- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొర్రాసు మండుతూనే ఉంది
ప్రభుత్వం వారి న్యాయమైన హక్కుల పోరాట సభను రక్తసిక్తం చేసింది. ఆదివాసీ, గిరిజనులను అన్యాయంగా బలిపశువులను చేసింది. వారి హక్కుల గురించి మొదటిసారి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది ఈ సభే. ఇప్పటికి దేశంలో చాలా చోట్ల పోడు పట్టాల కోసం పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇంద్రవెల్లి అమరుల ఆశయాలను నెరవేర్చేవరకు వారి అమరత్వం ఆదివాసీ, గిరిజన గూడాలలో కార్చిచ్చులా రగులుతూనే ఉంటుంది. ఆ కొర్రాసు నెగడులో ఉద్యమాలు, పోరాటాలు ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి.
భారత రాజ్యాంగం మన దేశంలోని ప్రతి మనిషి హక్కులను వారి కులమతాలకు అతీతంగా కాపాడుతుంది. ప్రభుత్వ నిర్మాణం, పరిపాలన లాంటి విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. కానీ, కాలం మారినా, స్వతంత్ర భారతానికి 75 ఏండ్లు వచ్చినా కూడా ఆదివాసీలు ఇంకా వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. వారి పోరాట నినాదాలు మనకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. హక్కుల సాధనలో వారికి ఎన్నో యాతనలు, జీవన్మరణ పోరాటాలు తప్పడం లేదు. ప్రభుత్వాలెన్ని మారినా వారి కనీస అవసరాలు తీర్చడంలో, హక్కులు కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి. 'జల్-జంగల్-జమీన్' ఇంకా మన ముందు నినాదంగానే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జరిగిందే నాలుగు దశాబ్దాల నాటి ఇంద్రవెల్లి ఘటన.
సంపద కోసం వేషాలు
దేశంలో బ్రిటిష్‌వారు ప్రారంభ దశలో తీరం వెంబడి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. తర్వాత మైదాన ప్రాంతాలను స్వాధీనపరచుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. తర్వాత వారి దృష్టి పుష్కలంగా వనరులు ఉన్న అడవులపై పడింది. దానికి కారణం అప్పటికే బ్రిటన్‌లో వేగవంతమవుతున్న పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధి. ఇందుకోసమే వారు అపార అటవీ సంపదకు నిలయాలైన అడవిని ఆక్రమించుకోవడం ప్రారంభించారు. కొత్త కొత్త చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలు ఆదివాసీల, గిరిజనుల స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని భంగపరిచాయి.
భూ శిస్తు వసూలు విధానాలు గిరిజన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. దాంతో పాటు ఆదివాసీల స్వయం ప్రతిపత్తిని, సాంప్రదాయ పాలనను రద్దుపరచి గిరిజనేతరులను పరిపాలకులుగా, పెత్తందారులుగా బ్రిటిషు ప్రభుత్వం నియమించింది. దీంతో అడవినే సర్వస్వంగా భావించిన ఆదివాసీ, గిరిజనుల నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వారి తిరుగుబాటు చర్యలు బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాయి. ముఖ్యంగా బిహార్, బెంగాల్, మహారాష్ట్రలోని వివిధ తెగల, జాతుల తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించాయి. తెలంగాణలో అలాంటి పోరాటాలు ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలలో నిజాంను, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏకకాలంలో వ్యతిరేకిస్తూ రాంజీ గోండు, కొమురం భీం నాయకత్వంలో జరిగాయి. అయితే వీటన్నింటిని పాశవికంగా అణిచివేసిన ప్రభుత్వం వారి ఆశయాలను, ఆకాంక్షలను మాత్రం అణచలేకపోయింది.
హక్కుల కోసం కలబడి
హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చాక తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ 'దున్నే వాడిదే భూమి' అంటూ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. రాజ్యాంగబద్ద ఆందోళనలు కూడా కొనసాగాయి. ఆ పోరాటాలు ఆదివాసీలకు భూమిపై, అటవీ సంపదపై పాక్షిక హక్కులను మాత్రమే కల్పించగలిగాయి. ఈ క్రమంలో దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు కూలీ సంఘాలు క్రియాశీలక పాత్ర పోషించాయి. ఇందులో భాగంగా 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు ఇంద్రవెల్లిలో సభను నిర్వహించ తలపెట్టారు. ప్రధాన వక్తలుగా మహారాష్ట్ర కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ కార్యదర్శి కోబాడ్ గాంధీ, ఆర్ఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగమూర్తి, ఏపీసీఎల్‌సీ నాయకుడు ఎం. రంగనాథం, జననాట్య మండలి గద్దర్ పాల్గొంటారని ప్రకటించారు.
