- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చదువేనా దారి దీపం!
చదువొక్కటే దారి దీపం కాదు. చదువు కాస్త జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ తర్వాత జీవితం చాలానే ఉంటుంది. పాఠ్యాంశాల్లోనే అనేక మంది మహానుభావుల చరిత్ర చదువుకున్నాం. వారంతా ఉన్నత విద్యావంతులేం కాదు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జీవన పయనం. అనేక మలుపులు తిప్పిన జీవితాలే. కానీ ఓడిపోలేదు. అందుకే అందరికీ పాఠమయ్యారు. మరి ఇప్పటి చదువులేం చెబుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడిపై చర్చ జరగాలి. ర్యాంకు రాకపోతే, మంచి మార్కులు పొందకపోతే జీవితమే లేదా? రోజూ ఏదో ఒక మూలన ఒత్తిడి చదువులతో బలైన భావి భారతాన్ని వింటూనే ఉన్నాం. సొంత మనుషుల మధ్య గడిపే కాలం భారంగా మారుతున్నది. సలహాలిచ్చేవారు, ధైర్యాన్ని నూరిపోసే ఆత్మీయులు దూరమై కలవరానికి గురవుతున్నారు. ఆ తర్వాత పరీక్షల్లో సక్సెస్ కాలేమన్న ఆందోళన, తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించాలన్న భయం బలవన్మరణానికి దారి తీస్తున్నది.
మాది నల్లగొండ జిల్లా నాంపల్లి. మా క్లాస్‌లో 145 మంది. అందులో పదో తరగతి మొదటి సారి పాసయ్యింది కేవలం 24 మంది మాత్రమే. కానీ ఎవరి జీవితం ఆగిపోలేదు. అందరిదీ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ గానే ఉన్నది. పదో తరగతి అయిపోయి మూడు దశాబ్దాలైంది. ఐతేనేం మా స్నేహ బృందం ఇప్పటికీ కలుస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. దావత్ చేసుకుంటాం. 30 మంది వరకు తప్పకుండా వస్తారు. అందులో నాంపల్లి సత్తయ్య ఒకడు మా దోస్త్. మేం కలవగానే అనే మొదటి మాట ఏమిటంటే.. ఐయామ్ టెంత్ ఫోర్ సబ్జెక్ట్స్ఫెయిల్. బట్ ఐయామ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరంతా ఉత్తదే అని ధీమా వ్యక్తం చేస్తాడు. అలా అన్నప్పుడల్లా నువ్వు లక్కీ ఫెలో అంటూ ఆట పట్టిస్తాం. అతడు నిజానికి ఐదు సబ్జెక్ట్ ఫెయిలయ్యాడు. ఆ తర్వాత సప్లిమెంటరీ రాస్తూ పూర్తి చేశాడు. ఎట్టకేలకు పూర్తి చేశాడు. ఇప్పుడు పంచాయత్ రాజ్ శాఖలో ఉద్యోగి. ఐదు సబ్జెక్ట్స్ ఫెయిలైనప్పుడు జీవితమే అయిపోయిందని కూర్చోలేదు. బెంగపడలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. ఇప్పుడు మా కంటే బెటర్‌గా లైఫ్‍ని ఎంజాయ్ చేస్తున్నాడు.
