వికసిత్ భారత్ యువతకేనా?

by Ravi |   ( Updated:2024-12-03 01:00:57.0  )
వికసిత్ భారత్ యువతకేనా?
X

దేశంలో సుమారు 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే వీరికి నిరుద్యోగం చదువుకు తగ్గ ఉద్యో గం లేకపోవడం ప్రధాన సమస్యలు దేశ జనాభా లో పని చేసే వయసు వారి జనాభా శాతం ఎక్కువ గా ఉంటే దాన్ని జనాభా నిధిగా వర్ణిస్తారు. దీన్నే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అంటారు. మనదేశం లో ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలు దాటిన వారు 2.5 కోట్లుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం 13-35 ఎల్ మధ్య వయసు వారిని యువత అంటారు. వీరు మన దేశ జనాభాలో 65%గా ఉన్నారు. వరల్డ్‌బుక్2020 ప్రకారం మన దేశంలో 14 సంవత్సరాల‌లోపు పిల్లలు 24% గానూ 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు వారు 67% గానూ 60 సంవత్సరాల పైబడిన వారు 6.2 శాతంగా ఉన్నారు. సగటు భారతీయుని వయసు 25 సంవత్సరాల అందుకే మన దేశాన్ని యంగ్ ఇండియా అని అంటారు. ఇదే జనాభా నిధి. ఈ నిధిని అభిలషణీయ స్థాయిలో ఉపయోగంలో తెచ్చుకుంటే శ్రామిక శక్తి అధికంగా ఉత్పత్తి కార్యక్రమాలలో పనిచేయడం వలన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. నిరంతర వృద్ధి సంతులిత వృద్ధి అభివృద్ధి వ్యూహంగా ఉన్నప్పుడు యువశక్తి దేశంలో ఉండి దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే మన యువత నిరుద్యోగం అనే నిస్పృహతో వలస పక్షుల్లాగా విదేశాలకు వెళ్లిపోతున్నారు.

అందరి వృద్ధి.. కొందరి వృద్ధి!

2011 నుంచి నేటి వరకు 16 లక్షల మంది భారత‌దేశ పౌరసత్వం వదులుకున్నారు. మరొకవైపు విద్యార్థులు కూడా దేశంలో తగిన విద్యా ఉపాధి సౌకర్యాలు లేక విదేశీ విద్యకు ఉపాధికి పరిగెడుతూ అక్కడే స్థిరపడిపోతున్నారు 2024 నాటికి భారతీయ విద్యార్థులు 85 బిలియన్ డాలర్లకు విదేశీ విద్యపై ఖర్చు పెడుతున్నారంటే మన దేశం ఎటుపోతున్నదో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి అంటే అందరి వృద్ధి అంతేగాని కొందరి వృద్ధి కాదని గాంధీజీ అన్నారు. దేశ ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు. ప్రజలకు కనీస అవసరాలు, తిండి, వసతి, విద్యా, వైద్యం మేరకు జరుగుతున్నది అనేదే ముఖ్యం. దేశ ప్రజల స్వయం పోషకత్వం ఉద్యోగ కల్పన‌తోనే సాధ్యం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉందో నిర్ణయించడంలో కీలక అంశం నిరుద్యోగమే. ఉత్పత్తి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటే ఆదాయాలు పెరిగి ప్రస్తుత సేవలకు గిరాకీ ఏర్పడి వస్తు సేవల ఉత్పత్తి అవసరం ఇంకా పెరిగి ఉద్యోగ కల్పన జరిగే అవకాశాలు మెరుగవుతాయి.

కుటీర పరిశ్రమలు ఎక్కడ?

