశ్విన్ కుమార్ రూపొందించిన 'పంపోష్', 'ఇన్‌శా అల్లా' డాక్యుమెంటరీలు కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడ్డాయి. ఇట్లా నిర్మాణ ప్రదర్శనా రంగాలలో కాశ్మీరీ సినిమా కుదేలయినప్పటికీ, ఇటీవలి కాలంలో కాశ్మీరీ నటీ నటులు సినిమాలలో రాణిస్తూ తమ ఉనికి చాటుకుంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమాలయిన నోట్ బుక్, హమీద్, లైలామజ్నూ లాంటి సినిమాలలో కాశ్మీరీ నటులు మీర్ సర్వర్, మావుజం భట్, వికాస్ కుమార్ ప్రధాన భూమికలను పోషించారు.
ప్రధాన స్రవంతి కంటే ఇండిపెండెంట్ సినిమాలలో కాశ్మీరీ నటులు ముఖ్య భూమికలను పోషిస్తూ తమ సమస్యలను తమ కథలను తామే తెరపైన ఆవిష్కరిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఆమిర్ బషీర్ తీసిన హారుద్, మూసా సయ్యీద్ తీసిన వాలీ ఆఫ్ సెయింట్స్, డేనిష్ రెంజు తీసిన హాఫ్ విడో, హుసేన్ ఖాన్ రూపొందించిన కాశ్మీర్ డైలీ. ఈ సినిమాలలో కాశ్మీరీ జీవన సమస్యలు ప్రధాన ఇతివృత్తాలు కావడమే కాకుండా కాశ్మీరీల పాత్రలను స్థానిక నటీనటులు పోషించారు.
ప్రధాన స్రవంతి దృష్టి సారించాలి
ఇట్లా స్వతంత్రంగా సినిమాల నిర్మాణానికి ఉత్సాహవంతులు, కళాకారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అక్కడ నిర్మాణమే కాదు, పంపిణీ, ప్రదర్శన రంగాలలో కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. టాకీసులు మూసేసిన నేపథ్యంలో విడుదల కూడా లేదు. ఇక అశ్విన్‌కుమార్ లాంటి దర్శకులు అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి రూపొందించిన 'నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' లాంటి సినిమా సెన్సార్ కోరలలో చిక్కుకొని ఎనిమిది నెలలపాటు నిలిచిపోయింది. దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించింది.
ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి) తో నిర్మించారు. మొత్తం మీద కాశ్మీర్ సినిమా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వాల సహకారం, ప్రోత్సాహకాలు కరువై సొంతంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నది. కొంత మంది ఔత్సాహికుల చొరవ, అంకిత భావమే కాశ్మీరీ సినిమాకు ఊపిరి పోస్తున్నది. 'కాశ్మీర్ ఫైల్స్'ని పొగిడి ప్రోత్సహించిన ప్రభుత్వాలూ, నాయకులూ, మేధావులూ కాశ్మీరీ ప్రాంతీయ సినిమాను కూడా ప్రోత్సహించాలి. సినిమా వినోదం కోసం మాత్రమే కాదు, అది మన చరిత్ర సంస్కృతులను నిక్షిప్తం చేస్తుంది. ప్రధాన స్రవంతి సినిమా రంగం కాశ్మీర్ అందాలను మాత్రమే కాకుండా, తమ భాషా సినిమాని కూడా ప్రోత్సహించాలని కాశ్మీరీ దర్శకులు, కళాకారులూ కోరుకుంటున్నారు.
వారాల ఆనంద్
94405 01281