అలాగే కొందరు పదిలో ఫెయిలయ్యారు. హైదరాబాద్‌కి పని కోసం వచ్చారు. ఇప్పుడు కొందరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీస్‌గా స్థిరపడ్డారు. మేం పదో తరగతి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైనా ప్రభుత్వ ఉద్యోగం పొందలేదు. మా ఫ్రెండ్స్ కూడా అనేక రంగాల్లో స్థిరపడ్డారు. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ రంగాల్లో మేటిగానే ఉన్నారు. విదేశాల్లోనూ స్థిరపడిన వాళ్లున్నారు. ఎవరికైనా మంచి కాలం తప్పకుండా ఉంటుంది. మరోసారి ప్రయత్నించడం ద్వారా సక్సెస్ అవుతాం. చదువొక్కటే దారి దీపం కాదు. చదువు కాస్త జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ తర్వాత జీవితం చాలానే ఉంటుంది. పాఠ్యాంశాల్లోనే అనేక మంది మహానుభావుల చరిత్ర చదువుకున్నాం. వారంతా ఉన్నత విద్యావంతులేం కాదు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జీవన పయనం. అనేక మలుపులు తిప్పిన జీవితాలే. కానీ ఓడిపోలేదు. అందుకే అందరికీ పాఠమయ్యారు. మరి ఇప్పటి చదువులేం చెప్తున్నాయి ఎంత మంది డిగ్రీ, పీజీ పట్టాలు పట్టుకొని ఖాళీగా కూర్చుంటున్నారు. చదివిన చదువుకు సార్ధకత లభించిందా? చదివిన చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు ఏమైనా సంబంధం ఉన్నదా? కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడిపై చర్చ జరగాలి.
ఎంతో ఒత్తిడి కారణంగా
నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య బాధ కలిగించింది. మార్కులు, ర్యాంకుల కోసం తాపత్రయపడితే కష్టం. అలాంటి ఒత్తిడి జీవితాన్ని బలి తీసుకున్నది. ర్యాంకు రాకపోతే, మంచి మార్కులు పొందకపోతే జీవితమే లేదా? ఉన్నత లక్ష్యాన్ని అధిరోహించడానికి అదొక్కటే మార్గమా? కార్పొరేట్ విద్యా సంస్థల్లో మోటివేషనల్ స్పీచ్‌లతో అదరగొడుతున్నారు. ప్రధానంగా ఎగ్జామ్స్‌కి కొన్ని రోజుల ముందు బయటి నుంచి మేధావులను తీసుకొచ్చి వారితో క్లాస్ ఇప్పిస్తుంటారు. వారి నోట కూడా ర్యాంకులు, మార్కులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంకా గొప్పగా దేశవ్యాప్తంగా ఫలానా విద్యా సంస్థల్లో చదువుకున్న వారే డాక్టర్లుగా, ఇంజినీర్లుగా స్థిరపడ్డారంటూ గొప్పలను కీర్తిస్తున్నారు. ఆ కీర్తింపులన్నీ డబ్బుల కోసమేనని విద్యార్థి లోకానికి తెలియదు. ఎంతగా ఆ సంస్థను పొగిడితే అంత రెమ్యునరేషన్ లభిస్తుంది. కానీ నిజానికి సాత్విక్‌ని ఎంత మానసిక ఒత్తిడికి గురి చేయకపోతే బలవన్మరణానికి పాల్పడుతాడు? తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చి వెళ్లిపోయాడు. ఐతే సమాజంలో ఒక్క సాత్విక్ తోనే ఆరంభం కాదు. అతడితోనే ఆఖరు కూడా కాదు. రోజూ ఏదో ఒక మూలన ఒత్తిడి చదువులతో బలైన భావి భారతాన్ని వింటూనే ఉన్నాం.