ప్రజల అవసరాలు తీర్చడానికి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ రంగంలోనే వేలాది చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడు మన దేశంలో ఉన్న IIT‌లలోను, పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ నేర్పించగలిగితే యువతకు నైపుణ్యాలు పెంపొందించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు. 1980 -1990 మధ్య కాలంలో చైనాలో చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా పెద్ద ఎత్తున టౌన్ అండ్ విలేజ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. మనదేశంలో కూడా అలాగే చిన్న పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వమే వేలాదిగా చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి లక్షల సంఖ్యలో ఉద్యోగాలని ఇచ్చే ప్రయత్నం చేస్తే తప్ప నిరుద్యోగ సమస్య తీరదు. ఇదే విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా స్థాపించవచ్చును. వీటిలో పనిచేసే వారికి రెగ్యులర్ ప్రాతిపదికన సామాజిక భద్రత కల్పించి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఈ పరిశ్రమల కోసం ఎటువంటి నైపుణ్యాలు కావాలో అటువంటి కోర్సులను ఇప్పుడున్న కాలేజీలో ప్రవేశపెట్టవచ్చును. అలా చేయకుండా ఈ నైపుణ్యాలను పెంపొందించే బాధ్యత కార్పొరేట్లకు అప్పజెప్పడంతో ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలుస్తోంది.

చైనాకూ, భారత్‌కూ ఇంత తేడానా?

యువతకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించి చిన్న చిన్న పట్టణాల్లో నా గ్రామీణ ప్రాంతాలలోన చిన్నతరహా కుటీర పరిశ్రమ స్థాపించడం వలన 1980 - 1990 మధ్య కాలంలో చైనాలో జరిగిన అభివృద్ధి ఫలితంగా నేడు ఉద్యోగ కల్పనలోనూ, పారిశ్రామిక రంగం లోనూ ప్రపంచ స్థాయిలో చైనా నెంబర్ వన్‌గా ఉన్నది. మనదేశంలో మొదలుపెట్టిన మేకిన్ ఇండియా పథకం కూడా చైనా వస్తూత్పత్తి పోటీకి తట్టుకోలేకుండా పోతున్నది. 2020 నాటికి నిరుద్యోగిత రేటు చైనాలో 4.3 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో ఇండియాలో 24 శాతం నిరుద్యోగత రేటు ఉన్నది. 2020లో పారిశ్రామిక రంగం వాటా చైనాలో 44 శాతం కాగా భారతదేశంలో 30 శాతం మాత్రమే. వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారతదేశంలో తలసరి ఆదాయం 1960లో 82 డాలర్లు కాగా చైనాలో 89 డాలర్లే 1970లో ఇరు దేశాలలో సమానంగా ఉండేది. 1980లలో భారతదేశంలో 266 డాలర్లకు పెరగగా చైనాలో 194 డాలర్లు మాత్రమే. కానీ 2000 సంవత్సరం వచ్చేనాటికి చైనాలో 4450 డాలర్లు కాగా ఇండియాలో 1357 డాలర్లకు దిగజారిపోయింది. 2022 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం కేవలం 2,388 డాలర్లు కాగా చైనాలో 12,720 డాలర్లకు పెరిగింది. ఇలా చైనాలో చేపట్టిన విద్యా విధానం వలన యువతకు సాంకేతిక నైపుణ్యం పెరిగి, స్థాపించిన చిన్న తరహా కుటీర పరిశ్రమల వలన ఉపాధి కల్పన గణనీయంగా పెరిగి పారిశ్రామిక రంగంలో చైనా అగ్రగామిగా ఎదగగలిగింది. స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీల ఆధునీకీకరణ, యాంత్రీకరణ కంప్యూటరీకరణ ద్వారా వేలాది మంది ఉద్యోగస్తులకు నిరుద్యోగం తప్పనిసరి అవుతున్న సమయం ఇది. కొత్తగా ఉద్యోగాలను కల్పించడం అటుంచి ఉన్న ఉద్యోగాలను ఊడబెరికే కృత్రిమ మేధస్సు అమలు చేయడం వలన రాబోయే కాలంలో నిరుద్యోగం ఇంకా తీవ్రతరం అవుతుంది.

డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Advertisement

Next Story

Most Viewed