పోడు పట్టాలు అందరికీ దక్కేనా!

by Ravi |   ( Updated:2023-06-23 00:01:04.0  )
పోడు పట్టాలు అందరికీ దక్కేనా!
X

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు వస్తాయని గిరిజన ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 2006లో అటవీ హక్కుల చట్టం అమలు కాక 17 సంవత్సరాలు దాటింది. సంవత్సరాలు గడిచినా అదిగో పట్టా, ఇదిగో పట్టా అంటూ మోసపూరితమైన హామీలతో కాలం గడుపుతూ వస్తున్నారు. పోడు వ్యవసాయం చేసేవారికి నేటికీ పోడు పట్టాలు అందకపోవడంతో గిరిజనులు దశాబ్ద కాలంగా నష్టపోయారు. గిరిజనులు నోరులేనోళ్లు, అమాయకులు కావడంతో సంక్షేమ ఫలాలు అందని పరిస్థితి. మన తెలంగాణ వస్తే అభివృద్ధి అవుతుందని కలలుగన్నా ఫలితం లేక పది సంవత్సరాలు నష్టపోయింది గిరిజనులే!

కేవలం 4 లక్షల ఎకరాలే పంపిణీ!

అడవి అంటే గిరిజనులకు జీవనం. ఆహారం, ఫలహారం, సంస్కృతి, సామాజికం, ఆర్థికం, సేవాగుణం, వైద్యం ఇవన్నీ వారు అడవి తల్లి వొడిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారు బయటి సమాజంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అటువంటి వారిపై చట్టాల పేరుతో వారి జీవనాన్ని ధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం అమలు చేయడంలో పాలకులు అశ్రద్ధ చూపుతూ నష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో 295 మండలాలు, 2,845 గ్రామపంచాయతీ పరిధిలలో 12,49.296 ఎకరాల పోడు భూముల కోసం 4,14,353 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో 4.70 లక్షల ఎకరాలకు,1.80 లక్షల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 మార్చి 9న క్యాబినెట్ సమావేశంలో మంత్రి హరీష్ రావు 4,00,903 ఎకరాలకు 1,55,393 మందికి పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2.59 లక్షల మంది దరఖాస్తు చేసిన 8.14 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అయితే, కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 11.50 లక్షల మందికి పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో గిరిజనులు సంబరపడ్డారు.. కానీ ఇప్పుడు మంత్రి మాటలు చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది.

గిరిజనులకు తప్పకుండా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు, గిరి వికాసం, కరెంటు, బోర్లు, రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇస్తానని స్వయానా కేసీఆర్ 2019 జూలై 19న అసెంబ్లీలో ప్రకటించారు కానీ పంపిణీ జరగలేదు. మరోసారి 2021 ఏప్రిల్ 14న నాగర్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా, 2021 అక్టోబర్ 1న మరోసారి పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు. అయితే ఇవన్నీ హామీలు తప్ప, ఆచరణకు నోచుకోలేని పరిస్థితి ఉంది. పైగా అన్ని జిల్లాలకు, డివిజన్లకు తానే స్వయంగా వెళ్ళడంతో పాటు మంత్రి వర్గాన్ని, అధికార గణాన్ని, అటవీ శాఖ అధికారులను చివరకు ‘చీఫ్ సెక్రటరీని తీసుకెళ్లి ప్రజా దర్బార్ పెట్టి పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పారు. ఈ పట్టాల పంపిణీ కోసం రెండు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్‌గా సబ్ కమిటీ ఏర్పరచి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లను ఈ కమిటీలలో సభ్యులుగా నిర్ణయించారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశాలు నిర్వహించి, పోడు భూముల వివరాలను తీసుకుని పర్యవేక్షించింది. అయినప్పటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ పట్టాలిస్తామని హామీలిచ్చి..

కాంగ్రెస్ ప్రభుత్వంలో 96,676 మందికి 3.8 లక్షల ఎకరాల భూమికి పట్టా ఇచ్చారు. అందులో 18వేల ఎకరాలకు అప్పుడే పట్టా బుక్కులు రెడీ అయి ఉన్నా, వాటిని ఇప్పటివరకు గిరిజనులకు ఇవ్వలేదు. పైగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోడు భూములకు పట్టాలు రేపటి నుండి ఈ నెల 30 వరకు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. కానీ లక్షల మంది దరఖాస్తు చేస్తే కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50, 595 మందికి 1.51,195 ఎకరాల భూమి, పెద్దపల్లి జిల్లా ముగ్గురికి ఒక గుంట భూమి, మెదక్ జిల్లా 610 మందికి 524 ఎకరాల భూమి, హన్మకొండ 70 మందికి 65 ఎకరాలు భూమి పంపిణీ పట్టాలు ఇస్తున్నట్టు సమాచారం. దీంట్లో ఏ రకంగా శాస్త్రీయత ఉంది! రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములపై నిర్వహిస్తున్నటువంటి భూ సర్వే తప్పుల తడకగా కనిపిస్తుంది! దీనికంటే బ్రిటిష్ ప్రభుత్వం 1927లో గిరిజనులకు అడవి మీద పూర్తి హక్కు కల్పించి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. దీనిని బట్టి మన పాలకులకు గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, గిరిజన ప్రజా సంఘాలు అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించాయి. దాని ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి దరఖాస్తులు తీసుకుని అందరికీ హక్కు పత్రాలు ఇస్తామని అనేకమార్లు చెప్పినప్పటికీ, ఇప్పుడు పంపిణీ చేస్తున్న పట్టాలకు చాలా తేడా ఉంది. పోడు సాగుదారులకు భూములు దక్కే పరిస్థితి లేదు, కనుక అందరికీ అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు ఇచ్చి పోడు సాగుదారుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇప్పటికైనా అర్హులైనటువంటి వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇచ్చి వారి మీద దాడులకు పాల్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోడు సాగు చేస్తున్న హక్కుదారులందరికీ పోడు పట్టాలు ఇవ్వకపోతే ప్రభుత్వంపై మరో పోరాటం చేయడానికి పోడు సాగుదారులు సన్నద్ధం కావాలి.

మూడ్. ధర్మానాయక్

రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ గిరిజన సంఘం

94900 98685

Advertisement

Next Story

Most Viewed