హాస్టల్‌లో ఉండలేక బాలుడి ఆత్మహత్య. నాన్నా.. నన్నెప్పుడు తీసుకెళ్తావ్ అంటూ బతిమిలాడే వాయిస్ రికార్డులు.. సోషల్ మీడియాలో ఫన్నీగా ప్రచారమైంది. కానీ ఆ పిల్లాడి మనసును ఎంతగా కలిచివేస్తే అంతగా వేడుకుంటాడన్నది అంశం. ఐఐటీలో సీటు రాలేదని ఓ విద్యార్థి.. ఎంసెట్‌లో ర్యాంకు రాలేదని ఓ అమ్మాయి. ఉద్యోగం రావడం లేదని ఓ యువకుడి ఆత్మహత్య. ఇలా రోజూ ఏదో ఒక ప్రాంతంలో వినిపించే వార్త. దీనికి బాధ్యులెవరు? జీవించడానికి పోరాడాలి. నిండు జీవితాన్ని బలి చేయడం అవివేకమే. తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలమైందని.. కోరుకున్నది దక్కలేదని చస్తే అది పిరికితనమే! రేపటి భవిష్యత్తు మనదేనన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
పేరెంట్స్ అత్యాశ కూడా కారణమే
ఎవరికైనా సమాజంలో కృషితోనే ఉన్నత స్థితి సాధ్యం. ఆ కృషికి సమాజం, కుటుంబం తోడ్పాటు అనివార్యం. మానసిక స్థైర్యం అవసరం. దానికి తోడు ఆర్థిక బలం తప్పనిసరి చేశారు. డబ్బు పెట్టి చదువును కొనుక్కోవచ్చు. కానీ ఉపాధిని మాత్రం కాదు. అన్నింటికి మించి వారి ప్రజ్ఞాపాటవాల ఆధారంగానే భవిష్యత్తుకు బాటలు పడుతాయి. అవేవీ గ్రహించకుండా తమ పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష.. సమాజంలో హెచ్చుతగ్గులు.. ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అది మానసికంగానూ, శారీరకంగానూ హింసిస్తున్నాయి. దాంతో డిప్రెషన్‌కి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిజానికి అవి ఒత్తిడి చేసిన హత్యలుగా పేర్కొనాలి. కార్పొరేట్ శక్తుల హింసాయుత మార్గాలే ఆ దారికి మార్గాన్ని చూపిస్తున్నాయని తల్లిదండ్రులు భావిస్తుంటే ఎవరేం చేయగలరు తమ పిల్లల ఐక్యూ లెవెల్స్‌ని అంచనా వేయకుండా డాక్టర్లుగా, ఇంజినీర్లుగా చూడాలనుకుంటోన్న పేరెంట్స్ అత్యాశే ప్రధాన కారణంగా ఆత్మహత్యల పరంపర.
ప్రపంచంలో పోటీ అనివార్యం. కానీ ఆ పోటీలో నెగ్గడం తప్పనిసరి కాదు. ఆడుకోవాల్సిన వయసులో రోజుకు 16 గంటలూ పుస్తకాలతోనే కుస్తీ. ఐదో తరగతికే ఐఐటీ ఫౌండేషన్. ఆరో తరగతి నుంచే ఎంసెట్ కోచింగ్. సాయంత్రం 4 గంటలకు ఇంటికొస్తే రాత్రి 9 వరకు ట్యూషన్. రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు వచ్చీరాని నిద్ర. మరుసటి రోజు ఉదయం 7 గంటలకే పరుగు. ఇదీ విద్యార్థి కాలగమనం. ఏ విద్యార్ధికైనా 45 నిమిషాల నుంచి గంట వరకే కాన్సంట్రేషన్ ఉంటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఆ తర్వాత 20 నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి. కానీ ప్రతి స్కూల్, కాలేజీలో గంటల తరబడి క్లాసులు పీకుతుండడమే బోధనగా మారింది. ఎవరికి అర్థమైనా, అర్ధం కాకపోయినా లెక్చర్ కొనసాగుతూనే ఉంటుంది. పరీక్షల్లో ర్యాంకులు మార్కులు రాకపోతే అవమానాలు, ఛీత్కారాలు. మరోవైపు తల్లిదండ్రుల ఆక్షేపణలు తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
మాట్లాడనివ్వని చదువులు
గ్రామీణ ప్రాంతంలో విద్యా బోధన బాగోలేదంటూ హైదరాబాద్‌వంటి నగరాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అప్పటి దాకా తల్లిదండ్రులు, అక్కాచెల్లెండ్లు, అన్నాదమ్ములు, స్నేహితులతో గడిపిన పిల్లలు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వారమో, 15 రోజులకో పేరెంట్స్ వస్తే జైల్లో ఖైదీతో మాట్లాడినట్లుగా 5, 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలన్న షరతులు నిరాశా నిస్సృహకు గురి చేస్తున్నాయి. సొంత మనుషుల మధ్య గడిపే కాలం భారంగా మారుతున్నది. సలహాలిచ్చే వారు, ధైర్యాన్ని నూరిపోసే ఆత్మీయులు దూరమై కలవరానికి గురవుతున్నారు. ఆ తర్వాత పరీక్షల్లో సక్సెస్ కాలేమన్న ఆందోళన, తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించాలన్న భయం బలవన్మరణానికి దారి తీస్తున్నది.
