- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ చరిత్ర తెలియంది కాదు..
సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ తాజాగా సుప్రీంకోర్టు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను తన న్యాయ శాస్త్ర జిమ్మిక్కులను వినియోగించి, బెయిల్ ఇప్పించి, బయట పడేయాలని చూసిన ఆయన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మోకాలొడ్డడంతో సంయమనం కోల్పోయి, 'మన సుప్రీంకోర్టు చరిత్ర బంగారు కాలం అని చరిత్రకారులు రాయలేరని' వాపోవడం, అందుకు సమాధానంగా 'అదీ చూద్దాంలే' అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.
జాతి వ్యతిరేక చర్యలలో పాల్గొన్న వారి కేసులను, అవినీతిపరుల కేసులను అత్యధిక ఫీజులు వసూలు చేసి, వాదించడంలో ఆయనది సరికొత్త రికార్డు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర స్పష్టం. గతంలో ఈడీ ఈ కుంభకోణంలో ఆమె పాత్ర లేదని చెప్పింది. ఈ కుంభకోణంతో లింక్ ఉన్న వ్యక్తులు అప్రూవర్లుగా మారడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు సూత్రధారీ, పాత్రధారీ ఆమేనని తేలింది. సరైన ఆధారాలతోనే ఆమెను ఈడీ అరెస్టు చేసింది. వాస్తవంగా మన దేశ సుప్రీంకోర్టు చరిత్ర బంగారు కాలంతో పోల్చదగినదే కాదు. ఏ దేశంలోనైనా జడ్జీలను జడ్జిలే(కొలీజియం సిఫారసుతో) నియమించుకునే విధానం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొలీజియం పద్ధతి బాగా నచ్చింది కాబట్టి దాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
అప్పుడెందుకు వ్యాఖ్యానించలేదో?
ఈ విషయంపై న్యాయ విశ్లేషకులు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేయడంతో, మోడీ ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టి, 99 రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటు చేయడానికి పూనుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పుబడుతూ, ఇలా కమిషన్ ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఐదుమందిలో నలుగురు న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. ఇందులో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సదరు రాజ్యాంగ సవరణను సమర్ధించడం ఇక్కడ గమనార్హం. సహజీవనం తప్పు కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు దేశ ప్రజలు నివ్వెరపోయారు. ఈ రెండు సందర్భాల్లో కపిల్ సిబాల్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే దేశ ప్రజలు సంతోషించేవారు.
బెయిల్ ఇవ్వకపోతే..
కుంభకోణాలు చేసిన వారికి బెయిల్ ఇవ్వలేదని సుప్రీంకోర్టు పైన చురకలు వేస్తూ, కపిల్ సిబాల్ తన లేకితనాన్ని ప్రదర్శించుకోవడం హాస్యాస్పదం. తప్పుడు కేసులను వాదించడంలో దిట్ట కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈయనను రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. మూడవసారి రాజ్యసభకు ఎంపిక చేయడం వీలు కాదని కాంగ్రెస్ చెప్పడంతో సమాజ్ వాదీ పార్టీ పంచన చేరి, ముచ్చటగా మూడోసారి రాజ్యసభకు చేరుకున్నారు. న్యాయవాదిగా ఉంటూ ఇంతటి రాజకీయ ప్రాముఖ్యతను సంపాదించడం ఆషామాషీ విషయం కాదు. ఇదే కుంభకోణంతో సంబంధం ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో కవిత కేసు బాగా ముడి పడిపోయింది. ఈ విషయంలో ఈడీ ఖచ్చితమైన ఆధారాలతో కోర్టుకు ప్రొసీడ్ కావడంతో కపిల్ సిబాల్ ఆటలకు ఇక అడ్డు కట్ట అని సుప్రీంకోర్టులో ఆయన ప్రత్యర్థులు అనుకుంటున్నారు.
ఇక చివరగా మన దేశంలో ప్రధాన మంత్రులను చంపిన ముద్దాయిలకు, బాంబులు పేల్చి మారణహోమాన్ని సృష్టించిన తీవ్రవాదులకు, హత్యలు, మానభంగాలు చేసి సమాజానికి తీవ్ర నష్టం కలిగించిన వారి తరపున కపిల్ సిబాల్ లాంటి వారు వాదించడం కొత్తది ఏమీ కాదు. అత్యధిక మొత్తంలో ఫీజుల కోసమే ఈ కేసులు వాదిస్తుంటారు. అందుకే ఈ దేశంలో న్యాయవ్యవస్థ ధనం ఉన్న వాడికి చుట్టమనీ సామాన్య ప్రజల అభిప్రాయం.
ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ, విశ్లేషకులు.
94417 37877