పేదలకు న్యాయం.. ఖరీదైన వ్యవహారం!

by Ravi |   ( Updated:2024-08-11 01:15:30.0  )
పేదలకు న్యాయం.. ఖరీదైన వ్యవహారం!
X

చట్టం ముందు అందరూ సమానమని, అందరికీ న్యాయం పొందే ప్రాథమిక హక్కు ఉందని భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నది. అయితే ఆర్థిక అసమానతలు, కులవివక్ష, పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, నిరుద్యోగ సమస్యల కారణంగా పేదలకు న్యాయం సత్వరం అందడం లేదని చరిత్ర చెబుతున్న వాస్తవం.

ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందడం ఖరీదైన వ్యవహారంగా మారింది. కోర్టు రుసుము, న్యాయవాది ఫీజు, ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుంది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాల ద్వారా పరిష్కారం పొందడం పేద ప్రజలకు సాధ్యం కావడం లేదు. భూములను కబ్జా చేసే భూ బకాసురులను ఎదుర్కోలేక.. డబ్బు, అధికార మదంతో విర్రవీగే వారిని తట్టుకోలేక న్యాయాన్ని మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ కూలి పోతుందని సమయం తీయలేక, పేదరికంతో డబ్బులు ఖర్చు పెట్టలేక న్యాయస్థానాల్లో పోరాడలేని స్థితి వచ్చిం ది. దీంతో నిరుపేద‌లు, నిస్సహాయులు, అభాగ్యులకు కోర్టుల్లో పోరాటం అంటే ఖ‌రీదైన వ్యవహారంగా మారింది. సంవత్సరాల త‌ర‌బ‌డి సాగే విచార‌ణ‌లు, కోర్టు ఫీజులు ఇలా అనేక అంశాలు మోయ‌లేని భారంగా మారుతున్నాయి. ఇంత ఖ‌ర్చును భ‌రించి న్యాయం పొందాలంటే నిరుపేదలు, సామాన్యులతో సాధ్యం కావడం లేదు.

ఆటో డ్రైవర్ స్థలం కబ్జాచేసి..

ఒకరు ఆటో డ్రైవర్.. అతడి నెల సంపాదన రూ. 10 వేలు దాటదు.. మరొకరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక పోస్టులో ఉన్న వ్యక్తి.. లక్షన్నరకు పైగా జీతం.. పక్కపక్కనే ఉండే వీరి మధ్య ఇంటి స్థలానికి సంబంధించిన వివాదం నెలకొన్నది. సీఎంఓ, కలెక్టర్, మున్సిపాలిటీలకు ఫిర్యాదు చేస్తే ఆటో డ్రైవర్‌కు చెందిన కొంత స్థలాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి కబ్జా చేశాడని పురపాలక అధికారులు నిర్ధారించారు. అంతే కాకుండా సదరు డిపార్ట్‌మెంట్ వ్యక్తి చేపడుతున్న నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. పోలీస్ స్టేషన్‌లో ఆ ఖాకీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే సదరు ‘పోలీస్’ ముందుగా జిల్లాలోని సివిల్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టులో కేసు వేశాడు. దీంతో ఆటో నడపనిదే రోజు గడవని సదరు డ్రైవర్ న్యాయం చేయాలని కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నాడు.

న్యాయం కోసం ఎంత ఖర్చుపెట్టాలంటూ..

ఈ కేసు వాదించేందుకు లాయర్ల ఫీజు ఆటో డ్రైవర్‌కి తీవ్ర భారంగా మారింది. న్యాయం చేయాల్సిన పురపాలక అధికారులు కేవలం పేపర్ వర్క్ పూర్తి చేసి.. ఇప్పుడు కోర్టు కేసుల పేరుతో తప్పించుకుంటున్నారు. డబ్బులు ఖర్చుపెట్టనిదే న్యాయం పొందే పరిస్థితులు లేవని సదరు ఆటో డ్రైవర్‌కు అర్థమైంది. ఆటో డ్రైవర్ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్న సదరు ‘పొలీస్’ అతడి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతూనే ఉన్నాడు. కేసుల పేరుతో కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగేలా.. లేకుంటే సదరు స్థలాన్ని విడిచిపెట్టేలా పరిస్థితి ఉత్పన్నం చేస్తున్నాడు. న్యాయస్థానాలు, న్యాయవాదులు, కేసుల గురించి సరైన అవగాహన లేని ఆటో డ్రైవర్.. న్యాయం కోసం ఇంకెంత ఖర్చు పెట్టాలోననే ఆవేదనలో ఉన్నాడు. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఘటన మాత్రమే. ఇలాంటి బాధితులు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లోనే ఉంటారు.