పరీక్షల్లో ఫెయిల్, కెరియర్‌లో గందరగోళం కారణాలు. తోటి వారిలో బలహీనమైన క్షణాలు గోచరిస్తే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. అండగా నిలవాలి. ఏకాంతం కోరుకుంటున్నారంటే సమస్య జటిలమేనని గ్రహించాలి. పది మందితో కలుపుకుపోవాలి. నిర్లిప్తతను, భయాన్ని వీడేటట్లుగా ప్రయత్నించాలి. ఈ రోజుల్లో నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడానికి అనేక దారులు ఉన్నాయి. పరిపూర్ణమైన మనిషిగా మారేందుకు అవకాశాలు కళ్ల ముందే ఉన్నాయన్న వాస్తవాన్ని బోధించాలి. అలాగని అసలే చదువొద్దన్నది నా అభిమతం కాదు. కాకపోతే తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం, ప్రేమ లేకుండా పోతున్నాయి. సెల్‌ఫోన్ పలకరింపులకే పరిమితమయ్యారు. తీరిక లేని తల్లిదండ్రులు తోటి పిల్లలతో పోలుస్తూ తిట్టిపోస్తున్నారు. రీలాక్సేషన్ లేని చదువులను పేరెంట్స్ ఇష్టపడుతున్నారు. దాంతోనే కష్టాలెదురవుతున్నాయి.
వాళ్లంతా విజేయులే కదా!
థామస్ ఎడిసన్‌ని స్లో లెర్నర్ అంటూ వారి టీచర్ కామెంట్ చేశారు. కానీ కష్టపడ్డాడు. అనేక పరిశోధనలు చేశాడు. లైబ్రరీలో గంటలకొద్దీ గడిపాడు. ఆఖరికి విద్యుత్ బల్బును కనిపెట్టాడు. ప్రపంచానికే వెలుగులు నింపాడు. రైట్ సోదరులు కూడా ప్రాధమిక విద్యలోనే బహిష్కరించబడిన వారే. కానీ గంటల కొద్దీ పక్షులు ఎగరడాన్ని గమనించి.. ఆఖరికి విమానాన్ని ఆవిష్కరించారు. పట్టుదలకు దిక్సూచీగా నిలబడ్డారు. ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బెర్గ్ కూడా హార్వార్డ్‌లో డ్రాపౌట్. విర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్, విర్జిన్ రికార్డ్స్, విర్జిన్ మొబైల్, విర్జిన్ బ్రాండ్స్.. సామ్రాజ్యాధినేత రిచర్డ్ బ్రాన్సన్ కూడా 16 ఏండ్లకే చదువు ఆపేశాడు. ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఉన్నత విద్యావంతుడేం కాదు. మరి వీళ్లంతా సక్సెస్ కాగలిగినప్పుడు మీ పిల్లలెందుకు జీవితంలో నిలబడలేరు? కార్పొరేట్ చదువు ఒత్తిడి కంటే మరొకటి మీ నుంచి ఆశిస్తున్నారు. అదేమిటో గుర్తించాలంటే పిల్లల మనోభావాలేమిటో తెలుసుకోవాలి. దానికి వాళ్లతో మాట్లాడడమే పరిష్కారం. మీ ఇష్టాలు, కోరికలు వాళ్లపై రుద్దడం కంటే ఆ చాయిస్ వాళ్లకే వదిలేయ్యండి.
శిరందాస్ ప్రవీణ్ కుమార్
80966 77450
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672