ఇది ఇష్టం లేని షావుకార్లు, చౌకీదార్లు, సారెదార్లు, వడ్డీ వ్యాపారులు ఇతరులతో కలిసి సభను అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సభను సీపీఐ (ఎం-ఎల్) పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని అప్పటి ఆదిలాబాద్ ఎస్‌పీకి చెప్పి సభకు అనుమతిని రద్దు చేయించారు. నిజానికి అప్పటికి పీపుల్స్‌వార్‌పై నిషేధం లేదు. అయినా, సభను రద్దు చేసి ఇంద్రవెల్లిలో 144 సెక్షన్ విధించారు. అప్పటికే ఆదివాసీ హక్కుల సంఘం ఈ సభకు వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చింది. జననాట్య మండలి పోస్టర్లు గూడాలలో వెలిశాయి. అదీకాక ఆ రోజు ఇంద్రవెల్లిలో వార సంత. దీంతో జనం తండోపతండాలుగా బయటకు వచ్చారు. గోండులు, కోయలు, నాయక్ పోడులు, పరధానులవంటి ఆదివాసీ తెగలు చీమల బారుల్లా ఇంద్రవెల్లికి బయలుదేరారు. బుద్ధిజీవులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
హెచ్చరికలు లేకుండానే
పోలీసులు ఆ సభకు వచ్చిన వారిని అడ్డుకుని బస్సులు, వాహనాలు దిగకుండానే వెనుకకు పంపించారు. అయినా, జనం పెరుగుతుండటంతో 144 సెక్షన్ అమలులో ఉందని, అందరూ వెళ్లిపోవాలని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. నిషేధాజ్ఞలు అంటే ఏమిటో తెలియని అమాయక ఆదివాసీలు అక్కడే చూస్తుండిపోయారు. సభ ఎంతకీ జరగకపోవడం. తమ నాయకులను అరెస్టు చేశారని, సభ జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తెలియడంతో ఇంద్రవెల్లి పరిసరాలలో గందరగోళం మొదలైంది. అది పెరిగి పెద్దదిగా మారి అప్పటికప్పుడు కాల్పులకు దారి తీసింది. పోలీసుల కాల్పులలో పదమూడు మంది ఆదివాసీలు అమరులయ్యారు. 60 మంది అమరులు అయ్యారని ప్రజా సంఘాలు తర్వాత ప్రకటించాయి. లెక్కలేనంత మంది గాయపడ్డారు.సాహు, అల్లం రాజయ్య రాసిన 'కొమురం భీమ్' పుస్తకం ముందుమాటలో వరవరరావు చెప్పినట్లు ఆదివాసీలు రాజ్యాంగం హామీ పడిన హక్కుల కోసం సభ పెట్టుకున్నారు. ఆ హక్కులన్నీ రాజ్యాంగం, ప్రభుత్వాలు ఆమోదించినవే. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కావాలన్నారు.
రహదారుల మీద తరాజు పెట్టుకుని అడవుల నుంచి గోండులు తెచ్చే అడవి సంపదను కొనేప్పుడు మార్వాడీలు, వ్యాపారులు సరైన తూకపు రాళ్లు వాడాలని డిమాండ్ చేశారు. ఇవే అంశాలను సభ ద్వారా ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. ప్రభుత్వం వారి న్యాయమైన హక్కుల పోరాట సభను రక్తసిక్తం చేసింది. ఆదివాసీ, గిరిజనులను అన్యాయంగా బలిపశువులను చేసింది. వారి హక్కుల గురించి మొదటిసారి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది ఈ సభే. ఇప్పటికి దేశంలో చాలా చోట్ల పోడు పట్టాల కోసం పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇంద్రవెల్లి అమరుల ఆశయాలను నెరవేర్చేవరకు వారి అమరత్వం ఆదివాసీ, గిరిజన గూడాలలో కార్చిచ్చులా రగులుతూనే ఉంటుంది. ఆ కొర్రాసు నెగడులో ఉద్యమాలు, పోరాటాలు ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి.
(నేడు ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవం)
డా. సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
9849618116