శాసనాలలో కాకతీయుల చరిత

by Ravi |   ( Updated:2022-09-03 14:49:39.0  )
శాసనాలలో కాకతీయుల చరిత
X

కాకతీయుల కళా వైభవాన్ని లోకానికి శాసనాల ఆధారంగా తెలియజేసిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి దేశంలోని చారిత్రక పరిశోధకులలో అగ్రగణ్యులు. ఆయన తొంబై ఆరు సంవత్సరాల పరిపూర్ణ జీవితం సాగించి 27 జూలై 2016 నాడు మరణించారు. రెండు వేల సంవత్సరాల క్రితం ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉందని లోకానికి తెలియజెప్పింది పురావస్తు శాస్త్రజ్ఞులే. పురావస్తు శాస్త్రమే లోకంగా ఏడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు సాగించిన ఆయన కాకతీయుల వైభవానికి చారిత్రక ఆధారాలు సేకరించి తెలుగువారి చరిత్రకు సమగ్ర స్వరూపం చేకూర్చారు.

ఆయన రాసిన 'కాకతీయులు' అనే గ్రంథం చరిత్రకు ప్రమాణంగా నిలిచి కాకతీయుల నాటి సాహిత్యం, శిల్పం, వాస్తు, కళ, సంస్కృతి, సంస్కృత విద్య మొదలైన విషయాల గురించి సమగ్రంగా ఇందులో ఉదహరించారు. ఆ కాలంలో సంస్కృత భాషకు అత్యధిక ప్రాధాన్యం ఉండేదని నిరూపించారు. తవ్వకాలలో లభ్యమైన ఎన్నో శాసనాలు అలంకారిక సంస్కృత పద్యాలతో రచించబడ్డాయి. వేల్పూరు, అమరావతి శాసనాలలో అనుప్రాస ప్రాతిలోమ్య, యమకాది క్లిష్ట రచన అనిపిస్తుందని శాస్త్రి గారు పేర్కొన్నారు.

ఆయన రచనలలో

నాటి గ్రంథకర్తలలో మొదట పేర్కొనదగినవాడు విద్యానాథుడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి. 'ప్రతాపరుద్రీయం' అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. నాడు ప్రచారంలో ఉన్న నృత్యరీతులను 'దేశీయ వృత్తం' పేరిట ప్రత్యేక ప్రకరణంలో చర్చించాడు. వరంగల్ సమీపంలో ఉర్సు దగ్గర కట్టమీద బండపై రాజగురు విశ్వేశ్వర కుమారుడు నరసింహర్షనిగా గుర్తించదగిన రెండు కావ్యాలు, అనుమకొండ సమీపంలో మరో గుట్టమీద 37 అనుష్టశోకాల అసంపూర్ణ రచన కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వర్ణనతో, ఓరుగల్లు వర్ణనతో ఈ రచన ఆరంభమైంది.

క్రీ.శ 1145 నాటి గుంటూరు జిల్లా చేబ్రోలు శాసనంలో 'భీమయపండడు' కవిత్వం చెప్పగల సమర్దునిగా వర్ణింపబడినాడు. నెల్లూరు తెలుగు చోళ రాజు రెండవ మనుసిద్ధి ఆస్థానంలో తిక్కన రచన 'విరాటపర్వం'తో ప్రారంభమవుతుంది. క్రీ.శ. 1311 నాటి గుంటూరు జిల్లా నెమలికల్లు శాసనం లెక్కించిన మారయ ప్రతాపరుద్ర మహారాజునకు సామంతుడట. ఈ శాసనాలనినంటినీ పరబ్రహ్మ శాస్త్రి పరిశోధించి తెలుగు చరిత్రకు సాధికారత కలిగించారు. క్రీ.పూ. 500 సంవత్సరాల నుంచి క్రీ.శ. వెయ్యి సంవత్సరాల వరకు తెలుగు ప్రాంతాలలో సాంఘిక, ఆర్థిక స్థితిగతులను గురించి ఆయన తన గ్రంథంలో వివరించారు.

మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ

ఉమ్మడి రాష్ట్రంలోని పురావస్తు శాఖకు శాస్త్రిగారు 1981 వరకు అధిపతిగా ఉన్నారు. కాకతీయులు, శాతవాహనుల కాలం నాటి వెయ్యికి పైగా శాసనాలను, నాణాలను సేకరించి వెలుగులోకి తెచ్చారు. 1976లో కాకతీయులపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఆయన పరిశోధక గ్రంథాలు ఈనాటి పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కాకతీయ యుగం ప్రారంభమయ్యే నాటికి తెలుగు సాహిత్యము గ్రంథ రూపంలోనికి రాకపోవచ్చు కానీ, శాసనరూపంలోనికి వచ్చి నిలిచిపోయింది. నాటి సాహిత్యం ఒక్కొక్కసారి శాసనాలలోకి, కొంత కాలము తర్వాత గ్రంథరూపములోకి వచ్చింది. దీనిలో చాలా వరకు శిలాశాసనాలే.

ఈ శాసన కవులు సత్కవులు, చిత్ర విచిత్ర పదబంధాలను చిత్రించారు. గొప్ప తాత్వికులు, కవి చక్రవర్తులు, బహుభాషావేత్తలు, సంస్కృతాంధ్ర కన్నడములను కలగాపులగం చేసి కవిత్వం సృష్టించిన రసజ్ఞులు. ప్రజలకు శాసన రూపములో వ్యక్తీకరించిన ప్రతిభ సంపన్నులు కొందరు పేర్లను కూడా చెప్పుకోవడానికి ఇష్టపడని అవ్యాజ శాసనకర్తలు కూడా ఉన్నారని తెలుస్తున్నది. చక్కని చరిత్ర, శిల్ప కళతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించే సంగీత, నృత్య, సాహిత్య, లలిత కళలను పోషిస్తూ, ప్రజానురంజకంగా పరిపాలన సాగించిన కాకతీయ ప్రభువులు చిరస్మరణీయులు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కాకతీయ ఉత్సవాలతో వరంగల్ జిల్లా ప్రజలకు కాకతీయ రాజుల సుపరిపాలనను గుర్తు చేసుకోవడానికి మరొక అవకాశం ఏర్పడింది.

కొలనుపాక కుమారస్వామి

వరంగల్, 99637 20669

Advertisement

Next Story

Most Viewed