ప్రధాన నగరాల్లో ఫీజులు లక్షల్లోనే..

చట్టం ముందు అందరూ సమానమని, అందరికీ న్యాయం పొందే ప్రాథమిక హక్కు ఉందని భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నది. అయితే ఆర్థిక అసమానతలు, కులవివక్ష, పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, నిరుద్యోగ సమస్యల కారణంగా పేదలకు న్యాయం సత్వరం అందడం లేదని చరిత్ర చెబుతున్న వాస్తవం. కోర్టుల్లో విచారణకు దేశంలోని ప్రధాన నగరాల్లో న్యాయవాదులకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించాల్సి వస్తున్నది. ప్రముఖ లాయర్లు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజును సామాన్య ప్రజలు, పేదలు ఎలా చెల్లించగలుగుతారు? సాధార‌ణ ప్రజలు భ‌రించ‌లేని విధంగా కొంద‌రు న్యాయ‌వాదులు ఫీజు వ‌సూలు చేస్తున్నారు. సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉండా లంటే న్యాయవాదుల ఫీజులు అందుబాటులో ఉండాలి.

సరైన అవగాహన లేక..

దేశ జనాభాలో అధిక శాతం మంది పేదరికంలో జీవిస్తున్నారు. అంతేకాకుండా వారికి కోర్టు విధానాలపై సరైన అవగాహన ఉండటం లేదు. కోర్టులు, కేసులు అనగానే భయాందోళనకు గురి కావాల్సిన స్థితి. దీంతో న్యాయం అందని ద్రాక్షలా మారింది. న్యాయం ఆలస్యం కావడం కూడా ఒక శిక్షేనని గుర్తించాల్సిన అవసరముంది. పెద్దలకు ఒక సమస్య చిన్నగానే కనిపించినా.. అది పేదలకు పెద్ద సమస్యేనని గుర్తించాలి. లాయర్‌ను పెట్టుకునే ఆర్థిక స్తోమ‌త లేని వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ స‌హాయం అందిస్తుంది. దీని కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుంది. అయితే దీనిపై సామాన్య ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన ఉండడం లేదు. పరిమితి లోపు వార్షికాదాయం ఉన్నవారు ఈ సంస్థ ద్వారా కిందిస్థాయి కోర్టు నుంచీ సుప్రీంకోర్టు వ‌ర‌కు త‌మ కేసులు వాదించుకోవ‌డానికి ఉచితంగా న్యాయ స‌హాయం పొందే వీలుంది. మ‌హిళ‌లు త‌మ వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఎవ‌రైనా స‌రే ఉచితంగా న్యాయ సేవ‌లు పొంద‌వ‌చ్చు.

‘ఉచితన్యాయం’పై మరింత ప్రచారం అవసరం..

ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే.. అన్ని పరిశీలించాక.. సంస్థ కేసును వాదించ‌డానికి ఒక లాయర్‌ను నియ‌మిస్తుంది. కోర్టు ఫీజులు, సాక్ష్యులకు సంబంధించిన వ్యయాలు, ఆ కేసుకు సంబంధించి మ‌రే ఇత‌ర‌త్రా స‌మంజ‌స‌మైన ఖ‌ర్చులను కూడా భ‌రిస్తుంది. అప్పీలు మెమో, అభ్యర్థనలు, కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ల అనువాదం, అచ్చు వేయ‌డం త‌దిత‌ర ప‌నులకు సాయం చేస్తుంది. కేసు విచార‌ణ‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన ఇత‌ర కేసుల‌కు సంబంధించి తీర్పుల కాపీలు, ఉత్తర్వులు, సాక్ష్యాలకు సంబంధించి నోట్స్ ఇత‌ర‌త్రా ప‌త్రాల‌ను సిద్ధం చేసి స‌మ‌కూర్చి పెడుతుంది. ఉచిత‌ న్యాయ సేవ‌లు పొందాల‌నుకునేవారు త‌మ కేసు ఏ కోర్టు ప‌రిధిలోకి వ‌స్తుందో తెలుసుకుని అక్కడి న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వీలుంది.

-ఫిరోజ్ ఖాన్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

96404 66464

Advertisement

Next Story

Most Viewed